పెబ్బేరు, నవంబర్ 5 : పెబ్బేరు మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసుకున్న వారంతా తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ఎప్పుడు కొంటారా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం అకా ల వర్షం కురవడంతో పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం తడిసి ముద్దయింది. గత వారం రోజులుగా మార్కెట్ యార్డుకు రైతులు ధాన్యం తెస్తున్నారు.
చుట్టు పక్కల గ్రామాల నుంచి ఇప్పటికే సుమా రు ముప్పై మంది రైతులు ధాన్యాన్ని తెచ్చి కుప్పలుగా పోశారు. అధికారులు ప్రతి సారి ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొంటుంటారు. ఈ సారి మాత్రం ఇప్పటి వరకు కొనుగోళ్లు మొదలు కాకపోవడంతో.. రైతు లు తాము తెచ్చిన ధాన్యానికి రేయింబవళ్లు కాపలా కాస్తూ ఇబ్బందులు పడుతున్నారు. వర్షం మూలంగా ధాన్యం తడవడంతో వారి అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నా యి. ఇప్పటికైనా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.