ఒక స్వప్నం సాకారమై దశాబ్ది గడపను ముద్దాడుతున్నది ఆకలి కన్నీళ్లను తుడిచిన సంతోషపు క్షణాలను తలచుకున్నప్పుడల్లా ఎగిసిపడిన పోరాట కాలపు సంకల్పాల పిడికిల్ల సవ్వడులు కళ్ళ ముందు కదలాడుతున్నాయి..! కోట్లాది మంది స్వేచ్ఛాకాంక్షల ఉద్యమాల జల్లులకు హారతి పట్టింది తెలంగాణ ... నా తెలంగాణ ఏ నేల మీదైనా సరే రాత్రులు ముసురుకుంటూనే ఉంటాయి ఉషోదయాలు పలకరిస్తూనే ఉంటాయి..! నిన్నటి రక్త తర్పణాలు నేటి అభివృద్ధికి బాటలు సామాన్యుని కలలు నెరవేరితేనే కదా అసలు సిసలు పురోగమనము ఆశల పంటలు విలసిల్లాడానికి ఆటంకాలను అధిగమించాలి..! ఆత్మ బలిదానాలతో కడుపు కోతలకు గురైన తల్లుల దుఃఖాలింకా పచ్చిపచ్చిగానే ఉండొచ్చు కొలువుల కోసం చూస్తున్న యువకుల ఎదల్లో రగులుతున్న తండ్లాటలే ఉండొచ్చు బీటలు వారిన పంట భూములు జలసిరుల ప్రవాహంతో పచ్చ రంగును పులుముకుంటున్నాయి..! ఇది మనది అనుకోవడంలో ఉండే ఆనందమే వేరే కదా ఆంక్షల సంకెళ్లను దాటి గమ్యాన్ని చేరుకున్న వాళ్ళం చివరంచుదాక వసంతపు చిగురు విస్తరించాలనే కోరుదాం ఓర్పు నేర్పుల పోరుతత్వం వెనుతిరుగని పాదాల ధీరత్వం సబ్బండ వర్ణాల ఐక్యతా గానం గెలుపు పిలుపు నా తెలంగాణ జయహో... దశాబ్ది తెలంగాణ..! [caption id="attachment_1111027" align="alignnone" width="124"] Gopagani Ravinder[/caption] - గోపగాని రవీందర్ 9440979882