అంబులెన్స్ అందించినందుకు కృతజ్ఞతలు : మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కెనరా బ్యాంకు పాత్ర ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వానికి అప్పులు అందించిందని తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కెనరా బ్యాంకు నూతన శాఖను కలెక్టర్ యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. కెనరా బ్యాంకు శాఖలో అన్నిరకాల రుణసదుపాయాలు ఉన్నాయని, గోల్డ్‌లోన్ తక్కువ వడ్డీకి అందిస్తున్నట్లు చెప్పారు. తనకు అవసరం ఉన్నదని, త్వరలో తానూ గోల్డ్‌లోన్ పెట్టబోతున్నట్లు చెప్పారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత వనపర్తి జిల్లాలో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. జిల్లా అభివృద్ధిలో కెనరా బ్యాంకు భాగస్వా మ్యం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీశ్రేణులు, ప్రజాప్రతినిధు లు, అధికారులు త్వరలో ఖాతాదారులు అవుతారన్నారు. ఈ బ్యాంకు ఆధ్వర్యంలో పెద్దమందడి మండలానికి అంబులెన్స్‌ను సీఎస్ఆర్ కింద ఇచ్చినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ యాస్మిన్ మాట్లాడుతూ ప్రజలకు సేవలందిస్తున్న కెనరా బ్యాంకుకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. కెనరా బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్, తెలంగాణ కెనరా బ్యాంకు చీఫ్ కేహెచ్ పట్నాయక్ మాట్లాడుతూ సీఎస్ఆర్ కింద రూ.30 లక్షలతో ఆంబులెన్స్ అందించినట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేశామని, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, మెదక్ జిల్లాల్లో కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. డిపాజిట్లు తక్కువగా ఉన్నప్పటికీ రుణాలు ఎక్కువ అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎంపీపీ కిచ్చారెడ్డి, కెనరా బ్యాంకు ఎల్ఎండీ సురేశ్, డీజీఎం రవిశర్మ, బ్యాంకు మేనేజర్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.