సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో మరోసారి గ్రీన్ చానల్ ఏర్పాటు చేసింది. గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి అవయవాలను తరలించేందుకు వైద్య బృందం, ఎల్అండ్టీ మెట్రో అధికారులు సమన్వయంతో 25 నిమిషాల్లో 14 కిలోమీటర్ల ప్రయాణం చేసేందుకు ప్రత్యేక ‘గ్రీన్ చానల్’ ఏర్పాటు చేశారు.
ఉదయం 11:40 గంటలకు మెట్రో రైలు రాయదుర్గం స్టేషన్ నుంచి బయలుదేరగా.. మధ్యాహ్నం 12:05 గంటలకు రసూల్‌పురా స్టేషన్‌కు చేరింది. 14 కిలోమీటర్లను కేవలం 25 నిమిషాల్లో చేర్చింది. రసూల్‌పురా స్టేషన్ వద్ద ముందస్తుగానే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్ ద్వారా అవయవాలను మినిస్టర్ రోడ్డులోని కిమ్స్ ఆసుపత్రికి అత్యంత వేగంగా చేర్చారు. సమయానికి అవయవాలు అందడంతో వైద్యులు అవయవ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేయగలిగారు.