
గండీడ్/మహ్మదాబాద్, సెప్టెంబర్ 5 : ఉమ్మడి గండీడ్ మండలంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షంతో చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి మత్తడి దుంకాయి. అనేక వాగులు, వంకలు పొంగి పొర్లాయి. గో విందుపల్లితండా పంచాయతీలోని పీర్లబండతండా వాగు ఉధృతంగా ప్రవహించింది. వాగును ఎవరూ దాటకుండా తాసిల్దార్ జ్యోతి కంచె ఏర్పాటు చేయించారు. కొంరెడ్డిపల్లిలో వరిపంట నీటమునిగింది. రెడ్డిపల్లి మల్లయ్యచెరువు అలుగు పారగడంతో చెన్నాయిపల్లి, తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహ్మదాబాద్ మండలంలోని అన్నారెడ్డిపల్లితండా వాగు వరదతో ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎంపీ వో శంకర్‌నాయక్ తండాకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేశా రు. వాగు ప్రవాహం తగ్గేవరకు వాగు దాటొద్దని సూచించా రు. అలాగే పలు వాగులను ఎస్సై రాముడు, డిప్యూటీ తాసిల్దారు ఇంతియాజుద్దీన్, ఎంపీవో శంకర్‌నాయక్, సర్పంచ్ రవీందర్‌నాయక్, సూర్యానాయక్ పరిశీలించారు.
మహబూబ్‌నగర్ మండలంలో..
మండలంలోని పలు చెరువులు, కుంటలు అలుగులు పారాయి. కోడూర్ మై సమ్మ చెరువు, అల్లీపూర్ తుమ్మలకుంట, ఇప్పలపల్లి రాంరెడ్డి చెరువు తదితర చెరువులు, కుంటలు అలుగులు పారడంతో జలకళ సంతరించుకున్నది. కోడూర్ చెరువును తాసిల్దార్ పాండు, ఎంపీడీవో వేదవతి, ఎంపీవో నరేందర్‌రెడ్డి, సర్పం చ్ శ్రీకాంత్‌గౌడ్ సందర్శించి పరిశీలించారు.
మూసాపేట మండలంలో..
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు పొడవునా నిర్మించిన చెక్‌డ్యాంలు అలుగు పారుతున్నాయి. పెద్దవాగు నీటితో పారుతుండడంతో మూసాపేట, అడ్డాకుల మండలాల్లోని పలు గ్రామాల చెరువులకు వరద వచ్చి చేరుతున్నది. కాగా, వరదతో గౌరిదేవునిపల్లి రోడ్డు కొట్టుకుపోయింది. అదేవిధంగా వర్నె, ముత్యాలంపల్లి గ్రామాల రోడ్డు కూడా వరదకు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి.
భూత్పూర్ మండలంలో..
మండలంలో 5సెం.మీ. వర్షపాతం నమోదైంది. వర్షానికి పలు గ్రామాల్లో చెరువులు, చెక్‌డ్యాంలు అలుగులు పారుతున్నాయి. రావులపల్లి, పోతులమడుగు వాగులను ఎవరూ దాటకుండా తాసిల్దార్ చెన్నకిష్టన్న కంచెను ఏర్పాటు చేయించారు. అలాగే మద్దిగట్ల, వెల్కిచర్ల, శేరిపల్లి(హెచ్), హస్నాపూర్, తాటికొండ చెరువులు అలుగులు పారడంపై ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు.
హన్వాడ మండలంలో..
మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లోని వాగులు దాటకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
నవాబ్‌పేట మండలంలో..
మండలంలోని లోకిరేవు పెద్దచెరువు ఆదివారం అలుగు పారింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి.
కోయిలకొండ మండలంలో..
మండలంలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంకిళ్ల పెద్దవాగు తదితర వాగులకు వరద పోటెత్తింది. మల్కాపూర్, గార్లపాడ్, సూరారం రోడ్లపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎంపీడీవో జయరాం గార్లపాడ్లో పరిస్థితిని సమీక్షించారు. అలాగే నల్లవెల్లి వాగు పారడంతో కోయిలకొండ చెరువులోకి వరద వచ్చి చేరుతున్నది.