
జడ్చర్లటౌన్, ఆగస్టు 27 : పట్టణంలో శుక్రవారం మైసమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. చైతన్యనగర్కాలనీ, శ్రీరాంనగర్‌కాలనీలో మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి మైసమ్మ ఆలయంలో ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించారు. చైతన్యనగర్కాలనీ నుంచి ప్రధాన రహదారులగుండా మహిళలు బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా వచ్చారు. మేళాతాళాల మధ్య పోతురాజు వేషధారణలో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి మొదటగా శ్రీరాంనగర్కాలనీలోని మైసమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు చైతన్య, శ్రావణి ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం చైతన్యనగర్కాలనీలో బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కౌన్సిలర్లు ఉమాశంకర్‌గౌడ్, నందకిశోర్‌గౌడ్ ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
మండలంలోని మోతిఘణపూర్లో లక్ష్మమ్మ బోనాలను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, బోనాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. సాయంత్రం ఎడ్లబండ్లతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పెద్దాయపల్లి, నేరళ్లపల్లి, ఉడిత్యాల, వీరన్నపల్లిలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు మాలతీయాదిరెడ్డి, పట్నం రాజు, ఖలీల్, మెడికల్ శంకర్, మల్లేశ్‌యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్, ఎంపీటీసీ ప్రదీప్‌కుమార్‌గౌడ్, కోఆప్షన్ సభ్యులు జమీర్‌పాషా, నాయకులు యాదిరెడ్డి, ప్రకాశ్‌యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
మండలంలోని జీన్గరాలలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు బోనాలలో ఊరేగింపుగా వెళ్లి మట్టికుండలో తయారు చేసిన అన్నం, పచ్చిపులుసుతో నైవేద్యం సమర్పించారు. అనంతరం వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని మొక్కులు చెల్లించారు.
అడ్డాకుల, మూసాపేట మండలంలో..
అడ్డాకుల, కందూరు, మూసాపేట మండలం తున్కినీపూర్లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. మహిళలు శుక్రవారం బోనాలతో ఊరేగింపుగా వెళ్లి బొడ్రాయికి పూజలు చేసి పోచమ్మ ఆలయానికి వెళ్లారు. అనంతరం పోచమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.