అమ్మ ఒళ్లంతా ముడతలు కూడా ముద్దొస్తున్నాయి
అవి నన్ను తన చేతులతో ఊపిన
చీర ఉయ్యేల మడతల్లా ఉన్నాయి
అమ్మను నేను తొలిసారి కళ్ళు తెరిచి చూసినప్పుడు
ఆ శైశవ చైతన్యంలో పిగిలిన రంగుల్లో
ఒదిగిన బొమ్మను
ఊహించుకుంటున్నాను
ఇప్పుడు చూస్తున్న ఈ అమ్మ,
ఆ బొమ్మ నుంచి ప్రవహించిన
నీడ మాత్రమే అనుకుంటున్నాను-
ఈ శూన్య కుడ్యాల మీది
గడియారాలు చెప్పే
ముసలి కబుర్లు నేను నమ్మను-
కాలం కప్పిన రంగుల పొరల
దుప్పటి లాంటి చర్మంలో అమ్మ,
వరుడు లేని ఒక జీవనానంతర
పరిణయానికి ముస్తాబైన వధువులా ఉంది
గాజు గోడల గదిలో
నిద్ర లాంటి మెలకువలో ఉంది అమ్మ-
తలుపు తట్టాలంటే
ఊపిరంతా బిగబట్టాలి-
అమ్మ నవ్వుతుంది మరి..
బిడ్డల్ని తనలోంచి
ఈ లోకంలోకి తెచ్చినప్పుడు
లోకం ఊపిరంతా తానే ఉగ్గబట్టిన
ప్రాణాంతక క్షణాల పసిపాప నవ్వు అది
భర్త.. పిల్లలు.. సంసారం..
దారి దారంతా
రక్తంతో పాటు రాల్చుకున్న
వసంతాలు..
ఎంత వాడినా అమ్మ,
పండుటాకులా నవ్వుతున్న
పచ్చని వనమే-
మనకు వినపడదు గాని
అమ్మ మనసులో జ్ఞాపకాల అలల శబ్దం..
మూలపడిన పియానో పెట్టెలో
కదులుతున్న చేప పిల్లల సంగీతం-
నది లాంటి అమ్మ
ఇప్పుడు నడవలేకపోతోంది
అమ్మ చేతికి ఊత కర్ర కోసం
చెట్టుగా మారిపొమ్మని
రోజూ కలల్లో నా దేహాన్ని
పాతుకుంటున్నాను
– ప్రసాదమూర్తి 84998 66699