నారాయణపేట టౌన్, ఆగస్టు 8 : సీజనల్ వ్యాధులపై ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్యశాఖ అధికారు లు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా దోమల వల్ల కలిగే మలేరియా, చికెన్‌గున్యా, డెంగీ, వైరల్ ఫీవర్‌తో కలుషితమైన నీటితో వచ్చే డయేరియా తదితర వ్యాధుల నివారణకు వైద్యు లు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అధికారులు తీసుకుంటున్న చర్యలతో రెండేండ్లుగా దోమల నుంచి వచ్చే వ్యాధులు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. జి ల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వైద్యాధికారులతో సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టవల్సిన కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా చూస్తున్నారు. వైద్య సి బ్బంది ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో డెంగీ కేసులు నమోదైనట్లయితే ఆ ప్రాం తంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దోమల నివారణకు ఫె యత్రాం స్ప్రేను ఉపయోగించడం, కాల్వల్లో లార్వా వృద్ధి చెందకుండా థీమోఫాక్స్ను కలిపి చల్లుతున్నారు. డెంగీ సోకిన వ్యక్తికి కాంటాక్ట్ అయిన వారిని గుర్తించడం, వారికి సీరం పరీక్షలు నిర్వహిస్తూ డెంగీ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతి శుక్రవారం డ్రైడేను నిర్వహిస్తూ…
గ్రామాలు, పట్టణాల్లో ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం ని ర్వహిస్తున్నారు. వైద్యులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇం టింటికీ తిరుగుతూ దోమల వల్ల వచ్చే వ్యాధులు, నియంత్రణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి లార్వా వృద్ధి చెందకుండా మందులు చల్లడం, పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
దోమల వ్యాప్తిని అరికట్టాలి
వారం రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడడం, రాను న్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో దోమల వల్ల కలిగే వ్యాధులను అరికట్టాల్సిన అవసరం ఉందని వైద్యులు సూ చిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, మురుగు కాల్వలు శుభ్రంగా ఉంచేలా చూడాలి, దో మలు వృద్ధి చెందే ప్రాంతాలైన పాతటైర్లు, కొబ్బరి చిప్పలు, ఇం టి పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం సమయంలో ఇండ్లల్లోకి దోమలు ప్రవేశించకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి, నిద్రించే సమయంలో దోమ తెరను వాడాలి.
కొనసాగుతున్న ఫీవర్ సర్వే
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం వైద్య సిబ్బందితో ఫీవర్ సర్వే చేయిస్తున్నది. అయితే సీజనల్ వ్యాధుల నివారణకు ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతున్నది. మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేపడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మందులు అందజేస్తున్నా రు. అయితే ఆయా లక్షణాలను బట్టి వారి రక్త నమూనాలను తీసుకొని ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించడంతో వ్యాధిని గుర్తిస్తున్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగీ, చికెన్ గున్యా తదితర వ్యాధులు ఉన్నట్లయితే దవాఖానలకు పంపించడంతో వాటికి సంబంధించి చికిత్సలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
సత్ఫలితాలు ఇస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఆయా కార్యక్రమాల ద్వారా పల్లెలు, పట్టణాల్లో మురుగు నీ రు నిల్వ ఉండకుండా చూడడం, గుంతలను, లోతట్టు ప్రాంతాలను, పాడుబడి న బావులను పూడ్చివేయడం, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా ప్రజలకు అవగాహన కల్పించడం, విస్తృతంగా పా రిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతో దోమ ల ద్వారా వచ్చే వ్యాధులు ప్రబలకుండా అడ్డుకట్ట వేస్తున్నారు.
కేసుల నమోదులో తగ్గుదల
మూడేండ్లుగా పరిశీలిస్తే మలేరియా, చికెన్ గున్యా, డెంగీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నది. 2019 జనవరి నుంచి 2019 డిసెంబర్ 31వ తేదీ వరకు పరిశీలిస్తే జిల్లాలో మొత్తం 78,944 మందికి సీరం పరీక్షలు నిర్వహించగా 3 మలేరియా కేసులు, 127 డెంగీ కేసులు, 8 చికెన్ గున్యా, 3 మెదడు వాపు కేసులు నమోదుకాగా ఒకరు డెంగీ వ్యాధితో మరణించినట్లు వైద్యాధికారులు తెలిపారు.
అయితే 2020 జనవరి నుంచి 2020 డిసెంబర్ 31వ తేదీ వరకు పరిశీలిస్తే 71,301 మందికి సీరం పరీక్షలు నిర్వహించగా 2 మలేరియా కేసులు, 60 డెంగీ కేసులు, 1 చికెన్ గున్యా, 1 మెదడువాపు కేసులు నమోదయ్యాయి. అందులో డెంగీ కేసు లు సగానికి తగ్గాయని చెప్పవచ్చు. 2021 జనవరి నుంచి 20 21 జూలై 31వ తేదీ వరకు పరిశీలిస్తే మొత్తం 44,499 మందికి సీరం పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో 14 డెంగీ కేసు లు నమోదయ్యాయి. అందులో మరికల్ పీహెచ్సీ పరిధిలో 3, మాగనూర్ పీహెచ్సీ పరిధిలో 1, కోటకొండ పీహెచ్సీ పరిధిలో 5, నర్వ పీహెచ్సీ పరిధిలో 1, దామరగిద్ద పీహెచ్సీ పరిధిలో 1, ఊట్కూర్ పీహెచ్సీ పరిధిలో 1, కర్ని పీహెచ్సీలో 2 డెంగీ కేసులు నమోదయ్యాయి.
యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నాం..
జిల్లాలోని పీహెచ్‌సీల పరిధిలో ప్రణాళికా బద్ధంగా ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ చేపడుతు న్నాం. బుధ, శని వారాలు తప్ప మిగతా 5 రోజులు ఎంపిక చేసిన గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడం, హెల్త్ ఎడ్యుకేషన్‌పై, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆయా గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడూ ఫొటోల ద్వారా పంపించాలని వైద్య సిబ్బందిని ఆదేశించాం.
-డాక్టర్ రామ్‌మనోహర్‌రావు, డీఎంహెచ్‌వో