వనపర్తి రూరల్, మే 23 : రైతులకు అందిస్తున్న ఎరువు ల సబ్సిడీలో కేంద్రం పాత్ర శూన్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. జిల్లాకేంద్రంలోని ఇందూ గార్డెన్లో విశ్వ ఆగ్రోస్ మార్క్‌ఫెడ్ గో ల్డ్ కార్యక్రమాన్ని మంగళవారం మంత్రి జ్యోతి ప్రజ్వల న చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఎ రువులను మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మార్క్‌ఫెడ్ సభ్యుడు విజయ్‌కుమార్‌తో కలిసి విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎరువుల సబ్సిడీ, ఫసల్ భీమాపై చేసే వ్యాఖ్యలు హాస్యాస్పదంగా, అమాయకంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఉండవని, రాష్ర్టాల ఆదాయం మీదనే కేంద్రం మనుగడ సాగిస్తుందని.. మోదీ ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నట్లు కిషన్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదన్నారు. దేశంలో హరితవిప్లవం మొదలైనప్పటి నుంచి ఎరువులపై సబ్సిడీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని.. మోదీ అధికారంలోకి వచ్చాకే సబ్సిడీ ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ చ్చాకే సబ్సిడీ తగ్గించి కోత విధిస్తున్నారని గుర్తు చేశారు. అలాగే మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే ఫసల్ బీమా ఎందుకు అమలు కావడం లేదో రాష్ట్ర బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు.
ఇందులో ప్రీమియం వసూలు ఎక్కువ, రైతులకు ఇచ్చే పరిహారం తక్కువగా ఉందన్నారు. ఈ పథకానికి మొదట్లో తెలంగాణ ప్రభుత్వం వరుసగా నాలుగేండ్ల పాటు ఏడాదికి రూ.600కోట్ల చొప్పున బీమాకు చెల్లించిందన్నారు. కాగా రాష్ట్రంలో రైతులకు పంట నష్టం కింద ఇచ్చింది కేవలం రూ.1,800కోట్లేనని వివరించారు. ఇది గ్రహించిన సీఎం కేసీఆర్ ఈ పథకం బీమా కంపెనీలకు మాత్రమే మేలు చేస్తుందని.. రైతులకు లాభం లేదని గ్రహించి రాష్ట్రంలో ఈ పథకాన్ని పక్కనబెట్టామని తెలిపారు. రైతులకు ఉపయోగపడే పంటల బీమా పథకం స్వతహాగా రాష్ట్ర పరిధిలో తీసుకు రావాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచనన్నారు. సేంద్రియ సాగుతోనే భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని, ఈ ఆలోచనతోనే రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోలేమని.. సమస్య పరిష్కార దిశగా ముందుకు వెళ్లే ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ కొన్ని సూచనలు చేశారని చెప్పారు. మొదటగా యాసంగి వరి సాగు మార్చి 31లోగా పూర్తి చేసుకొనేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
వానకాలం సీజన్ పూర్తి అయ్యేలోగా యాసంగి నారు సిద్ధం చేసుకునేలా చూడాలన్నారు. అప్పుడే ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వడగండ్ల వానల నుంచి కొంతమేర పంట నష్టాలను నివారించొచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని తెలిపారు. పంటల మార్పిడి, సీజనల్ పంటల సాగుకు ముందు ప్రతి రైతు పొలంలో భూసార పరీక్షలు చేయించుకొని, నిపుణులు, శాస్త్రవేతల సూచనలకు అనుగుణంగా ఎరువులు, రసాయనాలను వాడి పెట్టబడులు తగ్గించుకోవాలన్నారు. మనస్సు పెట్టి పనిచేస్తే రైతును మించిన శాస్త్రవేత్త సృష్టిలో లేడన్నారు. కేంద్రంలోని ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతున్నదని దుయ్యబట్టారు. ప్రస్తుత పద్ధతులతో పంటలు సాగుచేస్తే వందేండ్ల తర్వాత భూమిపై ఒక్క పంట కూడా సాగవదని, పంటలన్నీ విషతుల్యమవుతాయన్నారు. ఇప్పటికైనా రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు ఉపయోగించేలా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు రైతులకు అవగాహన పెంపొందించే కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
తెలంగాణలో సాగునీటితోపాటు చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలు, సబ్సిడీపై గొర్రె పిల్లలు, రైతులకు పంట పెట్టుబడి, పంటల కొనుగోళ్లు వందశాతం చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ప్రతి జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఆహారశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు సిద్ధం చేస్తున్నదన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో 40వరకు ఆయిల్ పాం పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయన్నారు. విశ్వ అగ్రిటెక్ మార్క్‌ఫెడ్ సేంద్రియ ఎరువులను రాష్ట్రంలోని ప్రతి పీఏసీసీఎస్ సెంటర్లో రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. అంతకుముందు రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి, కలెక్టర్, డైరెక్టర్లు సేంద్రియ ఎరువులు, సాగుపై ప్రభుత్వం చేస్తున్న కృషిపై మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్లు, శాస్త్రవేతలు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.