ఉగాది కవి సమ్మేళనం
వసంతసూర్యోదయ కళావైభవము!
మోడువారిన ప్రకృతిలో ముద్దుగొలిపి
నవ్యవాసంతశోభలు నడచిరాగ
సూర్యభగవానుడేతెంచి సొగసులద్దె
పువ్వు పువ్వున రాగాలు పూయజేసి!
కొత్తచిగుళ్లకై కొసరు కోకిల కూతల మంగళధ్వనుల్
మెత్తని పూలసెజ్జకయి మెల్లన వచ్చెడి చంచరీకముల్
మత్తును గొల్పు వాసనల మల్లెలు మొల్లల చిద్విలాసముల్
మొత్తముగా త్వదీయకరమూలములై విరబూసె భాస్కరా!
ఆమనికీదృశాద్భుతసుహాసవిలాసము నీ ప్రసాదమే
కోమలకాంతిధామ! శతకోటిమయూఖవిలోలహేమ! సం
ధ్యాకమనీయకాంతిపరిధానసమంచితదివ్యభూమ! సం
క్షేమకళాప్రకామ! శ్రుతికీర్తితచిన్మయసీమ! భామయా!
చుక్కలను తెచ్చి పుడమికి సొగసునిచ్చి
దిక్కులను రాగమాలతో చక్కజేసి
ప్రకృతిలో రసగీతాలు రంగరించి
సాగెదవు నింగిదారిలో సకలకళల
నీ విహారము మాకిడు నిత్యశుభము
నిన్ను స్మరియించుటే మాకు నిరతవరము!
-డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ, 94404 68557
రావమ్మ! ఏడాది రంగులీన
సీ.శుభకృత్తు నామమ్ము శుభముల గూర్చగా
రావమ్మ! ఏడాది రంగులీన
ఉజ్జల సంరంభ ముగాదియై నిలువ
రావమ్మ! వత్సరా రంభ వేళ
యాదర్షి ప్రార్థిత యాదాద్రి దేవుండు
కొత్తగా కొలువుండ కూడి రమ్మ!
తన ప్రజా క్షేమమే తర్పరూడైయొప్ప
చంద్ర శేఖరు డేల చెలగి రమ్మ!
తే.గీ. నిత్య నూతన కాంతులు నింగి కెగయ
నిత్య వర్ధిత శుభముల నిలయ మనగ
నిత్య తెలగాణ ప్రజలెల్ల నిలిచి కొలువ
శుభము వర్షాది శుభకృత్త! శోభలిమ్మ!
సీ.తెరివాహ గోదారి తేటయై పాటయై
కాళేశ్వరవిభుని కాళ్లు గడిగి
ప్రాజెక్టుగా నిలిచి పైగల ప్రాంతాల
కరువు సీమల నేల కనికరించి
ఎగువకే పారేటి ఏరుగా నిల్చియు
శశి శిఖరు ప్రతిభగా చెలువునంది
పంట పంట పొలముల పచ్చటి శోభతో
దాహార్తి తీర్చగా ధరణి సాగి
తే.గీ. చెరువులన్నియు సంద్రమై చెలువులంద
తనదు దేహంపు పొలముల తడిపి తడిపి
వరలు తెలగాణ మాగాణ వరుల కోన
క్ష్మా తెలగాణ వివిధ ధాన్యాల గాణ
సీ. శ్రీ చంద్ర శేఖరు శిరమున నుండక
శ్రీ చంద్రశేఖరు సీమ జేర
ధాన్యంపు రాశుల ధనరాశుల చెల్వు
తెలగాణ ప్రజలకై తివిరి నిలువ
భారతదేశంపు బహు ప్రాంత జనులకు
బువ్వగిన్నెగ నిలువ భూరి కీర్తి
మండుటెండల లోన మత్తళ్లు బొర్లగ
మహిళ సాగర లీల మహిని నిలువ
ముందుచూపులు గల్గిన ముఖ్యమంత్రి
ప్రజల కన్నీళ్ల కడగళ్ల పారదోల
తెలుగు ప్రజలకు తెలగాణ దీటురాగ
వరలు తెలగాణ మాగాణ భాగ్యసీమ
కదిలి రావమ్మ శుభకృత్త! కలుములిమ్మ
-సంగనభట్ల నరసయ్య
94400 73124
ఆత్మ ఘోష
బిడ్డా!
