
మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 16 : మున్సిపాలిటీల్లో ఇంటి నెంబర్ కోసం అధికారులకు మామూళ్లు ఇవ్వాల్సిందే.. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే.. ఇలాంటి ఇబ్బందులన్నింటికీ చెక్ పడుతూ పారదర్శక సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా కొత్త సంస్కరణలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా సెల్ఫ్ అసెస్మెంట్ విధానంతో.. అధికారులు, సిబ్బంది ప్రమేయం లేకుండా నేరుగా స్మార్ట్‌ఫోన్ నుంచి సీడీఎంఏ వెబ్సైట్ ద్వారా ఇంటి నెంబర్ పొందే అవకాశం కల్పించింది. కొత్త నివాస, నివాసేతర భవనాలకు సంబంధిత యజమానులే కొలతలు వేసుకొని ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఇలా..
గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి cdma mahabubnagar యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. self assessmentపై క్లిక్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఆధార్, ఇంటి కొలతలు, దస్తావేజులు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయగానే నేరుగా మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లాగిన్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మున్సిపల్ మేనేజర్, కమిషనర్ లాగిన్లోకి వెళ్తాయి. వారి పరిశీలన ప్రక్రియ పూర్తి కాగానే రెవెన్యూ విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి 21 రోజుల్లో ఇంటి నెంబర్ కేటాయిస్తారు. దరఖాస్తుదారుడు నమోదు చేసిన వివరాల మేరకు ఆస్తిపన్ను సైతం నేరుగా ఆన్లైన్లో చెల్లించొచ్చు.
తప్పుడు కొలతలిస్తే చర్యలు..
మున్సిపాలిటీల్లో ప్రజలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో ఆన్లైన్ విధానం తీసుకొచ్చిన ప్రభుత్వం కఠిన నిర్ణయాలు సైతం అమలు చేస్తున్నది. యజమానులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందున కొలతల్లో తప్పులుంటే జరిమానా విధించనున్నారు. కొలతలు తక్కువగా చూపించినా, తప్పుడు డాక్యుమెంట్లు ఆన్లైన్లో పొందుపర్చినా చర్యలు తీసుకోనున్నారు. ఆస్తిపన్ను తక్కువ చేసుకోవాలనే ఎత్తుగడ వేస్తే సంబంధిత భవన యజమానికి వాస్తవ ఆస్తిపన్నుపై 25 రెట్లు జరిమానా విధించనున్నారు. యజమానులు ఆన్లైన్లో వివరాలు పొందుపర్చిన తర్వాత మున్సిపల్, రెవెన్యూ విభాగం ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఇంటి నెంబర్ల కేటాయింపులో సెల్ఫ్ అసెస్మెంట్ విధానం అమల్లోకి రావడంతో అవినీతి, అక్రమాలకు చెక్ పడే అవకాశం ఉన్నది.
దళారుల కొత్త దందా..
కొంత మంది దళారులు ఇంటి నెంబర్ పేరుతో మున్సిపాలిటీల్లో కొత్త దందాకు తెరలేపారు. మున్సిపల్ అనుమతులు తీసుకొని ఇండ్ల నిర్మాణాలు చేసుకున్న చాలా మంది దగ్గరికి వెళ్లి ఇంటి నెంబర్లు ఇప్పిస్తామంటూ సెల్ఫ్ అసెస్మెంట్ చేసి కాసులు దండుకుంటున్నారు. కొంతమంది మున్సిపల్ సిబ్బంది సైతం ప్రతిరోజూ ఏదో ఒక వార్డులో ఇంటి నెంబర్ల కోసం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంటి నెంబర్ ఇస్తామని మున్సిపల్ సిబ్బంది లేదా దళారులు వస్తే నమ్మొద్దని, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.