
జిల్లా, జోనల్, మల్టీ జోన్ పోస్టుల గుర్తింపు
ప్రభుత్వశాఖల్లో క్యాడర్ రీ ఆర్గనైజేషన్ పూర్తి
జీవో జారీతో కొత్త జిల్లాలకు పోస్టులు
నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు
మహబూబ్‌నగర్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సా ధించుకున్న స్వరాష్ట్రంలో అన్నింటా న్యాయం జరుగుతున్నది. ఇన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా నూతన జోనల్ విధానం ఖరారైంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు జోన్లు ఉండగా.. తెలంగాణ విభజన తర్వాత అప్పటికే ఉన్న రెండు జోన్లతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం జిల్లాల విభజన చేసింది. కొత్త జిల్లాల ప్రకారంగా జోన్లు, మల్టీ జోన్లు సిద్ధం చేసింది. వాటికి తగ్గట్లుగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల్లోని పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి వారీగా గుర్తించింది. గతంలో రాష్ట్ర స్థాయి పోస్టులు అధికంగా ఉండడంతో ఇతర రాష్ర్టాల వారికి మన పోస్టులు నాన్ లోకల్ విధానంలో అధికంగా ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రాష్ట్ర స్థాయి పోస్టులను సైతం మల్టీ జోన్ పరిధిలోకి తీసుకురావడంతో మన ఉద్యోగాలు మనకే దక్కేందుకు ఎక్కువ అవకాశం ఏర్పడిందని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను ప్రభుత్వం వర్గీకరించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆయా శాఖల్లోని పోస్టులను జిల్లా (లోకల్), జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ వారీగా గుర్తించింది. డిఫ్యూటీ కలెక్టర్, ఆర్డీవో, తాసిల్దార్, డీఎస్పీ, సీటీవో, డీఏవో, డీపీవో, ఎంపీడీవో, ఏవో, సబ్ రిజిస్ట్రార్ తదితర పోస్టులు సైతం మల్టీ జోనల్ పరిధిలోకి తీసుకురావడంతో స్థానిక జోన్ల పరిధిలోని వారికే అవకాశాలు లభిస్తాయి. సమైక్య రాష్ట్రంలో ఉన్నత స్థాయి పోస్టులన్నీ రాష్ట్ర స్థాయిలో ఉండడంతో తెలంగాణేతరులు పెద్ద ఎత్తున మన ఉద్యోగాలను చేజిక్కించుకునేవారు. ప్రస్తుతం గెజిటెడ్ పోస్టులు సైతం మల్టీ జోన్ పరిధిలో ఉంచడంతో స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి.
జిల్లా పోస్టులతో ఎంతో లబ్ధి..
జిల్లా పోస్టులైన టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, కానిస్టేబుల్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 తదితర పోస్టులన్నీ జిల్లా పోస్టులుగా నిర్ణయించడంతో నిరుద్యోగులకు వరంగా మారనున్నది. నారాయణపేట, జోగుళాంబ గద్వాల వంటి వెనకబడిన జిల్లాల్లోని నిరుద్యోగులు ఇకపై తమ ఉద్యోగాలు తామే పొందగలిగే అవకాశం రానున్నది. ఏటా రాష్ట్ర ప్రభు త్వం భారీగా కానిస్టేబుల్, పంచాయతీ కార్యదర్శి తదితర పోస్టులు భర్తీ చేస్తున్న నేపథ్యంలో ఇకపై ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లాకే దక్కనున్నాయి.
నిరుద్యోగుల హర్షాతిరేకాలు..
నాయబ్ తాసిల్దార్, సీనియర్ అసిస్టెంట్, ఎంఆర్ఐ, ఏఆర్ఐ, సూపరింటెండెంట్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, ఏసీటీవో, ఏఈవో తదితర పోస్టులన్నీ జోనల్ పోస్టులుగా నిర్ణయించడంతో జోగుళాంబ జోన్ పరిధిలో ఉన్న మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలోని నిరుద్యోగ యువతకు పాత జిల్లా పరిధిలోనే అనేక ఉద్యోగాలు లభించనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జోన్-6 పరిధిలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలు ఉండగా.. నల్లగొండ నుంచి ఉద్యోగాల్లో పోటీ ఎక్కువగా ఉండేది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగాల్లో విపరీతమైన పోటీ ఉండేది. వెనుకబడిన జిల్లా కావడం, కనీసం ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అప్పటికే అన్ని రంగాల్లో ఇబ్బందులుండేవి. సాగునీరు, కరెంట్ లేక వ్యవసాయం కూడా కష్టంగా మారి జిల్లా నుంచి భారీగా వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. దీంతో నల్లగొండ ఉద్యోగార్థులతో పోలిస్తే పాలమూరు నిరుద్యోగులు పోటీలో నెగ్గుకురావడం కష్టంగా మారేది. ప్రస్తుతం జోగుళాంబ జోన్ పరిధిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మాత్రమే ఉండడంతో ఇకపై మన పోస్టులు మనకే లభించనున్నాయి. ఇక మల్టీ జోన్ పరిధిలో జోగుళాంబ, చార్మినార్ జోన్ పరిధిలో మన యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.
చారిత్రాత్మక నిర్ణయం..
రాష్ట్రపతి ఉత్తర్వుల మే రకు వివిధ విభాగాల్లోని పోస్టులను జోన్లు, మల్టీ జోన్ల వారీగా ఖరారు చే యడం గొప్ప నిర్ణయం. 95 శాతం ఉద్యోగాలు స్థా నికులకే లభించేలా చేయ డం మామూలు విషయం కాదు. ప్రభుత్వం తీసు కున్న నిర్ణయం కారణంగా స్థానిక నిరుద్యోగ యువతకు భవిష్యత్‌లో పెద్ద ఎ త్తున ఉద్యోగాలు వస్తాయి. స్థానికులే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ ఇక్కడి సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం లభిస్తుంది. పాల మూరు వంటి వెనకబడిన జిల్లాకు ఈ నిర్ణయం ఎం తో మేలు చేస్తుంది.
– రాజీవ్ రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు, మహబూబ్‌నగర్
టీజీవో సూచనలు అమలయ్యాయి..
గతంలో టీజీవో భవన్లో ఫౌండర్ అధ్యక్షుడు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో టీజీవో అధ్యక్షుల సూచన మేరకు వచ్చిన ప్రతిపాదనలన్నీ ఇప్పుడు అమలయ్యాయి. హయ్యర్ క్యాడర్ పోస్టులు కూడా జోనల్ పరిధిలోకి తీసుకురావడంతో స్థానికులకు లబ్ధి చేకూరనున్నది. నూతన విధానంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకే ఉద్యోగాలు వస్తాయి. గ్రూప్-1 పోస్టులను సైతం మల్టీజోన్ పరిధిలోకి తీసుకురావడం చారిత్రాత్మకం. జోనల్, మల్టీ జోన్ పోస్టులన్నీ గెజిటెడ్ పోస్టులే కావడం విశేషం. అప్పట్లో సీఎం కేసీఆర్ టీజీవో రాష్ట్ర సంఘం నుంచి సూచనలను ఆహ్వానించారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంలో టీజీవో సంఘం సూచనలు అమలు కావడం సంతోషంగా ఉంది.