’ఇంట్లో ఈగలు తోలలేనోడు.. పొరుగూరికి పోయి పొలిమేరలు దాటిస్తానన్నట్టు’ ఉన్నది సీఎం యవ్వారం. సదువు శారెడు.. బల్పాలు దోశెడు అన్నట్టు.. ఇక్కడ పాలనను గాలికొదిలేసి సీఎం, మంత్రులు ఢిల్లీ విమానాలు ఎక్కడం, దిగడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికే ముప్పై నెలల్లో 70 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లి రికార్డు సృష్టించిండ్రు సీఎం. ఢిల్లీ నుంచి రాగానే.. మంత్రులు పరుగెత్తుకుంటూ వెళ్లి అధిష్టానానికి దండాలు పెట్టి వస్తున్నారు.
పంటలకు మద్దతు ధరలు రాక, యూరియా దొరక్క, సరిపోయినంత కరంట్ రాకా రైతులు అల్లాడిపోతున్నారు. రెండు రోజుల వానలతో ఇప్పుడు కొంచెం చల్లవడ్డప్పటికీ మొన్నటిదాకా గుక్కెడు తాగునీటికి కూడా జనాలు అల్లాడిపోయే పరిస్థితి ఉండే. కానీ మన పాలకులు మాత్రం రోజూ కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల దగ్గర కూర్చుని గంటల తరబడి మీటింగులు పెట్టుకోవడమే ప్రాధాన్యతగా భావిస్తున్నారు.
’కంటికి కనిపిస్తున్న కష్టాలను వదిలేసి.. ఢిల్లీ పెద్దలకు దండాలు పెట్టుకుంటున్నట్టు’ ఉన్నది ఈ తీరు! కాంగ్రెస్ మార్క్ ’ఢిల్లీ గులాంగిరి’ రాజకీయాల వల్ల తెలంగాణలో పాలన పూర్తిగా కుంటుపడిందని జనాలు నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. మొత్తానికి మన రేవంత్ సారు పాలన చూస్తుంటే.. ’గల్లీల జనం గోస.. ఢిల్లీల నేతల బస’ అని స్పష్టంగా అర్థమవుతున్నది.