ఇటీవల జానకమ్మ ఇంగ్లాండు యాత్ర చదివితే స్త్రీలు యాత్రాకథనాలు రాస్తే ఎంత విలక్షణంగా ఉంటాయో కదా అనిపించింది. తాజాగా రచయిత్రి, అనువాదకురాలు స్వర్ణ కిలారి ‘ఇంతియానం’ పేరుతో స్త్రీల యాత్రా కథనాలతో సంకలనంగా తీసుకువచ్చారు. కుటుంబానికే కాదు, సృష్టికి ఎనగర్ర వంటి ఇంతి ఆదిలోనే తన ‘జోలాలి’ అంటూ ఆదిపద్యాన్ని వినిపిస్తుంది కదా. ఇప్పుడు తాను నడిచిన నేపథ్యాన్ని, తిరుగాడిన స్థలాల్ని లేదా సంపాదకురాలి మాటల్లోనే చెప్పాలంటే ‘కొత్తదారుల’ను చూపుతున్నది.
‘సఫర్ కర్కే దేఖ్నా’ అని ఉర్దూ సామెత. సాహిత్యంలోనూ ‘అటజని కాంచె భూమిసురుడంబర చుంబి’ అని కూడా చదువుకున్నాం. ఆధునిక కాలంలో ఏనుగుల వీరాస్వామయ్య మొదలు రాహుల్ సాంకృత్యాయన్ వరకు, నాయని కృష్ణకుమారి మొదలు ఆచార్య ఆదినారాయణ వరకు ఎంద రో రచయితలు తమతమ యాత్రలను అక్షరబద్ధం చేసి చరిత్రలో పుటలుగా మలిచారు. ఎన్ గోపి దేశదేశాల యాత్రా రచనలు విదేశీ పర్యటనానుభవాలు రాసేందుకు నాకు మార్గదర్శకమైంది. దాసరిల అమరేంద్ర, పరవస్తు లోకేశ్వర్ యాత్రాకథనాలు సుపరిచితమే.
స్వర్ణ అనువాదకురాలిగా ‘లిప్తకాలపు స్వప్నం’తో తనదైన ఇరవై నాలుగు క్యారెట్ల మార్కును పొందింది. దానికి తోడు జీవన సహచరుడు ‘ఒక దళారి పశ్చాత్తాపం’ను తెలుగువాళ్లకు పరిచయం చేసిన దిలీప్ కొణతంతో త్వరలో తేనున్న ‘13’ థాయిలాండ్ చరిత్రలో మరిచిపోలేని ఘట్టానికి ఇచ్చిన అక్షరరూపమే కాదు, స్వయంగా చేసి వచ్చిన యాత్రా కథనం. ఆ కథనం ఇంతియానంలోనూ ఉన్నది.
అపర్ణ తోట తన ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’ యాత్రకు అంతరంగాన్ని జోడించి చెప్పడంతో అమె వ్యాసం కేవలం యాత్రా కథనంలా కాక భావాత్మకంగా సాగిం ది. నిజానికి వ్యాసానికి ‘అమ్మ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌లో, నాన్న హేమకుండ్ సాహెబ్‌లో’ అంటూ అపర్ణ పెట్టిన పేరుతోనే ఆమె మాటల్లో…రాతల్లో… అనుభూతుల్లోని ఉద్వేగం తెలుస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచనా స్రవంతి. నిజానికి చూసే హృదయముండాలి కానీ రాయిలోనూ అందమే దర్శనమిస్తుంది. ఆలమూరు సౌమ్య తన అరవ దేశయాత్రకు చారిత్రక, ఆధ్యాత్మిక పరిచయాలతో పాటు రాళ్లల్లో అందాలను మొలకెత్తించిన కనులను చూడటం ప్రత్యేకం. మనం కూడా ‘చెక్కిన చేతులకు జోహార్లు’ పలుకకుండా ఉండలేం. నిజమే ‘జీవితంలో అత్యున్నతమైన క్షణాలు గడిచిన దారుల్లో మళ్లీ నడవడం’ కదా! ఉమా నూతక్కి అలా అనడమే కాదు అలాంటి తన యాదుల్ని ‘జిందగీ మిల్గయా!’ అంటూ తిరిగి పొందిన స్ఫూర్తిని తాను అనుభవించడమేకాక మనకు అనుభూతినీ కలిగిస్తుంది.