నాలుగు దినాలైతే
ఇక నా కోసం దునుకులాడుతావే
దుర్భిణీ వేసి మరీ
గూగుల్లో సైతం…
ఏడాదైనా నా సుస్తి పట్టక
నన్ను నా మానాన సస్తవో బతుకుతవో
నీ ఇష్టమంటూ వదిలేస్తివే
గింత మందో మాకో నా మీద పడేస్తే తిప్పుకునేదాన్నిగా బిడ్డా!
నీకు సిన్నప్పుడు అమ్మోరు పోస్తే
ఎంత తండ్లాడినా మాన్పటానికి
నా శాయశక్తులా…
ఇన్నాళ్ళు నేను ఎన్నో పంటలకు
ఎరువై మందై కాపాడిన మేలైనా
నన్ను బతికిస్తదేమో!
నా నీడన ఎందరో సేద తీరారే
నా పచ్చని గాలి కోసం పరితపించారే
కష్ట సుఖాలు కలిమి లేములు
తీపి చేదులంటూ ఒలకబోసే
మాటల కోసం
నా కోసం వెతుకుతావిక
నా చిటారు కొమ్మన వుండే
పూత కోసం
చెమటలు కక్కుతూ ఎక్కుతావే!
నా రోగం ‘డై బ్యాక్’కి మందు కోసం
ఓ చిరు ప్రయత్నం చేయరాదూ..
ఉగాది నాడు!
నేను తరాలుగా నీ ఇలాకాలోని
ఓ వేప చెట్టుని..!!
-గిరిప్రసాద్ చెలమల్లు, 9493388201
కోయిల కూత కొత్తగా..
ఈ వసంతం చాలా కొత్తగా ఉంది
వేప పూసింది మామిడి కాసింది
కోయిల కూసింది ఆమని విరిసింది అనికాక
ఏటా వచ్చేదే ఆమని అయినా
ఈ ఆమని కొత్తగా ఉంది
క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం నుండి
కరోనా పూర్వం, కరోనా తర్వాత
అని రూపాంతరం చెందాక..!
సప్తవర్ణాల ప్రకృతి నుండి పండు పర్ణాలు రాలినట్లు
అందమైన వర్ణాల జీవితం నుండి
కరోనా కాటుకు రాలిన ఆత్మీయులు
అరవిరిసి ఆమనికి అద్దంలా ఉండే మొహాన్ని
అడ్డుగుడ్డతో ఆత్మరక్షణ కోసం చాటేస్తూ
ఆక్సిజన్ అందక ఆపసోపాలు పడుతూ…
ఇంతకాలం అనుభవించిన స్వర్ణ యుగాన్ని
గుర్తించలేకపోయిన అజ్ఞానానికి ఆక్రోశిస్తూ
ప్లవనామ వత్సరం వదిలిన చేదు జ్ఞాపకాలు త్యజిస్తూ..
అత్యాధునికంగా అపారవిజ్ఞానాన్ని సంపాదించినా
ఆటవిక కాలాన్ని గుర్తుచేస్తూ యుద్ధం పేరుతో
నరమేధంతో మారణహోమం
చేస్తూన్న వ్యధవేదిస్తూ ఉంటె…
కుహు కుహు అంటూ కూయాల్సిన కోయిల
పారాహుషార్ అంటూ
‘కొవాగ్జిన్’ ‘కొవిషీల్డ్’ అని కూస్తుంది!
ప్రకృతి వేపపూల కోక కట్టుకుంటూ
సమరం సమసిపోయి సమరసభావనతో
సకల విశ్వం సస్యశ్యామలమై సుభిక్షమై
శాంతి పూలు వికసించాలని కోరుకుంటోంది…
మహిలో మానవతా పరిమళ కుసుమాలు వెల్లివిరిసేలా
సుజనులు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండేలా
చూడాలని ఎంతో ఆశతో వేడుకుంటూ
శుభాలు తెచ్చే శుభకృత్ నామ సంవత్సరమా
నీకిదే స్వాగతం… సుస్వాగతం!!
