తెలంగాణ నేల నల్లరేగడి మట్టికి, నాణ్యమైన పత్తి సాగుకు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ఒకప్పుడు వరంగల్ నగరం వస్త్ర పరిశ్రమకు నిలయంగా ఉండేది. 1934లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించిన ఆజంజాహి మిల్లు దాదాపు 10 వేల మందికి ఉపాధినిస్తూ దక్షిణ భారతదేశంలోనే వస్త్ర ఉత్పత్తికి కేంద్రంగా విరాజిల్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో జరిగిన నిరంతర నిర్లక్ష్యం వల్ల 1990లో ఈ మిల్లును మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల వేలాది మంది కార్మికులు జీవనోపాధిని కోల్పోయి, పొట్ట చేతపట్టుకొని సూరత్, భివాండి వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో వలస కార్మికులు కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టును 1327 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 2017 అక్టోబర్ 22న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు శంకుస్థాపన జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన టీ-ట్యాప్ (తెలంగాణ టెక్స్టైల్ అండ్ అప్పరల్ పాలసీ-2017) ద్వారా మూలధనం, విద్యుత్తు రాయితీ, ఎస్జీఎస్ రీయింబర్స్మెంట్ వంటి అనేక ప్రోత్సాహకాలు అందించడం వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులు వరంగల్ వైపు మొగ్గు చూపారు. ఈ పార్క్ ద్వారా దాదాపు రూ.11,586 పెట్టుబడి సామర్థ్యంతో దాదాపు 1.13 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటయింది. ఇప్పటికే కిటెక్స్ (రూ.1,791.7 కోట్లు), యంగ్వన్ (రూ.1,131.6 కోట్లు), గణేశ ఎకోస్పియర్ (రూ.1,009 కోట్లు) వంటి 22 దేశీయ, అంతర్జాతీయ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. తెలంగాణ టెక్స్టైల్ పాలసీ స్ఫూర్తితో కేంద్రం 2021లో ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పరల్-పీఎం మిత్రా) పథకాన్ని ప్రారంభించి, దేశవ్యాప్తంగా 14 రాష్ర్టాల నుంచి వచ్చిన 18 ప్రతిపాదనలతో ఏడింటిని ఎంపిక చేసింది. వాటిలో ఒకటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్.
తెలంగాణపై కేంద్రం పక్షపాత, వివక్ష ధోరణి చూపింది. పీఎం మిత్రా పథకం కింద ప్రాజెక్టులను గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ అని రెండుగా విభజించారు. గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులకు రూ.500 కోట్లు, బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టుకు రూ.200 కోట్లు పీఎం మిత్రా పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
కేఎంటీపీ 2017లోనే ప్రారంభమైనందున దీనిని బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టుగా పరిగణించి కేవలం రూ.200 కోట్ల సాయాన్ని మాత్రమే ప్రకటించారు. ఇందులో కూడా విడుదల చేసింది కేవలం రూ.30 కోట్లు మాత్రమే. పీఎం మిత్రా పథకానికి కొనసాగింపుగా టెక్స్టైల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్-టీసీడీపీ తీసుకువచ్చారు. టీసీడీపీ కింద గుజరాత్‌కు 13 ప్రాజెక్టులకు రూ.432 కోట్లు కేటాయించగా, తెలంగాణకు కేవలం 2 ప్రాజెక్టులకు గాను రూ.46 కోట్లు విదిల్చారు.
కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను బీజేపీ ఖాతాలో వేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వ చొరవగా తప్పుడు ప్రచారం చేస్తున్నది. ఏండ్ల క్రితమే ప్రారంభమ, కిటెక్స్ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న ఈ పార్క్‌ను 2026లో మళ్లీ ప్రారంభించడానికి ప్రధాని మోదీ రావడంలో రాజకీయ ప్రయోజనాలు తప్ప అభివృద్ధి ఆలోచన కనిపించడంలేదు. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి కేవలం ప్రచారంపై ఉన్న శ్రద్ధ క్షేత్రస్థాయిలో ఉన్న పత్తి రైతులపై లేకపోవడం ఆందోళనకరం. దేశంలో పత్తి దిగుమతులు 2019-20లో రూ.3,588 కోట్ల నుంచి 2024-25 నాటికి రూ.7,830 కోట్లకు భారీగా పెరిగాయి. విదేశాల నుంచి దిగుమతులను ప్రోత్సహిస్తున్న కేంద్రం, స్వదేశీ రైతుల నుంచి కనీసం 33 శాతం కూడా కొనుగోలు చేయడంలేదు. భారతీయ రైతుల నుంచి పత్తిని సేకరించడంలో కేంద్రం విఫలమవుతున్నది. ఫలితంగా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.
కాకతీయ పార్క్ టెక్స్టైల్ అనేది తెలంగాణ రాష్ట్ర దార్శనికత, స్వయంకృషికి నిదర్శనం. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కష్టపడి నిర్మించిన పార్క్ ఇప్పటికే ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నది. కానీ ఈ ప్రాజెక్టును కేంద్రం, బీజేపీ నేతలు తామే సాధించినట్టుగా చెప్పుకోవడం విడ్డూరం.
ఢిల్లీ పెద్దల భజన మానుకొని, తెలంగాణకు రావాల్సిన నిధులను తీసుకురావడంపై తెలంగాణ బీజేపీ నేతలు దృష్టి పెట్టాలి. పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, దిగుమతులను తగ్గించినప్పుడే వస్త్ర రంగం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. కేవలం ప్రచారం కోసం చేసే ప్రారంభోత్సవాలు సరికాదు. ఇలాంటి ధోరణితో సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది.