తెలంగాణ రాష్ర్టావతరణ ముందున్న పరిస్థితికి వెళుతున్నదా? అనేది ఇప్పుడు బుద్ధిజీవుల బాధ. సమైక్య రాష్ట్రంలో మనది కాని పాలనలో శాపగ్రస్తుల్లా బతికిన రోజులు మళ్లీ వస్తున్నాయా? అనే ఆవేదన ఈ కవితా ధార. ఎన్నో కష్టాలకు, ఎన్నో అవమానాలకు, ఎన్నో అణచివేతలకు విముక్తి ప్రత్యేక రాష్ట్రం. అందులో మనం సాధించిన ప్రగతి అప్పుడే విస్మృత చరిత్ర పుటల్లోకి జారిపోతున్నదా? అనేది సమాజం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. పదేండ్ల కాలంలో కోదాడలో పచ్చదనం పొంగించిన గోదావరి, ఇపుడు కొదురుపాక దాటడం లేదెందుకు? పంజాబ్‌ను మించి పంటలు పండించి మీసం మెలేసిన రైతు చేయి. నీళ్లకోసం..కొనుగోళ్లకోసం అధికారుల కాళ్లెందుకు తాకుతున్నది? మత్తడి దుంకిన చెరువులు పొంగిపొర్లిన వాగులు ఎండి మొండివారాయెందుకు?
పుట్లు పండించిన రైతు మళ్లీ పురుగుల మందులెందుకు ఆశ్రయిస్తున్నాడు? ఉరితాళ్లలో ఊపిరెందుకు వదులుతున్నాడు? ధర పలకని ధాన్యం వరదల పాలవ్వడమేమిటి? గ్రామాల్లో పారిశుద్ధ్యం పారిపోవడమేమిటి? ప్రకతి వనాలు నిలువునా ఎండిపోవడం ఎవరి పాపం? హరితహారం చేసిన చోట అడవులు నరకడమేమిటి? రైతుబంధులు లేవు. కేసీఆర్ కిట్టులు లేవు. చేపలు లేవు. గొర్రెలు లేవు. కరెంటు లేదు. ఇత్తులు కొనేవాడు లేడు. అప్పులిచ్చేవాడు లేడు. ఇవన్నీ సమాజం ముందున్న బాధలు. ప్రశ్నలు. నిరసనలు! కవి సమాజవాది. సంస్కరణా భిలాషి. రైతు నాగలి ధాన్యం పండిస్తే.. కవి కలం ప్రశ్నలు పండిస్తుంది. ఆ ప్రశ్నల విత్తులు మొలకలై మొక్కలై వృక్షాలై సమాజాన్ని తట్టి లేపుతాయి. తెలంగాణ వర్తమాన ముఖచిత్రాన్ని తమదైన శైలిలో ప్రజల ముందు పెట్టే కవితా
సమరమే ఈ కవితలు!!
ఎక్కిళ్లు వత్తే
ఏడుపాగినట్టు
ఊసుల్ని నెమరేసుకుంటూ
దుఃఖాన్ని దిగమింగుతున్నా
బుసలు కొట్టే తాసు
కుబుసం ఇప్పుకొని
తేలికపడ్డట్టు
కుంపట్ల కుత కుత ఉడుకుతున్న
ఈ మనసు సుత
ఏ కొయ్యకన్నా తగిలిస్తే బాగుండు
నిన్న మొన్న మాటల్ని
కూడేసుకొని, కుప్పేసుకొని
ఈక పీక పీక్కుంటూ
కడుపుల ఇంత ఇసం పెంచుకుంటే
ఏం ఫాయిదా…
నిమ్మళంగ ఉన్న మనసును
పొక్కిలి పొక్కిలి చేయబడ్తిరి
నట్టింట్లో కొచ్చిన ఆ
నలుగుర్ని నిలదీసి
తూర్పారబట్టకపోతి ప్చ్..!
ఏ కువ్వారం లేకుండా జూస్కున్నా
తిన్నింటి వాసాలు లెక్కబెడ్తిరి
సారెడు బతుక్కి
ఇన్ని కథలు పడాల్నా..!?
గొంతు పిడసగట్క పోతాంది
కన్నీటి చెమ్మ
పెయ్యంతా తడుముతాంది
ఇక వశపడ్తలేదు…
– డాక్టర్ కటుకోఝ్వల రమేష్ 99490 83327
మనకు మాత్రం నూరేండ్లే ఇచ్చినా..
తనకు మాత్రం అనంతం
అనుకున్నాం కదా! కడుపులో
చల్ల కదలకుండా ఉంటుందనీ!
ఐనా ఎందుకు
కోపగించుకుంటున్నదో
పుడమి తల్లి?
