మహబూబ్‌నగర్, ఆగస్టు 20 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : పాలమూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం మొండిచేయి చూపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినా.. కేంద్రం ఎయిర్‌పోర్టు ఊసెత్తడం లేదు. ఉడాన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో చిన్నచిన్న విమానాశ్రయాలను నిర్మించాలని కేంద్రం ప్రతిపాదించింది. తెలంగాణ రాష్ర్టానికి ఆరు ఎయిర్‌పోర్టులు ఇస్తామని మూడేండ్ల కిందట ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖ అధికారులు, కేంద్ర ఏవియేషన్ అధికారులతో సమన్వయం చేసి స్థలాలను ఎంపిక చేయాలని కోరింది. ఇక్కడి ప్రజాప్రతినిధుల కోరిక మేరకు పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారికి అనుకొని ఉన్న దేవరకద్ర నియోజకవర్గాన్ని ఫైనల్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మూడు మండలాల్లో స్థలాలను పరిశీలించారు. ఇది కూడా పూర్తయి దాదాపు ఏడాది కావస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదు. తాజాగా కేవలం మూడు మాత్రమే ఇస్తామని సూచనాప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. దీంతో పాలమూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు ప్రక్రియకు కేంద్రం అడ్డంకులు సృష్టించడంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు.
స్థలాలు ఎంపిక చేసినా..
వెనుకబడిన పాలమూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు వస్తే అభివృద్ధికి ఊతం ఇచ్చినట్లు అవుతుందని రా ష్ట్ర ప్రభుత్వం భావించింది. జాతీయ రహదారికి అ నుకొని అన్ని విధాలా అనువుగా ఉన్న దేవరకద్ర ని యోజకవర్గాన్ని ఎంపిక చేశారు. దీంతో భూత్పూర్ మండలం మద్దిగట్ల, రావులపల్లి, మూసాపేట మండలం తుంకినీపూర్, కనకాపూర్, వేముల, దేవరకద్ర మండలం చౌదర్పల్లి గ్రామాల శివారులో కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం భూములను గుర్తించారు. వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కేంద్ర బృందానికి నివేదించారు. ఒక్కోచోట సుమారు 400 ఎకరాల నుంచి 500 ఎకరాల వరకు భూములు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఇలా వచ్చారు.. అలా పోయారు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ఏవియేషన్ అధికారుల బృందం ఆరు సార్లు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించింది. మొదట అడ్డాకుల మండలం గుడిబండ గ్రామం వద్ద పరిశీలించారు. 300 ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాలే ఉండడంతో ఇదే ఫైనల్ అవుతుందని భావించారు. అయితే, జాతీయ రహదారిని ఆనుకొని ఉండడం, హైటెన్షన్ విద్యుత్ లైన్ ప్రతిపాదిత స్థలానికి సమీపంలో ఉండడంతో ఫీజుబులిటీ ఇవ్వలేదు. ఇంకోచోట స్థలం కావాలని కేంద్ర బృందం సూచించడం తో దేవరకద్ర మండలం చౌదర్పల్లి వద్ద స్థలాన్ని చూపించగా, దానికి కూడా ఒప్పుకోలేదు. దీంతో మూసాపేట, భూత్పూర్ మండలాల్లో మరో రెండు చోట్ల స్థలాలను పరిశీలించారు. కేంద్ర బృందం స భ్యులు ఇలా వచ్చారు.. అలా చూశారు.. వెళ్లిపోయారే తప్పా ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఎక్కడ అనువుగా ఉందో తేల్చలేదు.
పాలమూరు జిల్లాపై కేంద్రం కక్ష..
ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్లతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తుంటే.. తెలంగాణపై, ముఖ్యంగా ఈ జిల్లాపై కేంద్రం కక్ష సాధిస్తున్నది. రూపాయి కూడా ఇవ్వకపోగా రాష్ర్టాలకు న్యాయంగా రావాల్సిన వాటాలను కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని సుష్మాస్వరాజ్‌తోపాటు ఇతర బీజేపీ నేతలు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. ఇప్పుడు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదో ఇక్కడున్న ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి. పాలమూరు జిల్లాలో ఎయిర్‌పోర్టుకు అనువైన స్థలాలను చూసి కూడా కేంద్రం కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నది.
– శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి
ప్రజలే బుద్ధి చెబుతారు..
దేవరకద్ర నియోజకవర్గం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువుగా ఉంటుంది. ఈ నియోజకవర్గం చుట్టూ రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. కేంద్ర బృందానికి అనుకూలమైన స్థలాలు చూయించాం. రైతులు కూడా భూములిచ్చేందుకు ఒప్పుకున్నారు. అన్ని వసతులు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఒక చోట వద్దంటే మరోచోట, అక్కడా వద్దంటే ఇంకో చోట స్థలాలు చూపించాం. అధికారులు కూడా సందేహాలు నివృత్తి చేశారు. తెలంగాణకు ఆరు విమానాశ్రయాలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోకపోతే కేంద్రానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
– ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే