నాగర్కర్నూల్, ఆగస్టు 10: హరితహారంలో ఇ చ్చిన లక్ష్యం మేరకు వందశాతం మొక్కలు నాటాల్సిందేనని, ఎలాంటి మినహాయింపు ఉండదని కలెక్టర్ శర్మన్ తేల్చి చెప్పారు. ప్రతి మండలకేంద్రంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతి వనాల పనుల్లో వేగం పెంచాలని ఆయన సూచించారు. మంగళవారం సాయం త్రం కలెక్టరేట్లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే అన్ని మండలాల్లో బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాలు గుర్తించి అప్పగించామన్నారు. ఆ స్థలాలను చదును చేసి మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నా టాలని, ప్రధాన రహదారిపై మూడు వరుసల్లో మొక్కలు నాటి వాటి ఫొటోలు వాట్సాప్లో పెట్టాలని సూచించారు. అధికారులు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి హరితహారంపై పూర్తిస్థాయి పర్యవేక్షణ చేయాలన్నారు. వారం రోజుల్లో గుంతలు తవ్వే పనులు పూర్తి కావాలని, ఆన్లైన్ ప్రక్రియ సైతం పూర్తి చేసి ఫొటోలు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ మనూచౌదరి, డీఆర్డీఏ పీడీ నర్సింగరావు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.