హేతువు బోధించే గురువు నీడలో
ప్రశ్న పుడుతుంది
తండ్రే గురువైతే తొలి పలుకుల
నుండే ప్రశ్న మెదడులో
జవాబు లభించే దాకా
ప్రశ్న పదే పదే ఉత్పన్నమౌతుంది
నడిచే దారిలో కంచెలు
కంచెలకు మూలం తొలిగే
దాకా ప్రశ్న సజీవం
కూడు గూడు గుడ్డ దొరికే
దాకా ఐదు వేళ్లు
బిగుసుకుంటూనే ఉంటాయి
అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో
నమ్మిన సిద్ధాంతం కోసం
పరిశ్రమించే తత్తానికి
ప్రశ్న ఊపిరులూదుతుంది
రసాయన శాస్త్రంలో ఇంజినీరింగ్ కన్నా సామాజిక ఇంజినీరింగ్
మిన్ననే ఆలోచన నంబాల
మదిలో నాటుకుంది
ఒకే సిద్ధాంతం
పలు గ్రూపులు అయినా సడలని గమ్యం
ఎన్ని భూములు పంచారో
ఎన్ని ప్రాణాలు నిలబెట్టారో
ఎన్ని కుటుంబాలకు జీవం పోశారో
నలభై మూడేళ్ల జీవితం
అడవిలో ప్రశ్న కోసం నిత్యం!
సమాజాన్ని నిలబెట్టేది ప్రశ్న
కూలదోసేది మూఢ నమ్మకం
దోపిడీ స్వామ్యం రూపు
మార్చుకుంటూ అడవిపై కన్నేసింది
రాజ్యం ప్రశ్నలను చంపి
చరిత్రాత్మకం అని చాటుతుంటే
నేలమీది నెత్తుటి చుక్కలు ప్రశ్నలకు ఊపిరి పోస్తుందనేది చారిత్రక సత్యం!!
సిక్కోలు పురుడు పోస్తే
ఓరుగల్లు ఉద్యమాల పాలు పోసింది
ఆబూజ్ మడ్లో ఆఖరి శ్వాస ఆగింది
రేపటి తరానికి ప్రశ్నలు సంధిస్తూ..
– గిరి ప్రసాద్ చెలమల్లు 94933 88201