
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎట్టకేలకు కొల్లాపూర్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరనున్నది. దశాబ్దాలుగా ఎన్నికల హామీగానే మిగిలిపోయిన సోమశిల- సిద్దేశ్వరం బ్రిడ్జి కల త్వరలో సాకారం కానున్నది. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ సోమశిల, ఆత్మకూరు మీదుగా నంద్యాల వరకు కొత్తగా 122కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పటికే కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ మీదుగా కర్నూల్ జిల్లాఆత్మకూరు సమీపంలోని కరివెన వరకు హైవే నెంబర్ 167-కే నిర్మించనున్నట్లు కేంద్రం నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. అయితే పనులు త్వరగా చేపట్టి వెనుకబడిన ప్రాంతమైన కొల్లాపూర్ రూపురేఖలు మార్చేందుకు కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. కొత్త హైవేతోపాటు హైదరాబాద్-శ్రీశైలం హైవే నాలుగు లేన్లుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. సోమశిల వంతెన, హైవే నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నందున నాగర్‌కర్నూల్ జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సోమశిల వద్ద వంతెన లేక ఇక్కట్లు
కృష్ణానదికి ఇరువైపులా ఉన్న నదీతీర గ్రామాల ప్రజలకు ఏండ్ల నుంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కొల్లాపూర్ నుంచి కర్నూల్ జిల్లా వైపునకు వెళ్లే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. తీరం అటువైపు ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా ప్రజలు పూర్వం నుంచి కూడా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సింగోటం లక్ష్మీనర్సింహస్వామిని ఇలవేల్పుగా కొలుస్తారు. ఏటా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలకు తీరం అటువైపు పగిడ్యాల, నందికొట్కూరు, మిడ్తూరు, జూపాడ్బంగ్లా, కొత్తపల్లి, పాములపాడు, ఆత్మకూరు, వెలుగోడు తదితర మండలాల నుంచి వేలాదిగా తరలివస్తారు. కృష్ణానది మీదుగా మరబోట్లు, నాటు పడవల్లో ప్రయాణించి మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశిల తదితర ప్రాంతాల మీదుగా సింగోటానికి చేరుకొంటారు.
జాతీయ రహదారికి లేఖ
సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణంతోపాటు కల్వకుర్తి-కొల్లాపూర్, సోమశిల, సిద్దేశ్వరం, ఆత్మకూర్ మీదుగా కరివెన వరకు 122కిలోమీటర్ల మేర హైవే నిర్మాణానికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి గతేడాది జూన్ 26న రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. మంత్రి వేముల మరుసటిరోజే ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీకి పూర్తి వివరాలతో లేఖ రాశారు. సీఎం కేసీఆర్ కేంద్రంతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జాతీయ రహదారి నిర్మాణానికి అంగీకరిస్తూ హైవే నెంబర్ 167-కే జారీ చేశారు.
జాతీయ రహదారి ఏర్పాటైతే..
కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు జాతీయ రహదారి ఏర్పడితే నాగర్‌కర్నూల్ జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి, శ్రీశైలం మీదుగా తోకపల్లి రోడ్డు వరకు (హైవే నెంబర్ 765) ఉంది. కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, సోమశిల, సిద్దేశ్వరం, కొత్తపల్లి మీదుగా కరివెన (ఆత్మకూరు) వరకు ప్రతిపాదిత హైవే నెం.167-కే నిర్మించనున్నారు. కరివెన నుంచి నంద్యాల వరకు జాతీయ రహదారి నెంబర్ 340 ఈ హైవే అనుసంధానం అవుతుంది. తద్వారా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లేందుకు ఈ మార్గం ద్వారా సుమారు 80కిలోమీటర్లు తగ్గుతుంది. ఇక నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి కర్నూల్ జిల్లా ఆత్మకూరు చేరుకునేందుకు ప్రస్తుతం 171కి.మీ కాగా.. వంతెన నిర్మాణంతో 120కి.మీ తగ్గనున్నది. కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ పట్టణాలు మరింత అభివృద్ధి చెందనున్నది. తెలంగాణలో 96కి.మీ, ఏపీలో 26కి.మీ మేర ఈ రహదారి నిర్మాణం జరుగనున్నది.
బ్రిడ్జితోపాటు హైవే మంజూరు
కొల్లాపూర్ ప్రజల చిరకాల వాంఛ సోమశిల- సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశాం. బ్రిడ్జి నిర్మించేందుకు అటువైపున ఏపీ ఉండటంతో ఇబ్బంది లేకుండా కేంద్రం ద్వారా చేపట్టాలని సీఎం కేసీఆర్ భావించారు. రాష్ట్ర ప్రభుత్వానికి బ్రిడ్జి నిర్మాణం కోసం లేఖ రాస్తే ఒక్కరోజులోనే కేంద్రానికి పంపించి బ్రిడ్జితోపాటు హైవే నిర్మాణానికి సైతం అనుమతి తీసుకొచ్చారు. హైవే మంజూరు చేయించడమే కాకుండా త్వరగా పనులు చేపట్టేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కొల్లాపూర్ ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు.