ఒక నిశాదుడు క్రౌంచ పక్షుల జంటలోని మగ పక్షిని చంపాడు. ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి చలించిపోయి నిషాద శ్లోకాన్ని అలవోకగా చెప్పాడని ‘శోకాత్ శ్లోకత్వ మాగతః’ అని లోక ప్రసిద్ధి.
ఆవంచ ప్రమోద్ సహచరి శాలిని 2019లో చనిపోయింది. ఆమె జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆయన ‘గుండెచప్పుళ్ళు’ 2021లో తీసుకువచ్చా రు. ‘కళ్లల్లో కన్నీళ్లు పొరలుగా ఏర్పడి కనురెప్పలు మూసి తెరిచేటప్పుడు రాలిన కన్నీటి బొట్టులో నుంచి నాలో పదం పుట్టింది. అర్ధాంగి వియోగం నాతో కవిత్వం రాయించింద’ని చెప్పుకున్నారు కవి.
‘మేలిమి చింత’ రెండవ కవితా సంపుటిని 2024లో ప్రచురించారు. ఈ సంపుటిలో తనను విడిచిపోయిన సహచరి జ్ఞాపకాలతో పాటు సామాజిక అంశాల మీద సమకాలీన సంఘటనల మీద కవితలున్నాయి. నిత్యం తన సహచరి వియోగ బాధను అనుభవిస్తున్న కవి ఆమెతోని నిరంతర సంభాషణ చేస్తున్నారు. అది రెండు ఆత్మల మధ్యన సాగే కవితా ప్రయాణం. ఆమె దూరమై జీవితం భారమైందని ఆ తలపుల్లోనే జీవిస్తున్నానని ‘జీవితం’ కవితలో ప్రకటిస్తున్నారు కవి.
‘అప్పుడప్పుడు నీ తలపు చల్లని గాలై
నన్ను తాకి వెళ్తుంది
వెచ్చని కౌగిలై నన్ను కప్పుకుంటుంది
ఒంటరి జీవితం కలల నిలయమైంది’
సహచరి దూరమైన తర్వాత దుఃఖం ఆవహిస్తుంది. ఏడ్చీ ఏడ్చీ కళ్లు ఎండిపోతాయి. నిద్రలేని రాత్రులు ఎన్నో జాగారాలు చేయిస్తాయి. అదే విషయాన్ని ‘అవును నువ్వొక’ కవితలో వ్యక్తీకరిస్తున్నారు.
‘సముద్రాన్ని తాగేసిన కళ్లు ఎర్రబడ్డాయి
జాగారాల రాత్రులు ఉక్క పోతలయ్యాయి’
ఈ కవిత్వంలో అమూర్త మూర్త వస్తువుల మీద భావనల మీద మానవత్వ ఆరోపణ కనబడుతుంది. ప్రతి ఒక్కరూ ఇంటిలో గత స్మృతులుగా పెద్దల ఫొటోలు పెట్టుకుంటారు. అవి చూసినప్పుడు వాళ్ల జ్ఞాపకాలు మన మనసులో మెదులుతాయి. వీధి గుమ్మం స్మృతి గీతాలు ఆలపిస్తూ ఇంట్లోని ఒక్కొక్క గదిని తడుతుంది. ‘ముఖం చాటేసిన కాలం’ కవితలో మనసుకు మానవ ధర్మాన్ని ఆరోపిస్తున్నారు.
‘అర్థం కాక తనలో తాను గొణుక్కుంటుంది మనసు’ సహచరి జ్ఞాపకాలను మరణం చేసుకుంటూ ‘నీ తీయని పిలుపులన్నీ కన్నీరు పెడుతున్నాయి’ అంటారు. ప్రమాదంలో చనిపోయిన ఒక డాక్టర్ శవపరీక్ష జరిగే దృశ్యాన్ని హృదయ విదారకంగా చిత్రీంచారు మార్చురీ కవితలో..
‘తెల్ల బట్టలు కప్పే కళేబరం
గుండెలవిసేలా ఏడ్చే బంధువులు’
జనన మరణాలు సహజంగా జరుగుతుంటాయని తన్ను తాను ఓదార్చుకుంటాడు. స్త్రీలు ఈ దేశంలో ఎప్పుడూ పీడితులే. వాళ్లు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా స్త్రీల సమస్యల మీద స్త్రీలు రాసిన కవిత్వం ఉంది. పురుషులు కూడా స్త్రీల మీద సహానుభూతితో రాసిన కవితలున్నాయి. ఈ కవి రాసిన ‘ఆడపిల్ల’ కవిత కూడా అలాంటిదే. ఆడవాళ్ల మీద ఆంక్షలు ఎప్పుడూ ఉంటాయి. పుట్టినప్పటినుంచి ముసలి వాళ్లు అయ్యేవరకు ఏదో రూపంలో అవి ఉంటూనే ఉంటాయి.
‘పుట్టగానే తల్లి, పెరిగే కొద్దీ
తండ్రి కనుసన్నల్లో పెరుగుతుంది
మూడు ముళ్లతో పరాయి
పురుషుడి ఆధిపత్యంలోకి నడుస్తుంది
పెరిగి పెద్దయ్యాక
పిచ్చి అమ్మ నీకేం తెలియదంటుంది
రెక్కలొచ్చిన పక్షి’
కవి ఇప్పటివరకు రాసిన రెండు కవితా సంపుటల్లో స్మృతి గీతాల లాంటి కవితలు ఎక్కువగా ఉన్నాయి. కవిత్వంలో భాష సరళత ఉంది. అభివ్యక్తిలో కొత్తదనం ఉంది. ఒక భావాన్ని కవిత్వం చేసి శక్తి ఉంది. మేలిమి చింతన నుంచి సామాజిక చింతన వైపు పయనించాలని ఆశిద్దాం.
– కందుకూరి అంజయ్య 94902 20201