
మంత్రాలయం, ఆగస్టు 24 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 350వ సప్త ఆరాధనోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. కర్నూల్ జిల్లాలోని శ్రీమఠంలో మంగళవారం మధ్యారాధనలో భాగంగా ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలును నవరత్న సింహాసనంపై ఉంచి ఊరేగించారు. ఉదయం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి అభిషేకం చేశారు. అంతకుముందు గ్రామ దేవత మంచాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యారాధనను పురస్కరించుకుని మూల బృందావనానికి పట్టు వస్ర్తాలు, బంగారు కవచంతో తయారు చేయించిన రెండు బిందెలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతరెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి పీఠాధిపతికి అందజేశారు. పట్టు వస్ర్తాలను పీఠాధిపతి శిరస్సుపై ఉంచుకొని మఠం ప్రాకారం చుట్టూ ఊరేగింపుగా వెళ్లి మూల బృందావనానికి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ అధికారులను శేష వస్త్రంతో సత్కరించారు. హైదరాబాద్‌కు చెందిన తిరుమల్‌రెడ్డి నవరత్న ఖచిత బంగారు హారాన్ని విరాళంగా అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శేషాద్రి, శ్రీమఠం అధికారులు, పండితులు, భక్తులు పాల్గొన్నారు.