
జడ్చర్ల, అక్టోబర్8: దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రెండోరోజు శుక్రవారం మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శినమిచ్చారు. దసరా పండగను పురస్కరించుని తొమ్మిరోజులపాటు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాల వద్ద భక్తులు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. సకలదేవతల ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. శుక్రవారం దుర్గామాత మండపాన్ని కరెన్సీనోట్లతో సుందరంగా అలంకరించారు. బాదేపల్లిలోని వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని బూరెడ్డిపల్లి వార్డులోని శివాలయంలో దుర్గామాత ప్రతిమను ప్రతిష్ఠించారు. రెండోరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కోలాటం, బతుకమ్మను ఆడారు.
ఆకట్టుకున్న అమ్మవారి అలంకరణ
మండలంలోని పెద్దరేవల్లిలో దేవీశరన్నరాత్రి ఉత్సవాలు రెండో రోజు ఆధ్మాత్మిక వాతావరణంలో ఉత్సాహభరితంగా కొనసాగాయి. మండపంలో వెలిసిన అమ్మవారు శుక్రవారం బాలాత్రిపురసుందరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో భక్తులు, హోటల్ శ్రీనివాస్, శశికాంత్‌రెడ్డి, జగదీశ్, సునీత, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
కోయిలకొండ మండలంలో..
మండలంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మండలంలోని అంకిళ్ల, వింజామూర్, కోయిలకొండ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాలో శుక్రవారం అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు రజితారవీందర్రెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణయ్యతోపాటు తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
మండలంలోని దేవరకద్రతోపాటు కౌకుంట్ల, పేరూర్, గోపన్‌పల్లి, లక్ష్మీపల్లి, వెంకటాయపల్లిలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శుక్రవారం కౌకుంట్లలో సర్పంచ్ స్వప్నాకిషన్రావు పూజలో పాల్గొన్నారు. రెండోరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరిదేవిగా భక్తుల పూజలందుకున్నారు. కౌకుంట్ల పాఠశాలలో 2007లో పదో తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వవిద్యార్థులు కౌకుంట్లలో నిర్వహించే నవరాత్రి వేడుకలకు 11ఏండ్లుగా అమ్మవారి విగ్రహ దాతలుగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది కూడా అమ్మవారి విగ్రహంతోపాటు వెండి వడ్డాణం, బంగారుతో ముత్యాల పతకం కానుకరూపంలో సమర్పించుకున్నారు.
అన్నపూర్ణాదేవిగా అలంకరణ
జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్‌కాలనీలోని వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శుక్రవారం అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజనర్సింహ, సభ్యులు వజ్రలింగం, భానుప్రసాద్ తదితరులున్నారు. పద్మావతికాలనీలోని కాళికామాత ఆలయంలో బాలాత్రిపురసుందరిదేవి అలంకరణలో భక్తులకు దర్మనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు పండిరీనాథ్, మల్లేశ్, వెంకటేశ్, పురుషోత్తం, సత్యనారాయణ భక్తులు ఉన్నారు.
మహాలక్ష్మీదేవిగా అమ్మవారు
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శుక్రవారం శ్రీమహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయం, అమిస్తాపూర్‌లోని జ్ఞానసరస్వతి ఆలయం, తాటికొండలోని ఆంనేయస్వామి ఆలయం, వెల్కిచర్లలోని ఆంజనేయస్వామి, రావులపల్లిలోని ప్రత్యేక మండపంలో అమ్మవారి ప్రతిమలను ప్రతిష్ఠించారు. అమిస్తాపూర్ జ్ఞానసరస్వతి ఆలయంలో రూ.3లక్షల, 50వేల విలువ గలిగిన నోట్లతో అమ్మవారికి అలంకారం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులున్నారు.
మిడ్జిల్ మండలంలో..
మండల కేంద్రంతోపాటు, వేముల, దోనూర్లో దుర్గామాత రెండోరోజు శుక్రవారం బాలాత్రిపురసుందరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మండల కేంద్రంలోని ఈదమ్మ ఆలయంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు శంకర్, పీఎసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కుమార్, రామకృష్ణ, రాఘవేందర్, రాజేశ్వర్, వెంకట్‌రెడ్డి, గంజి శేఖర్, విజయ్, భాస్కరాచారి, మల్లయ్య, మల్లాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు బంగారు, సత్యం బంగారు, శేఖర్, సైదుల్, శ్రీకాంత్, భాస్కర్, మహేశ్ తదితరులు ఉన్నారు.