
మహబూబ్‌నగర్, అక్టోబర్ 8: జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు వైభవంగా సాగుతున్నాయి. విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించారు. బతుకమ్మ వేడుకలకు అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవర్ హాజరయ్యారు. మెడికల్ కళాశాలలో నిర్వహించిన సంబురాలకు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. సంస్కృతీ సంప్రదాయలు ఉట్టిపడేలా మెడికల్ కళాశాల విద్యార్థినులు ప్రదర్శనలను నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టాశ్రీనివాస్, డీఈవో ఉషారాణి, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సునందిని, డాక్టర్ కల్యాణి, రమాదేవి, ఉషారాణి, పార్వతి, గీతా, మీనాక్షి, విద్యాశాఖ అధికారులు శంభుప్రసాద్, ఎంఈవో జయశ్రీ, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఎంవీఎస్ కళాశాలలో..
జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాలలో బతుకమ్మ సంబురాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో అధ్యాపక బృందం, విద్యార్థినులు అధిక సంఖ్యలో భాగస్వాములయ్యారు. బతుకమ్మలను తయారు చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. వేడుకల్లో కళాశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, వైస్‌ప్రిన్సిపల్ ఈశ్వరయ్య, అధ్యాపకులు నర్సింహులు, సత్యనారాయణగౌడ్, రాములు, అధ్యాపకులు ఉన్నారు.
సీసీకుంట మండలంలో..
చిన్నచింతకుంట మండల కేంద్రంలోని సాందీపని పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి రకరకాల పూలతో బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటం, బొడ్డెమ్మ ఆడారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ కాంతయ్య, ప్రిన్సిపాల్ కృష్ణయ్య, ఉపాధ్యాయులు నవీన్, సుధాకర్, కురుమూర్తి, జ్యోతి, కవిత, నిహారిక పాల్గొన్నారు.
జడ్చర్ల డిగ్రీ కళాశాలలో..
దసరా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జడ్చర్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయచిన్నమ్మ ఆధ్వర్యంలో మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు తెలంగాణ బొటానికల్గార్డెన్లోని రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విదార్థినులు కలసి కళాశాల ఆవరణలో బతుకమ్మ ఆట, పాటలతో సంబురాలను జరుపుకొన్నారు. అనంతరం బొటానికల్గార్డెన్లోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.