-నామని సుజనాదేవి
7799305575
ఓడి.. నిలిచిన గెలుపు
ఉగాదీ.. ఓ ఉగాదీ…
కలత నిద్రల్లోంచి తెగిపడి
ఉలిక్కిపడ్డ ఉరుముల నుంచి కుదుటపడ్డ
తెలంగాణను చూడవే!
ఉగాదీ.. ఓ ఉగాదీ…
‘మా ఊరికి రావొద్దు’ అన్న కవితను
తిరగరాసుకుంటున్న కవిత్వ పొద్దు నేనే కదా!
ఉగాదీ.. ఓ ఉగాదీ…
సెలకల్లో రాలిపడ్డ ఆత్మబలిదానాల సాక్షిగా
చరిత్రను పచ్చగా తిరగరాసుకుంటూ పోతున్నా…
వొట్టిబోయిన ఖాళీ అయిన ఊరు సాక్షిగా
చిగురిస్తున్న చింత చిగురై విరగకాస్తున్నా…
నెర్రలు బాసిన నేలల్లో
జలవూటలు పుట్టించిన కవితనై
కాళేశ్వరం సాక్షిగా జలపాత నృత్యం చేస్తున్నా..!
ఉగాదీ.. ఓ ఉగాదీ…
నన్ను నేనుగా అవతరించుకున్నాక
పునర్నిర్మాణంతో నిర్మితమవుతున్నా..!
గుక్కపట్టిన దుఃఖగోళాలు పగులకొట్టుకుని
కన్నీళ్లను కడిగేసే నీళ్ల దోసిలి కవితనై వస్తున్నా..
ఇపుడు యాడ జూసినా
జలసంపదలు, పశుసంపదలు, పాలసంపదలు
విరగకాసిన యాప పూతలాగా
మామిడి పిందెల్లాగా ఉంది తెలంగాణ
ఇరగకాసిన పంటలాగుంది!
భక్తి పరవశ మహా పుణ్యక్షేత్రం
స్తంభాద్రి భద్రాద్రి యాదగిరాద్రి
మహాగిరుల సంపద తెలంగాణాద్రి
నీళ్లను నడిపించే నాయకుడే
కన్నీళ్లను మరిపిస్తాడు
నదినే ఎత్తిపోసిన ఆ రెండు చేతులే
ఋతువుల్ని గాడిలో పెడ్తున్న మహా జలపాతాలు
ఉగాదీ.. ఓ ఉగాదీ… కలో గంజో కాదు
దేశానికే అన్నం పెడ్తుంది చూడవే
పాడిపంటల పాట తెలంగాణ
పరవశాల నేల తెలంగాణ
వెలుగులు విరజిమ్ముతున్న
వెలుగుల తోట
నా తెలంగాణ
ఇక నిత్య ఉగాది…
నిత్య శుభకృత్!
–జూలూరు గౌరీశంకర్
సిరులై… స్థిర యశమై
ఘన జయమై… కడుముదమై…
ఆశయమై… సత్ఫలమై…
శుభ కరమై… సుఖ వరమై…
అరుదెంచిన నూతనమా
ఓ శుభకృత్ వత్సరమా..
స్వాగతకుసుమాంజలి
సారస హృదయాంజలి
మావి తోరణాలు మంగళ హారతుల్
పట్టి నిలిచెనేడు భక్తి తోడ
పసుపు గడప శుభము
పలుకంగ వేచెను సకల
శుభములిడగ స్వాగతమ్ము
పంచునారు రుచులు
పచ్చడి ముదమున
జీవితాన గలుగు చేవ తెలుప
పంచభక్ష ములిట భక్తితో వేచెను
రమ్ము కొత్త యేడికిమ్ము శుభము
ఓ శుభకృతు వత్సరమా శుభమని
సంబరాలెన్నియో మనసంబరాన
తేలియాడగ చేసెనీ వేళలోన
రమ్ము నవ వత్సరమ్ము
మాకిమ్ము శుభము
కోటి ఆశలు చిగురించి మేటి జీవ
నంబు మాకిడి సత్కీర్తి సంబురాలు
జరుగునట్లుగా చూడుము కరుణ తోడ
రమ్ము నవ వత్సరమ్ము
మాకిమ్ము శుభము
-అమరవాది రాజశేఖర శర్మ
కాలమేఘం!
