
మహబూబ్‌నగర్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సోమశిల-శ్రీశైలం బోటింగ్ శనివారం నుంచి అందుబాటులోకి రానున్నది. శ్రీశైలం రి జర్వాయర్ నిండుకుండను తలపిస్తుండడంతో తెలంగాణ పర్యాట క శాఖ బోటింగ్‌కు పచ్చజెం డా ఊపింది. హైదరాబాద్ నుంచి పర్యాటక శాఖ ఏర్పా టు చేసిన ప్రత్యే క బస్సుల్లో వచ్చి సోమశిల నుంచి శ్రీశైలం వెళ్లేలా టూర్ సిద్ధం చేశారు. హైదరాబాద్ నుంచే కాకుండా కేవలం సోమశిల-శ్రీశైలం వెళ్లేందుకు పర్యాటక శాఖ ప్యాకేజీని రెడీ చేసింది. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌తో సోమశిల కళకళలాడుతుండడంతో చాలామంది పర్యాటకు లు సోమశిల వచ్చి కృష్ణమ్మ అందాలు చూసి వెళ్తున్నారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు గతంలో ఉన్నట్లుగా బోటింగ్ సౌకర్యం ఉందా.. అంటూ నిత్యం స్థా నికంగా ఉన్న పర్యాటక శాఖ సిబ్బందిని అడిగుతున్నా రు. ఈ క్రమంలో శనివారం నుంచి బోటింగ్ ఏర్పాటు చేయడంతో ఆన్లైన్లో సీటు బుక్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోటింగ్ చేసి మధురానుభూతులను మది నిండా నింపుకొనేందుకు రెడీ అవుతున్నారు.
సముద్రాన్ని తలపించేలా నదిలో విహరించేందుకు గతంలో అందరూ పాపికొండలు వెళ్లేవారు. భద్రాచ లం నుంచి బయలుదేరి రాజమండ్రి వరకు గోదావరి లో బోటింగ్ చేసేవారు. ఇప్పుడు అలా నదిలో విహరించేందుకు పాపికొండలు టూర్ వెళ్లనవసరం లేదు. మన వద్దే అంతకంటే అందమైన నల్లమల అడవుల మీదుగా కృష్ణానదిలో బోటులో ప్రయాణించే అవకాశాన్ని తెలంగాణ పర్యాటక శాఖ కల్పిస్తున్నది. గతంలోనూ కృష్ణానది వరదతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండను తలపించినా సమైక్య పాలకులకు పర్యాటకం కా నరాలేదు. వారికి సీమాంధ్రలోని పర్యాటక ప్రదేశాలపైనే ప్రేమ ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ పర్యాటకానికి కొత్త రూపు వచ్చింది. అందులో భాగంగానే ఎకో టూరిజాన్ని తెలంగాణ పర్యాటక శాఖ రూ.100 కోట్లతో ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద పుష్కర ఘాట్ నుంచి శ్రీశైలం వరకు ప్రయాణిచేందుకు వీలుగా పెద్ద లాంచీలను ఏర్పాటు చేశారు. సోమశిల వద్ద పర్యాటకుల విడిది కోసం కాటేజీలు, హోటల్ నిర్మించారు. ఇప్పుడు సోమశిల చక్కటి పర్యాటక సొబగులను సంతరించుకొని ఆకట్టుకుంటున్నది. సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీలో ప్రయాణించేందుకు పర్యాటకులు ఎదురుచూస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా లాంచీ ప్రయాణాలు నిలిచిపోయాయి. ఈ ఏడాది కరోనా తగ్గుము ఖం పట్టడంతో శనివారం నుంచి సోమశిల-శ్రీశైలం టూర్ ప్రారంభం కానున్నది. ఇందుకుగానూ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది.
ప్రయాణం ఇలా..
నల్లమల అడవులను దాటుకుంటూ..
సోమశిల నుంచి శ్రీశైలం వరకు క్రూయిజ్ బోట్లలో ప్రయాణించేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు బయలుదేరి ఆరున్నర గంటల్లోగా బోటు శ్రీశైలం చేరుకుంటుంది. సుమారు 90 కి.మీ ప్రయాణం సాగుతుంది. నల్లమల అడవుల అందాల ను దాటుకుంటూ ముందుకు వెళ్తుం ది. మధ్యమధ్యలో వచ్చే చిన్నచిన్న దీవులు (తిప్పలు) ఆకట్టుకోనున్నాయి. నల్లమ ల అడవులను చీల్చుకుంటూ ముందుకు సాగినట్లుంటే కృష్ణమ్మ అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. దట్టమైన అడవులు, అక్కడక్కడ సందడి చేసే వన్యప్రాణులను చూసేందుకు పర్యాటకులు ఎగబడతారు. చరిత్రకు చిరునామాగా నిలిచే ఆంకాలమ్మ కోట, శ్రీశైలం చేరుకుంటామనగా వచ్చే అక్కమహాదేవి గుహలు ఆధ్యాత్మికతకు చిహ్నాలు. శ్రీశైలం చేరుకున్న తర్వాత మల్లన్న దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో సాక్షి గణపతి దర్శనం చేసుకొని డ్యాంసైట్ వద్ద శ్రీశైలం ప్రాజెక్టు అందాలు చూసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ వెళ్లే పర్యాటకుల బస్సు ప్రారంభం అవుతుంది.