నాగర్ కర్నూల్, ఆగస్టు 16: జిల్లాలో పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సర్పంచులకు నోటీసులు జారీ చేయాలని, ఇప్పటికే నోటీసులు జారీ చేసినా స్పందంచని వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్ మనూచౌదరి జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలపై మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హరితహారం, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం, పారిశుధ్యం తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం ఇప్పటివరకు పూర్తి చేయని సర్పంచులకు ఇదివరకే నోటీసులు ఇచ్చిఉంటే అలాంటి వారిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. మిగతా వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. మిగిలిపోయిన పనులు వారం రోజుల్లో పూర్తి చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. హరితహారంపై మాట్లాడుతూ ఇప్పటివరకు తవ్విన గుంతల్లో మొక్కలు నాటి పూర్తి చేయాలని, మిగిలిన ప్రాంతాల్లో వెంటనే గుంతలు తవ్వి మొక్కలు నాటాలని ఆదేశించారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటి ఆన్లైన్లో మస్టర్ అప్లోడ్ చేయాలన్నారు.
వచ్చే వారం సమీక్ష వరకు మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి కావాలని ఆదేశించారు. పల్లెప్రకృతి వనాలకు సంబంధించి 31 ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో చెల్లింపులు జరగలేదని, వాటిని వెంటనే ఆన్లైన్ చేసి చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. రైతు కల్లాల ఏర్పాటుకు ఆసక్తి చూపించని వారి పేర్లు తొలగించి కొత్తవారి పేర్లు నమోదు చేసి నివేదికను ఎల్లుండి సాయంత్రంలోగా సమర్పించాలని సూచించారు. 80 శాతం షెడ్లలో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారని మండల అభివృద్ధి అధికారులు కలెక్టర్‌కు వివరించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి తనఖీ చేస్తానని, ఒకవేళ అందుకు భిన్నంగా కనిపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారం రోజుల్లో జిల్లాలోని బహుళ కార్మికులకు బీమా కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఆధీనంలోని విద్యుత్ కనెక్షన్లు విద్యుత్‌శాఖ వారు సూచించిన విధంగా ఉన్నాయా? లేక అవసరం లేనివి తొలగించాలా అనేది పరిశీలించి గ్రామాల వారీగా మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీ విద్యుత్ మీటర్లు ఉన్నాయో వారం రోజుల్లో నెంబర్లతో సహా నివేదిక ఇవ్వాలని డివిజినల్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పేదవారికి ఇచ్చే ఆసరా పింఛన్ వయస్సును 57 సంవత్సరాలకు కుదించినందున అర్హులు 31వ తేదీలోగా మీసేవలో దరఖాస్తు చేసుకునేలా అన్ని గ్రామ పంచాయతీల్లో టాంటాం వేయించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ నర్సింగరావు, డీపీవో రాజేశ్వరి, డివిజినల్ పంచాయతీ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, ఎంపీవోలు పాల్గొన్నారు.