తన గర్భం నుంచి వెలికివచ్చిన
ఎత్తయిన కొండల్ని మనం
పిండి జేస్తున్నామని
తన మేనుపై మనిషి కట్టిన
ఎత్తయిన కట్టడాలను కుప్పకూల్చి
చూపుతోంది కావచ్చు నేల తల్లి!
నిన్ను దాటి విశ్వాంతరాల్లోకి
దూసుకుపోతున్నామనీ
మరో గ్రహమేదో వెతికి పెట్టుకొని
ఉత్పత్తి పేర ఊరేగుతున్న మేము
వ్యుత్పత్తిని మరిచామనీ
అంటున్నావా ధరిత్రీ?
మొత్తానికి ఊయల లేకుండా
ఊగడం చూపావు చిత్రంగా
నీ కుదుపులతో ధరణీ మాతా!
చీకటిలో కొరివి దయ్యాలు
చూడలేదెప్పుడు కానీ
పగలే పరుగులు పెట్టించి
నేలమట్టమవుతున్న
దెయ్యాల మేడల కింద చిక్కిన
బక్క ప్రాణులెన్నో బతికి
బయటికి రాలేక లోపలే చావలేక
పగలే చీకటిలో మగ్గుతున్న వైనం
ఎలా చూపగలుగుతున్నావో
కదా మేదినీ!
మాకు మరో అవకాశం ఇస్తావో లేదో..
నీక్కూడా మా సంచారానికీ
నీ పేర కవితలల్లి అందాలను ఆస్వాదించే
అద్భుత గమనాన్ని మరో తరానికి!
– రామసుగుణాకర్ రాజు
అడవిలో అడుగులు మాపేస్తామంటే
పండుటాకులు కూడా
నేల రాలేందుకు జంకుతున్నాయి,
రాలిన శబ్దం వైపు వచ్చిన
ఏ తుపాకీ గుళ్లకు బలి కావల్సివస్తుందోనని!
తుపాకీ మోతలో జీవులన్నీ పారిపోయాక
ఒంటరిగా దొరికిపోయిన చెట్లన్నీ
ఊపిరి బిగబట్టి చూస్తున్నాయి
మరింకెన్ని దాష్టీకాలను కళ్లారా జూసి
మూగ సాక్షులుగా ఉండాల్సి వస్తుందోనని
నువ్వు కూర్చున్న కొమ్మనే
నరుక్కుంటున్నప్పుడు
అది మానవ నైజమేమోనని!
సర్ది చెప్పుకొన్నా..
నేడు, మా చెట్లన్నింటినీ
కూకటివేళ్లతో కూలదోసి
నీ అభివృద్ధి ముఖచిత్రంపై
‘పచ్చని చెట్లే, ప్రగతికి మెట్ల’ని రాసుకున్న
నీ ఆత్మహత్యా సదృశ్యానికి!
ఏమనుకోవాలో తెలుసుకోలేకపోతున్నా
చాటు మాటుగా కోసిన చెట్లన్నీ
మనిషి ఎత్తుకుపోతున్నప్పుడు
చెట్లకు పాడె మోస్తున్నాడేమోనని
మనిషి మంచోడేనని నమ్మడం
ఎంతటి అమాయకత్వమో గదా!
మనిషి ఎవరి రుణమూ ఉంచుకోడేమో
తన చితికి కట్టెలను వాడినట్టే
చెట్లకు చితి పెట్టి
తన ఆయువును కూడా
తగలెట్టేసుకుంటున్నాడు కదా?
– వినోద్ కుత్తుం 9634314502
భూ తల్లిని కొంగుసాటున దాసుకోండ్రి
బూచోళ్లున్నరు
పాపమెరుగని పక్షుల్లారా
ఏ కొమ్మ మీద వాలాలని చూస్తున్నరు
ఈ రోజున్న కొమ్మ
రేపు పరాయిది
మానవత్వమున్న ప్రాణుల్లారా జరభద్రం
బుల్డోజర్ల మొదళ్లు కాపు గాశినయి
కిక్కిరిసిన సిటీలో
ఒత్తుకస్తున్న జాగా
పచ్చదనాన్ని ఆచ్ఛాదనంలా కప్పుకొని
అష్ట కష్టాలు బడి ఆక్సిజన్‌ను
దోసిల్లతో అందిస్తున్నది
గిప్పుడా భూమి
కొన ఊపిరితో ఉన్నది
ఒకసారి పరాయోడు/ ఒకసారి మనోడు
మీసాల్ దువ్వుడు కొత్తేమీ కాదు
అయితేంది
గీ మట్టిల జిగి మస్తుగున్నది
అన్యాయానికి
పిడికిళ్లు పుట్టుకొస్తనే ఉంటయి.
– డాక్టర్ శారదా హన్మాండ్లు 99122 75801
యక్ష ప్రశ్నలేం కాదు!
పంట భూమి ప్రశ్నలు!
