
మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని రాష్ట్ర అబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డా.వీ. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డీఈవో ఉషారాణి అధ్యక్షతన గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 29మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ముందుగా జ్యోతి ప్రజ్వళన చేసి జాతీయ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రపతి, కలెక్టర్, ఎస్పీ ఇలా ఎవరు ఏ హోదాలో ఉన్నా గురువు వద్ద పాఠాలు నేర్చుకున్నవారే అన్నారు. ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలకు ఓర్చుకొని చదివి, ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ రాష్ట్రపతి పదవిని అలంకరించిన మహా వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని గుర్తుచేశారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యార్థులకు చదువుతో పాటు, సంస్కారాన్ని నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ మార్పు ఉపాధ్యాయులనే ఆధారపడి ఉందని, ఉపాధ్యాయులు గురుతర బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీఈవో ఉషారాణి పాల్గొన్నారు.
పార్టీ నిబంధనలకు కట్టుబడి పనిచేద్దాం
మహబూబ్‌నగర్, సెప్టెంబర్5: నిరంతరం ప్రజల సంక్షేమంకోసం పరితపిస్తున్న టీఆర్ఎస్ పార్టీ నియమ నిబంధనలను కట్టుబడి పనిచేద్దామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో 37,39,49 వార్డుల్లో వార్డు కమిటీల సమావేశానికి ఆదివారం హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు. అందరికీ అందుబాటులో ఉండి సేవలు చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో కౌన్సిలర్ పుష్పలత, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు కృష్ణమోహన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, డీసీసీబీ వైస్‌చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ వైస్‌చైర్మన్ తాటిగణేశ్ పాల్గొనారు.
అప్రమత్తంగా ఉండాలి:వీసీలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, సెప్టెంబర్5: కురుస్తున్న వర్షాలను, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పరిగణలోకి తీసుకొని కుంటలు, చెరువులు, కాల్వలను అధికారులు మరోసారి పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్యాంపు కార్యాలయం నుంచి వెబెక్స్ వీసీ ద్వారా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా, మండల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన పదిహేను సంవత్సరాల్లో కురిసిన వర్షాలను పరిగణలోకి తీసుకొని తెగిన చెరువుకట్టలు, లోతట్టు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.