మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హైదరాబాద్ తరహాలో మహబూబ్‌నగర్ పట్టణం నడిబొడ్డున ట్యాంక్ బండ్‌పై నెక్లెస్ రోడ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటక, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ నెక్లెస్ రోడ్ ఏర్పాటుకు అంగీకరించారు. రూ.24.52 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం జీవో ఆర్టీ నెంబర్ 64 విడుదల చేసిందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ మాదిరిగా మహబూబ్‌నగర్‌కు కూడా నెక్లెస్ రోడ్డు తీసుకువస్తానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ నెల 22న నిర్వహించిన మహబూబ్‌నగర్ మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో చెప్పిన 3 రోజులకే జీవో విడుదల కావడం విశేషం. సాధ్యమైనంత త్వరగా నెక్లెస్ రోడ్ పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ నిధులతో ప్రస్తుత ట్యాంకుబండ్ ఎత్తు పెంపు, విస్తరణ, పెద్ద చెరువు పూడిక తీత, నీటి శుద్ధి వంటి ప నులను చేపడతామని మంత్రి తెలిపారు. 2.4 కిలోమీటర్ల మేర ట్యాంక్ బండ్ చుట్టూ రోడ్, ఫుట్‌పాత్ ఏ ర్పాటు చేయనున్నారు. సుమారు 6 కిలోమీటర్ల మేర వాకర్స్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల పెద్ద ఎత్తున ఉదయం, సాయంత్రం నడకకు వచ్చే వారు ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుందన్నారు. నగరం నడిబొడ్డున నెక్లెస్ రోడ్డు ఏర్పాటు చేయడం మహబూబ్ నగర్ కు మరో మణిహారమని మంత్రి వెల్లడించారు.