రైతును పంట భూమి
ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుంది
ఈ విత్తనాలు నకిలీవి కాదు కదా?
బోరు నీరు పాతాళానికి పోలేదు కదా?
ఎరువులతో నన్ను విషపూరితం చేస్తునే ఉంటావా?
నువ్వూ మోసపోతునే ఉంటవా?
కిసాన్ ఎంత శ్రమించినా తనకు మించిన
ప్రశ్నావళి కొడవళ్లు కొడవళ్లు!!
వ్యవస్థ మహా విషమంగా విషమయం!!
రైతు తన వ్యవసాయ భూమిలో
ఎప్పుడూ దోషిగానే తలకు చేతులు పెట్టుకునే!
ఏం సమాధానం ఇవ్వగలడు!
పంట చేతికి వచ్చే వరకూ ప్రశ్నల వర్షం
రైతు గుండె మీద పిడుగులే!
సాగు భూమి చివరకు రైతుకు
సమాధి స్థలంగా మిగులుతుందేమో!
ఎన్నో పంచవర్ష ప్రణాళికలు పత్రాలు పత్రాలుగా
సభలు చేసినా గుళికలే రైతు దోసిట్లోనా!!
నిత్యం దేశంలో
అంతటా అన్నం పెట్టే
భూమి పుత్రుల అంతిమయాత్రా దృశ్యాలే
రేపు అందరికీ పిడికెడన్నం దొరికేనా??
– కందాళై రాఘవాచార్య 87905 93638
కాంక్రీటు జంగిల్లో
ఎవరితోనైనా మింగిల్ కావాలన్న సత్యం
తెలుసుకున్నట్టుంది
సుతారంగా పోజిచ్చిందో పిచ్చుక
మనసులు కలవలేదనో
మనుషులు ఒంటరి ద్వీపాలయ్యారనో
ఆవేదనను కాఫీలో కలుపుకొంటూ
ఒంటరితనం అడవుల్లో నడుస్తుంటాం మనం
ఇన్స్టాంట్ స్నేహాల్లో
అడ్జస్ట్మెంట్ కుదరక
అపార్ట్మెంట్ల నిశ్శబ్దంలా
మౌనంలోకి జారిపోతుంటాం
మనిషికి మనిషే అండని మరిచి
వర్చువల్ ప్రపంచంలో
ఖైదీగా బందీ అయినవాళ్లమే కదా అందరం
పక్షులు సంఘజీవులై కదులుతుంటే
మనిషి మాత్రం మీడియా జీవిగా అద్భుతాలు చేస్తూ
మనిషి స్పర్శను మరిచాడని
పిచ్చుకొకటి వాపోతుంది.. పాపం పిచ్చుక కదా!
– సీఎస్ రాంబాబు
అతనికి
ఏమివ్వకపోయినా పర్వాలేదు
అభయ హస్తాలతో మోసగించకండి
వాగ్దానాలకు ప్రాణాలు పోతున్నాయి
ఆకలి, అప్పుల బహుమతులతో కనుమరుగైపోతున్నాడు
అతను
విత్తనం నాటాడు/ చేనును పెంచాడు
పంటనిచ్చాడు/ అన్నం పెట్టాడు
మట్టిచేతుల బురదకాళ్లు
రైతుకు ఏమిలేక చెట్టుకు ఉరేసుకొని
వేలాడుతున్నాడు/
కాలమే హత్య చేసినట్టుంది
అతని గుండెకు
నాయకుల మాటల ముళ్లు కుచ్చి కుచ్చి
గుండె వ్రణమైంది
జై కిసాన్, అన్నదాత, కృషీవలుడు,
కర్షకవీరుడు/ కీర్తించే పద్మశ్రీలేవీ వద్దు
కానీ/ అన్నం పెట్టిన అమ్మ నాయిన
చేతులకు సున్నం పెట్టకండి
అతని చేతిలో నాగలి విరిగింది
అతడు పండించిన పంటలకు ధరలు
తెల్లగుడ్లేసినవి
అతడు మార్కెట్లో కుదేలవుతున్నాడు
అతనిదెప్పుడూ ఆకలి గోసేనా..?
ఇచ్చిన హామీలు
కరెంట్ తీగలై ఆహ్వానిస్తున్నాయి నన్ను
కౌగిలించుకోమని/ ఇచ్చిన భరోసాలు
పురుగుల మందుల డబ్బాలై ఎక్కిరిస్తున్నాయి
చెరువులనే మింగినోళ్లకు?
రైతులు ఒక లెక్కనా!
క్రీస్తును ఒక్కనాడే శిలువేసిండ్రు
రైతును ప్రతిరోజూ శిలువేస్తుండ్రు
ఇది మన ఆధునిక రైతు భారతం
– వనపట్ల సుబ్బయ్య, 94927 65358