
జడ్చర్ల, ఆగస్టు 26: రైతుల కోసం ప్రభుత్వం ఈజీఎస్, హా ర్టికల్చర్, వ్యవసాయ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో యాదయ్య పేర్కొన్నారు. ఉపాధిహామీ, వ్యవసాయ, ఉద్యానవన పథకాలపై సర్పంచులు, రైతుబంధు సమితి, క్రియాశీల రైతులు, పంచాయతీ కార్యదర్శులకు గురువారం మండలస్థాయి శిక్షణా శిబిరం నిర్వహించారు. పట్టణంలోని రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో డీఆర్డీవో యాదయ్య, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య పాల్గొని మాట్లాడారు. ఉపాధిహామీ పథకం, హార్టికల్చర్, వ్యవసాయ పథకాలు రైతులకు ఎన్నిరకాలుగా ఉపయోగపడుతున్నాయనే దానిపై శిక్షణ ఇచ్చారు. ఉపాధిహామీ పథకం ద్వారా రైతులకు తీగజాతి పంటలు వేయడానికి, నాఫెడ్ కంపోస్టు, పశుగ్రాసం పెంచుకోవడం, మినీ కోళ్లఫారం, పశువులపాకలు, మేకలఫారం, భూఉపరితల కుంటలు, బోర్వెల్ రీచార్జికి అవసరమయ్యే ఇంకుడుగుంతలు, చేపల చెరువుల నిర్మాణం, రైతుకల్లాలు తదితర పనులపై అవగాహన కల్పించారు. వ్యవసాయ పథకాలైన రైతుబంధు, రైతుబీమా, వాతావరణ మార్పులకు అనుగుణంగా చేసే వ్యవసాయ పనులు, హార్టికల్చర్ ద్వారా పండ్లతోటలు, కూరగాయల తోటల పెంపకం, డ్రిప్ ఇరిగేషన్, బిందుసేద్యం తదితర పథకాలు రైతులకు ఉపయోగపడతున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులకు తెలిపి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీడబీ జకియాసుల్తానా, ఏడీఏ అనిల్‌కుమార్, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్, మండలాధ్యక్షుడు బాలసుందర్రెడ్డి, సర్పంచులు ప్రభాకర్‌రెడ్డి, రాములు, రవీందర్‌రెడ్డి, అరుణ, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ జంగయ్య, ఎంపీడీవో స్వరూప, హార్టికల్చర్ అధికారిణి హిమబిందు, ఏవో గోపినాథ్, ఏపీవో విజయభాస్కర్, సత్యనారాయణ, ఏఈవోలు, రైతుబంధు కోఆర్డినేటర్లు, రైతులు పాల్గొన్నారు.