నిజానికి ఆంధ్రా ఒడిశా బార్డర్ అందాలు, లేదా నిన్న మొన్నటి దాకా ఎన్కౌంటర్లతో దద్దరిల్లిన అక్కడి దృశ్యాలు మనకు కొత్త కాకపోవచ్చు. కానీ ఉమ కథలా మలిచిన తన కథనాన్ని తప్పక చదవాల్సిందే! పైన చెప్పినట్టు ‘అటజని కాంచె’ అన్న ఆ హిమాలయాల అందచందాల వర్ణనలు సాహిత్యంతో సంబంధమున్న అందరం ఎప్పుడో ఒక దగ్గర చదివినవాళ్లమే.
ఓల్గా ప్రత్యక్షంగా ఇటునుంచి వెళ్లి అటువైపును చూసి వచ్చారు. అలా చూసివచ్చిన దానిని తనదైన శైలిలో రాశారు. ‘భూటాన్ ఆనందంగా నివసించే ప్రజలతో నిండిందనే నివేదికల వెనుక కొంత, రాజు (భూటాన్ రాజు) ప్రమేయం కూడా ఉందనిపించింది’ అనడం విహార యాత్రికురాలిగా అక్కడి అందాలనే కాదు రచయిత్రిగా, యాక్టివిస్ట్‌గా తాను గమనించిన ప్రజా జీవితాన్ని అక్షరబద్ధం చేయడం చూస్తాం.
డాక్టర్ రాణీప్రసాద్‌కు స్విట్జర్లాండ్ భూలోక స్వర్గం లా కనిపిస్తే, నీహారికా రెడ్డికి నేపాల్ ‘భూతల స్వర్గం’ లా కనిపించింది. మన ఆలోచనల్లాగానే మనలోని వైవిధ్యాలు ఈ వ్యాస సంపుటంలో చూడొచ్చు. చరిత్రతో పాటు చూడగలిగిన స్త్రీ లోచూపు అక్షరాల నిండా కనిపిస్తుంది. అన్నివ్యాసాల్లోనూ ఆ విషయం తెలుస్తుంది. అది కంభంపాటి సీత రాసిన ‘చచ్చి బతికిన క్షణాల్లో’ కావచ్చు. ఎడారిలో ఒయాసిస్సులాగా కవిత పులికి ‘పెనాంగ్ ద్వీపంలో దొరికిన భారతీయ చెలిమి’ కావచ్చు. ఇక్కడ ఉండే మనకు విదేశీయానాలు ఎంత ఆసక్తో.. కొంత కాలంగా అమెరికాలో ఉంటున్న కల్పనా రెంటాలకు తన నేల అంతే అందంగా కనిపించింది. పాపికొండల అందాలు కల్పన రాతల్లో మరింత అందంగా కనిపిస్తాయి. ‘ఈ ఆడవాళ్ల అల్లరిని సముద్రుడు కూడా ఎంజాయ్ చేసినట్టున్నాడు ’ అంటూ ఎంత సరదాగా రాస్తారో’.
‘మరి పోలవరం ప్రాజెక్టు వస్తే?’ ఈ అం దాల సంగతేంటని ఆందోళనా చెందుతారు. ‘కలకత్తా మీదుగా చైనా సరిహద్దు వరకు’ సాగిన ప్రయాణం కాత్యాయనీ విద్మహేది. నిజానికి ఇవన్నీ చూసినవే అయినా కాత్యాయని రాతల్లో మరోసారి దర్శించినప్పుడు ఇంత అందముందా అనిపిస్తుంది. ముఖ్యంగా ‘చదువులు నాలుగు గోడల మధ్యకాక ప్రకృతి పరిసరాలలో సాగినప్పుడు చదువంటే భయం పోయి ఆసక్తి ఏర్పడుతుంది’ అన్న శాంతినికేతన్ సందేశాన్ని అందించిన తీరు ఆమె పరిశీలనను తెలుపుతోంది. కుప్పిలి పద్మ కథల్లాగే ఆమె యాత్రాకథనాలూ ఆసక్తిగా ఉన్నాయి.. అ లాంటిదే ‘డియర్ బ్లూ మౌంటెయి న్’. ఊటీని పరిచయం చేసిన పద్మ గీసిన అక్షరచిత్రం ఈ వ్యాసం. రచయిత్రుల్లో చాలామంది ఒకటి రెండుసార్లు విదేశీయానాలు చేసినవారు ఉండొచ్చు, కానీ దాదాపు ప్రపంచమంతా రెండు మూడుసార్లు.. అవును దాదాపు గ్లోబు మీదున్న అన్ని దేశాల్లో ఎనభై శాతం చుట్టివచ్చిన యాత్రికురాలు హైదరాబాద్‌కు చెందిన నర్మద రెడ్డి. గతంలో ఆమె తన విశ్వయాత్రను పుస్తకాలుగా తెచ్చింది.
