కొల్లాపూర్, ఆగస్టు 16: నాగర్కర్నూల్ జిల్లాలో 20 మండలాలకుగానూ కేవలం మూడు మండలాలు మినహా మిగతా 17 మండలాల్లో వర్షాధార పంటలపైనే రైతులు మొగ్గు చూపారు. జిల్లా వ్యాప్తంగా 3,50,223 ఎకరాల్లో పత్తిని సాగుచేశారు. పెంట్లవెల్లి, కోడేరు, కొల్లాపూర్ మండలాల రైతులు ఏ మాత్రం పత్తిసాగు చేయలేదు. జిల్లాలో అత్యధికంగా ఉప్పునుంతల మండలంలో 32,642 ఎకరాలు, వంగూరు మండలంలో 32,845 ఎకరాల్లో రైతులు పత్తిసాగు చేసి తమ సత్తాను చాటుకున్నారు. గతేడాదికంటే ఈసారి సుమారు 50వేల ఎకరాల్లో పత్తిసాగు పెరిగింది.
మండలాల వారీగా..
తెల్లబంగారం సాగు విస్తీర్ణం మండలాల వారీగా పరిశీలిస్తే నార్కర్నూల్ మండలంలో 25,209, తాడూరు మండలంలో 24,478 ఎకరాలు, తెల్కపల్లి మండలంలో 21,133 ఎకరాలు, తిమ్మాజీపేట మండలంలో 19,114 ఎకరాలు, బిజినేపల్లి మండలంలో 21,900 ఎకరాలు, అచ్చంపేట మండలంలో 32,125 ఎకరాలు, అమ్రాబాద్ మండలంలో 17,632 ఎకరాలు, బల్మూర్ మండలంలో 14,900 ఎకరాలు, లింగాల మండలంలో 4,340 ఎకరాలు, పదర మండలంలో 8,900 ఎకరాలు, కల్వకుర్తి మండలంలో 29,863 ఎకరాలు, వెల్దండ మండలంలో 28,500 ఎకరాలు, చారగొండ మండలంలో 16,600ఎకరాలు, ఊర్కొండ మండలంలో 15,652 ఎకరాలు, పెద్దకొత్తపల్లి మండలంలో 4,390 ఎకరాల్లో పత్తిపంటను సాగుచేశారు.
వానకోసం నిరీక్షణ
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బోర్లు, బావులున్న రైతులు స్ప్రింకర్ల ద్వారా పత్తి చేనుకు నీటి తడులను కట్టి పైరును కాపాడుకుంటున్నారు. నీటి వనరులు లేని రైతులు ప్రతిరోజూ వరుణుడి కోసం నింగివైపు నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం పత్తిచేన్లు ఆశాజనకంగా ఉండడంంతో పంటదిగుబడిపై రైతులు ఎవరికివారు అంచనాలు వేసు కుంటున్నారు.ఇప్పటి వరకు చీడపీడల బెడద లేదని రైతులు చెబుతున్నారు.