సిటీబ్యూరో: సికింద్రాబాద్ జోన్‌లోని ఓ కీలక పోలీస్‌స్టేషన్ అది. అక్కడ ఆయన చెప్పిందే వేదం.. చేసిందే కేసు.. ఈ స్టేషన్లో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సోషల్‌మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో ఆ ఎస్సై వ్యవహార శైలిపై చర్చ జరుగుతోంది. ఈ పోలీసు అధికారి ఈ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి స్టేషన్లో మహిళా సిబ్బందిని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారిని అందరిముందే చాలా దారుణంగా మాట్లాడుతూ వారు తెచ్చిన ఫైళ్లను కిందపారేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ విషయం ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఏదో సర్దుకోవాలంటూ చెప్పడంతో ఏం చేయాలో తెలియక తమ బాధలను ఉన్నతాధికారులకు చెప్పుకొనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
ఏ చిన్న కేసు నమోదైనా ఆ ఎస్ఐ రంగంలోకి దిగి బాధితులు, నిందితులు ఇరు వర్గాలతో డీల్ చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వచ్చిన సామాన్యులను గంటల తరబడి నిలబెట్టడం.. తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. తనకు అనుకూలమైన సిబ్బందినే పెట్రోల్ కార్లలో డ్యూటీకి వేస్తూ వారి ద్వారా కలెక్షన్ల దందా నడుపుతున్నారని స్టేషన్లో చెప్పుకొంటున్నారు. పాన్‌షాపులు, టిఫిన్ సెంటర్లు, పండ్ల దుకాణాలు,పెట్రోల్ బంకులలో నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నట్లు చిరు వ్యాపారులు చెప్పారు. ఉన్నతాధికారి అండదండలతోనే ఈ అధికారి అరాచకాలకు పాల్పడుతున్నట్లు సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.