ఇందులో తన నమీబియా యాత్రను పరిచయం చేసింది. విదేశీయానాల్లో కేఎన్ మల్లీశ్వరి అమెరికా యాత్ర కూడా ఉంది. ఇది తానా సాహిత్య యాత్ర. అటువంటిదే కే సునీతారాణి ‘నేటివ్ కెనడాలో నేను’. ఈ కోవలోని కొత్త ప్రాంతాల పరిచయం జయశ్రీ అబ్బినేని చేస్తే, ఝాన్సీ కొప్పిశెట్టి ఆస్ట్రేలియా అనుభూతులను పరిచయం చేశారు. ఇది సమగ్ర పరిచయం లాంటిదే. యాత్రికురాలిగా రావులపల్లి సునీత కెమెరా లెన్సుల్లోంచి వివిధ దేశాల్ని చూశారు. ‘కొత్త ప్రపంచం’ కూడా అలాంటిదే… వసుధారాణిది ఒక కోణమైతే, శాంతి ప్రబోధది సామాజికోద్యమ భాగస్వామ్యంలో భాగంగా సాగిన విదేశీయానం. వేమన వసంతలక్ష్మి దక్షిణాఫ్రికా యాత్ర కేవలం యాత్రా కథనంలా కాకుం డా అనేక విషయాలను తెలియజెప్పే సమాహారంలా సాగితే, కాళ్లకూరి శైలజ రామాయణ యాత్ర కొత్త విషయాలను చెప్తుంది.
వనజ దృష్టికోణంలోంచి మెక్సికోనూ నిజంగా చూడాల్సిందే! సుజాతా గొట్టిపాటి, వీబీ సౌమ్య, స్వర్ణ కిలారితో పాటు ఇంకొన్ని విదేశీయానాల కథనాలు ఇందులో ఉన్నాయి. ఇవే కాక అచ్చ దేశీయ యానాలు కూడా ఈ సంపుటికి కొత్త అందాలనిచ్చాయి. వాటిలో కొండవీటి సత్యవతి ‘సత్యాన్వేష ణ’ బాగుంది. ఇంకా నీరజ జవ్వాజి, శిలాలోలితల అండమాన్ అద్భుత ద్వీపాల యాత్రల కథనం చదవాల్సిందే. ఝాన్సీ పాపుదేశి బెళ్లిగుండి జలపాత విహారం, పూదోటశౌరీలు రాసిన ఆదివాసీల దేవుడు, భరణీ చిత్రలేఖ రాసిన అటవీ అందాలు, నజ్మా షమ్మీ, రమా శాం డిల్య, రొంపిచర్ల భార్గవి, సుజాతా వేల్పూరి దేవభూ మి యాత్ర, సుమతి చురుకంటి, సుభాషిణి పోరెడ్డి, స్వాతి పంతుల, విజయ నాదెళ్ల, ఈ అడవి దాగిపోనా’ అంటూ ఆకుపచ్చని అనుభూతుల నిచ్చిన వాడ్రేవు వీరలక్ష్మీదేవి, పద్మ మీనాక్షి లాండోర్ అందాలు, అద్భు త అనుభవాలను అక్షరీకరించిన జ్వలిత దెంచనాల.. ఇలా ఇంతియానం విలక్షణంగా సాగింది. నస్రీన్ఖాన్కు భారతీయ యవనిక మీద భిన్నత్వంలో ఏకత్వం తన యాత్రకు కథనమైతే, సలీమాకు జలియన్ వాలాబాగ్ స్ఫూర్తినిచ్చింది. సరిత భూపతి తిప్పడి కొండపర్తి యాత్ర చదవాల్సిందే!
‘ఇంతియానం’ ఆవిష్కరణ సంద ర్బంగా శుభాకాంక్షలు. చక్కని పుస్తకాన్ని తెచ్చిన ఆన్వీక్షికి అభినందనలు. తెలుగు కండ్లకు కొత్త చూపునిస్తున్న స్వర్ణకిలారికి ఆత్మతో అలాయ్ బలాయ్.