
ఉండవెల్లి, సెప్టెంబర్ 6 : నియోజకవర్గ ప్రజలు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను ఎన్నికల్లో తిప్పికొట్టినా బుద్ధిరాలేదని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంపత్‌కుమార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. అవినీతి, ఇసుక దందా, కమీషన్ ఎమ్మెల్యే ఎవరో ప్రజలకు తెలుసని హితవు పలికారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనీసం రూ.కోటి నిధులైన తెచ్చావా అని ప్రశ్నించారు. కోట్లాది నిధులను తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేస్తున్న తనపై ఆరోపణలు చేయడం నీ రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే మా కుటుంబానికి వంద ఎకరాల ఆస్తి ఉందని, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నీ ఆస్తి ఎంత..? నా ఆస్తి ఎంతో బహిరంగ చర్చకు వస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మణికొండలో ఇల్లు ఎలా కొన్నావో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం, వైద్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మెజార్టీ ప్రజల తీర్మానానికి కట్టుబడి అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డులోని ఐదెకరాల్లో వంద పడకల దవాఖాన నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.23 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్‌గౌడ్, వడ్డేపల్లి జెడ్పీటీసీ రాజు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యేను దళితులు
దళితకాలనీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు ‘దళిత ఆత్మగౌరవ దండోర యాత్ర’ పేరుతో వచ్చిన మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను ఉండవెల్లిలో దళితులు, టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఏ అభివృద్ధి చేయకుండా దళితబంధు అమలు, దళితకాలనీల్లో సమస్యలను తెలుసుకొని ఏం చేస్తావని మాజీ ఎమ్మెల్యేను నిలదీశారు. డీఎస్పీ రంగస్వామి, సిబ్బంది గ్రామానికి చేరుకుని అనుమతులు లేకుండా ర్యాలీలు చేయవద్దని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను గ్రామం నుంచి పంపివేశారు. దళితులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి సంపత్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.