
కొల్లాపూర్, సెప్టెంబర్ 5: సమాజంలో గురువుకు ఎనలేని ప్రాధాన్యత ఉన్నదని, వారి సేవలు సమాజంలో వెలకట్టలేనివని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆదివారం కొల్లాపూర్‌లోని ఎంఈవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో సర్వేపల్లి విగ్రహానికి ఎమ్మెల్యే బీరం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వర, గురుసాక్షాత్ పరబ్రహ్మ గురువేనమః అంటే గురువే పరబ్రహ్మ స్వరూపమని అర్థమని, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని పెద్దలన్నారని పేర్కొన్నారు. అమ్మానాన్నల తర్వాత గురువు స్థానం చాలా గొప్పదన్నారు. దేశంలో పిల్లల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తుచేసుకోవడానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన డాక్టర్ సర్వేపల్లి జీవితం ఆరదర్శనీయమన్నారు. అనంతరం జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వెంకటేశ్వర్రావు, డాక్టర్ శ్రీనయ్య, కుర్బాన్‌అలీ, సాలయ్య, మండల స్థాయి అవార్డు గ్రహీతలు లక్ష్మీదేవమ్మ, అరుణ, రబ్బానీ, వెంకటరమణ, అనిత, రాజశేఖరాచారి, బాలయ్య, సతీశ్‌కుమార్, చెన్నకేశవులు, ఉమాదేవి, రంగినేనిజ్యోతి, లోకేశ్, రాంచంద్రయ్య, రెహమాన్‌ను ఎమ్మెల్యే శాలువాకప్పి పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీకాంత్ , పొట్లపల్లి నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు గాలియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉపాధ్యాయులకు సన్మానం
పట్టణంలోని శ్రీవాణి విద్యానిలయంలో రిటైర్డ్ డీఈవో, రిటైర్డ్ హెచ్ఎంలను టీఎస్ పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి రంగినేని జగదీశ్వరుడు ఆధ్వర్యంలో పూలమాలతో ఘనంగా సన్మానించారు. రిటైర్డ్ డీఈవో పాపల్రావు, రిటైర్డ్ హెచ్ఎంలు సత్యనారాయణ, శ్రీపతిరావును జగదీశ్వరుడు సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంచందర్‌రావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
అచ్చంపేట మండలంలో..
అచ్చంపేట, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్ పేర్కొన్నారు. పట్టణంలోని ఆదర్శనగర్ వెలాసిటీ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రిటైర్డ్ ఎంఈవో బాలజంగయ్యను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నది.
బల్మూర్ మండలంలో..
మండలంలోని కొండారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం కృష్ణయ్యను సర్పంచ్ పుష్పలత, గ్రామస్తులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా వివిధ గ్రామాల్లో నాటక కళాకారులు వారికి నాటకాలను నేర్పిన గురువులను పూలమాల, శాలువాతో సన్మానం చేశారు.