
మక్తల్‌రూరల్, నవంబర్ 1: సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తున్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మక్తల్ పట్టణ శివారులోని ద్వారక ఫంక్షన్హాల్లో సోమవారం జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే చిట్టెం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ, ప్రజాగాయకుడు గోరటి వెంకన్న హాజరై మాట్లాడారు. ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం ద్వారా బీడుభూములు సస్యశ్యామలం అయ్యాయన్నారు. భీమా ఎత్తిపోతలలో అంతర్భాగమైన సంగంబండ, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల కింద లక్ష ఎకరాలకు సాగునీరు అందుతున్నదన్నారు. నియోజకవర్గంలో రైతుబంధు పథకం ద్వారా 27వేల మంది రైతులకు దాదాపు రూ.5,300కోట్లు ఇచ్చినట్లు ఎమ్మెల్యే చిట్టెం వెల్లడించారు. ఇప్పటివరకు మక్తల్ ప్రాంతంలో 4 పత్తి పరిశ్రమలు ఏర్పాటు చేశారని, దీనివల్ల ఈ ప్రాంతంలో ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదన్నారు. ఈ నెల 15న వరంగల్‌లో నిర్వహించే విజయగర్జనకు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు భారీగా తరలొచ్చి విజయవంతం చేయాలన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ రాజనీతి తెలిసిన, ప్రగతిబాటను చూపిన మానవతావేత్త సీఎం కేసీఆర్ తెలంగాణకు దిక్సూచి వంటివారన్నారు.
రాజకీయాల కోసం తాను ఎమ్మెల్సీ పదవిని తీసుకోలేదని, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో పదవిని తీసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడక పోతే మరో 50ఏండ్లయినా అభివృద్ధి జరిగేది కాదన్నారు. నేడు పాలమూరు పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుందన్నారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్నను ఎమ్మెల్యే చిట్టెం, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవరి మల్లప్ప, పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసగుప్తా, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు చిట్టెం సుచరిత, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, ఆత్మకూర్ మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి, జెడ్పీటీసీ అశోక్‌గౌడ్, వెంకటయ్య, జ్యోతి, అంజనమ్మ, నర్వ ఎంపీపీ జయరాములు, ఊట్కూర్ ఎంపీపీ లక్ష్మి, పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, పమేశ్వరరెడ్డి, రవికుమార్‌యాదవ్, ఎల్లారెడ్డి, పట్టణకమిటీ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.