అడుగులు నాలుగింతలు ముందుకే
మాటలు మబ్బులు దాటినై నిజమే
నేల మీద అరికాలానే,
బిగిసిన పిడికిలి బలంతోనే-
ఒట్టు తిన్న పానం
రెట్టపై దీక్షపట్టి బంగారు కలే
ఆకలి, అవమానం
ఒక్క నీటి జాలుకు కొట్టుకుపోయినై
ఆశ్చర్యాలు అంబరాలు దిగి,
అపహాస్యాల నొసళ్లపై
దౌర్భాగ్యాలు ముూగినై
ఎంత గ్రంథం నడిచింది!
మరెంత గండం గట్టెక్కింది!
ఒక్క ఇతిహాసానికి తక్కువేమీ కాదు
కాలాతీతునికెప్పుడూ కాల హరణం తెలియదు
పునాది రాయి వేసి, సుందర శిఖరాన్ని
ఎదుట నిలుపుతడు
దృక్పథకాల సారించి, లేనోళ్లను
కలిగినోళ్ళను చేస్తడు
మజిలీలకు ముగింపు ఉండదు
సజావుగాను ఉండవు
ఊహలు, వ్యూహాలు ‘ఆహా’ అనే అధిరోహణానికే
పనియాగ నిష్టకు మురిసి, యాగఫలం ఎదురొస్తది
అమృతభాండం అందరికీ
దశాబ్ది నుంచి శతాబ్ది వరకు
తెలంగాణ తేజోవల్లరి!
– దాసరాజు రామారావు