గద్వాల, జూలై 4 : జిల్లా వ్యాప్తంగా వారం కిందట విస్తారంగా వర్షాలు కురువడంతో రైతన్నలు తమ నాగళ్లకు పదును పెట్టారు. తొలకరి పలకరింపుతో పుడమి తల్లి పులకించిపోగా రైతన్నలు కాడెద్దులతో ఏరువాక పండుగ అనంతరం జిల్లాలో కొన్ని చోట్ల విత్తనాలు విత్తుకుంటున్నారు. మరికొందరు రైతులు తమ పొలాలను విత్తనాలు విత్తడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రావడంతో ఏరువాక అనంతరం వర్షం సరైన సమయంలో పడడంతో రైతన్నలో కొంత మేర ఆనందం నిండుకున్నది. గతేడాదిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది రైతన్నలు పంటలు సాగుచేయడానికి సమాయత్తం అయ్యారు. రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి దుకాణాల వద్దకు చేరుకుంటున్నారు. ఏరువాక పున్నమి నాటికి ప్రభుత్వం రైతులకు రైతుబంధు జమచేయడంతో రైతులు తమ పొలాలల్లో విత్తనాలు విత్తడానికి, విత్తనాలు ఎరువులు కొనుగోలు చేస్తున్నారు.
రైతన్నకు అండగా తెలంగాణ ప్రభుత్వం
రైతన్నకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తున్నది. జిల్లాలో ఎంత భూమి సాగు అవుతుందో, రైతులు ఏఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారో, వారికి ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు ఎంత మేర ఎరువులు అవసరం అవుతాయో ముందుగానే వ్యవసాయ అధికారులతో ప్రభుత్వం సర్వే చేయించి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచింది. జిల్లాలో ఈ వానకాలంలో 1,58,269 మంది రైతులు 3,72,398 ఎకరాల్లో పత్తి, వేరుశనగా, వరి, మొక్కజొన్న, కందులు, మిరపతో పాటు ఇతర రకాల వివిధ పంట లు సాగు చేస్తారని, విత్తనాలు 29,253 క్వింటా ళ్లు అవసరమని, ఎరువులు 68,290 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనా వేశారు. అయితే రైతులకు మొదటి విడుత అవసరమైన 25,594వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ప్రస్తుతం గోదాంల్లో నిల్వ ఉంచారు. అదేవిధంగా రైతులకు అవసరమైన సబ్సిడీ విత్తనాలను అందించడానికి కృషి చేస్తున్నారు. అధికారులు పంపిన ప్రణాళిక ప్రకారం ఎరువులు అందుబాటులో ఉండగా విత్తనాలు అధికారుల పంపిన అంచనాలకు అనుగుణంగా త్వరలో ప్రభుత్వం అందజేయనుండగా వాటిని రైతులకు అందించడానికి వ్యవసాయశాఖ అధికారులు కృషి చేస్తున్నారు.
రైతన్న అడిగినన్ని ఎరువులు
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎంత భూమి ఉందో అన్ని విత్తనాలతోపాటు ఎరువులు సరఫరా చేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించడంతో ఇక రైతులు ప్రైవేట్ వ్యక్తుల నుంచి విత్తనాలు కొనే అవసరం లేకుండా పోయింది. ఈ నిర్ణయం తీసుకోవడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సబ్సిడీ విత్తనాలు అందని రైతులు ప్రైవేట్ వ్యక్తుల నుంచి విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయిన దాఖలాలు ఉన్నాయి. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ప్రైవేట్ వ్యాపారులు రైతులకు కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆందోళన చేసిన ఘటనలు ఉన్నాయి. వీటన్నింటిరీ చెక్ పెట్టడానికి ప్రభుత్వం రైతులకు ఎంత మేర విత్తనాలు, ఎరువులు అవసరమున్నాయో అంత మేరకు సబ్సిడీపై పంపిణీ చేయడానికి సిద్ధమైంది. దీంతో రైతులకు కల్తీ విత్తనాలు, ఎరువుల బాధ తప్పింది. ఎరువులు ఈ వానకాలం పంటకు సరైన సమయంలో ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుండడంతో రైతన్నల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఈ వానకాలం రైతన్నకు ఏరువాక పండుగలా కలిసి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.