శుభకృతీ!
నీవు సూర్యచంద్రోదయంలానే ఉంటావు
ఏడాదంతా నీవే మా ఆదర్శం
అను నిత్యం అడుగుల స్వర సవ్వడులనే వింటాం
నీ కారుణ్యపు కదలికల లయ విన్యాసాలే మా జీవనం
నీ పాదాలకు ప్రణమిల్లే అడుగుతున్న
మా దైనందిన భీభత్సాన్ని పారదోలాలనే నా యీప్రార్థన
కరోనా కాలంలో కబళింపబడినవాళ్ళం
కడసారైనా మా వాళ్ళ ముఖాల్ని చూసుకోలేని వ్యథపీడితులం
కాలచక్ర గ్రహణం పట్టినవాళ్ళం
జీవన పరిమళం కోల్పోయిన దయనీయులం
ఈ దుఃఖ గడియల్లో
మా ఇంటికొస్తున్న తొలివత్సర శుభాకృతి నీవే!
ఓ పక్క ప్రకృతి విధ్వంసం
మరోపక్క అగ్రాధిపతుల దురాక్రమణలు
ఇంటిముందు పొంచివున్న భయకాలమిది!
నేనేమో చూస్తూ చూస్తుండగానే డబ్భు ఉగాదులను దాటేసాను
కన్నార్పకుండా ఇలా నిన్ను చూసే భాగ్యం కలిగినందుకు ధన్యున్ని
ఆంగ్లేయుల పుణ్యమా అని మద్యం మత్తులో కొట్టుకుపోయాం
నీషడ్రసోపేత పాల పొదుగులే
మా మాతృస్తన్య సంస్కృతని ఇప్పుడిప్పుడే తెలిసివస్తోంది
ఈ పర్వదినాన మా పిల్లా పాపలతో
చారడేసి మొగ్గ అట్లు పోయంగా అంటూ కాస్సేపు ఆడుకోరాదు
తొలకరిలా వచ్చి మా మనో భూమిని తడపరాదు
జలకన్యవై పంటపొలాల పారాణివై రైతింటి దీపమై వెలగరాదు
కలోగంజో తాగి బతుకుతాంగానీ
ఈ వైషమ్య దుఃఖగాథల్ని మట్టుపెట్టరాదు
పదిమందితో కలిసుండే రాశీఫలాల పంచాగపర్వమైపోరాదు
కాలగడియారపు ముళ్ళ చీపురుతో
మా జీవన రహస్య రహదారిలో
పరుచుకున్న దారిద్య్ర కంపను ఊడ్చిపారేయగల
అనునిత్య వ్యూహ విద్యను ప్రతియింటా నేర్పరాదు
కాలనదిని దాటాలంటే మా జీవనదివి నీవే యిక!
-డాక్టర్ నాళేశ్వరం శంకరం
94404 51960
యుగోత్సవము
మ॥ శుభకృత్పర్వ దినోత్సవా భ్యుదయసుశ్లోకప్రభాదివ్య భూ
నభముల్ శంఖములూదె నేడు తెలగాణమ్మొక్కటే స్వర్గస
న్ని భరాష్ట్రంబని;భారతావనిదిశానిర్ణేతగా, ధాతగా,
విభవశ్రీనవజాతగా, ఘన జగద్విఖ్యాతగా మారగా
చం॥ పడి;వడి లేచినట్టి రుష వార్ధితరంగమువోలె చేటుపా
ట్లిడుముడులెక్కసెక్కముల నీవల యావల చిమ్మి సుంతయున్
దడియక లక్ష్యతీరమును దాటెను నాతెలగాణజాతి;ఈ
పుడమి తలెత్తి నిల్చె బహు పుణ్య తపఃఫలకల్పవృక్షమై
చం॥ ప్రతిదినమొక్కపండుగయి వర్ధిలగా తెలగాణతల్లి సం
తతి;ధన ధాన్యసంపదల నామయులై,పరిపూర్ణ పౌరులై
అతులితశాంతిసౌఖ్యములనందగ;వందిత ముఖ్యమంత్రి సం
తతపరిపాలనమ్ముజనతాభ్యుదయప్రద కీర్తినొందగా
-డాక్టర్ అయాచితం శ్రీధర్
98498 93238
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

