బాలానగర్/గద్వాలటౌన్, ఆగస్టు 8: శ్రావణ మాసంలో ప్రతిరోజూ ఆధ్మాతిక్మకమే. సోమవారం నుంచి నెల రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణం.. శ్రావణ సందడి ప్రారంభం కానున్నది. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో శివుడిని పూజిస్తే శివకటాక్షం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. మంగళవారం ఆంజనేయస్వామికి శుభదినం, సంతాన భాగ్యాన్ని కలిగించే సుబ్రహ్మణ్యేశ్వురుడు మంగళవారమే జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణమాసంలో మంగళవారం ఆయా దేవవలను ఆరాధిస్తే శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. హరిహరసుతుడైన అయ్యప్పను బుధవారం కొలుస్తారు. గురువారం సాయిబాబా, దక్షిణామూర్తిని కొలుస్తారు. అభిషేకం చేసి బిల్వపత్రం సమర్పిస్తే దక్షిణామూర్తి సంతృప్తి చెందుతారు. శ్రావణ శుక్రవారం వ్రతం ఆచరిస్తే అమ్మవారి కరుణాకటాక్షాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో పవిత్రమైన రోజు శుక్రవారం. కుంకుమార్చన, ఎర్రని పూలతో కలిపి మల్లెమాలను అమ్మవారికి సమర్పించడం అత్యంత శుభకరంగా మహిళలు మంగళగౌరి, మహాలక్ష్మివ్రతం ఆచరిస్తారు. శనివారం కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని కొలిస్తే కోరిన వరాలిస్తాడని భక్తుల నమ్మకం.
స్వామివారికి తులసీదళాల మాల సమర్పిస్తే శుభం కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు. ఆదివారం ప్రత్యక్ష భగవాసుడు, ఆదిత్యుడికి ప్రీతికరమైన రోజు, సూర్యుడు నమస్కార ప్రియుడు, ఆయనకు భక్తితో నమస్కరిస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడని, ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే పంచమి రోజున ముఖానికి, పాదాలకు పసుపు రాసుకుని కుంకుమ ధరించి పుట్టలో పాలుపోసి నాగదేవతను పూజిస్తారు. ఈ నెల 9నుంచి సెప్టెంబర్ 7వరకు శ్రావణ మాసం ఉంటుందని పురోహితులు పేర్కొన్నారు. ఈ నెల 9న శ్రావణమాసం ప్రారంభం, 13న నాగపంచమి, స్కందషష్టి కల్కి జయంతి, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 19న ఛాయాచిత్ర దినోత్సవం, 20న వరలక్ష్మీవ్రతం, 22న రాఖీపౌర్ణమి, 29న శ్రీకృష్ణ జన్మాష్టమి, 30న వైష్ణవ శ్రీకృష్ణ జయంతి, సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం, 6న పొలాల అమావాస్య వేడుకలు జరుపుకొంటారు.
మంగళగౌరీ వ్రతం
భర్త మేలు కోరి సౌభాగ్య సంపదకోసం మంగళగౌరీ వ్రతం చేస్తారు. పళ్లైన మొదటి ఐదేండ్లు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో ఈ వ్రతం చేస్తారు. కొత్త పెళ్లి కూతుర్లు తూర్పు దిక్కుగా మండపంలో కలశం పెట్టి మంగళగౌరిని పూజిస్తారు. ఒక తోరణం గౌరీదేవికి సమర్పిస్తారు. గౌరీదేవి ప్రతిరూపాలుగా వాయనాలు పుచ్చుకుంటారు.
వరలక్ష్మీ వ్రతం
నిత్య సౌభాగ్యం కోసం మహాలక్ష్మిని పూజిస్తూ చేసే వ్రతమిది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఆష్ట ఐశ్యర్యాలు ప్రసాదించాలని సౌభాగ్యాలతో చూడాలని లక్ష్మీదేవిని వేడుకుంటారు.
రక్షాబంధన్
శ్రావణపౌర్ణమి , రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణమిగా జరుపుకొంటారు. సోదరులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రాప్తించాలని ప్రార్థిస్తూ అక్కాచెల్లెళ్లు రాఖీలు కడుతారు. యజ్ఞోపవీత ధారణకు అధికారం ఉన్న ప్రతివ్యక్తి ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.
శ్రీకృష్ణాష్టమి
శ్రావణమాసంలో శ్రీ కృష్ణాష్టమి రోజున ఇండ్లను శుభ్రపరిచి తోరణాలతో అలంకరించి ఇంటి ముంగిళ్లలో బాలకృష్ణుడి పాదముద్రలు వేస్తారు. ఉట్లు కొట్టి ఉత్సవాలు జరుపుతారు. చిన్నారులను గోపికలుగా, శ్రీకృష్ణుడిగా అలంకరిస్తారు.