జంగమ దేవర శంఖపు రవళులు
శంభోశంకర నాదంతో ఊరంతా
అంబపలుకు జగదంబ పలుకు
వాక్కులతో బుడబుక్కల ఢమఢమలు
భోగి వేకువ జాముకు వేకువ కాగా!
చెరువు నీళ్లకు నాన్న కావిడితో
మా వూరి చెరువేమో తెలిమంచు కప్పుకొని
సూరీడికేదో కబురివ్వాలని రాయబారి
తుషారపు దొంతర్లతో మంతనాలు
ఎంతకీ కొలిక్కి రావు ప్రభాతమంతా!
తోటి పిల్లలతో దార్లన్నీ తిరిగి ప్రోగేసుకున్న
వరి కర్రలో తుమ్మ పత్తి వేప పుల్లలో
అమ్మ వంటకు దాచిన వంట చెరుకో
అన్నిటితో భోగిమంటకు పిల్లలం తయ్యారు!
అత్తయ్య, మామయ్య, తాతయ్య, నానమ్మలు
చలికి వణుకుతూ ఒళ్లంతా రగ్గులతో
నాన్న తోబుట్టువులు నీళ్ల బిందెలతో హాజరు
అమ్మ తోడు కోడళ్లతో వంటలింకా తెమలక!
రంగవల్లులు అల్లాలన్న తొందరలో అక్కావదినలు
గొబ్బెమ్మలు బంతిపూల ఏర్పాట్లలో చెల్లీ మరదలు
పిన్నీ బాబాయి అగ్నిదేవుని ప్రార్థన జేసి నెయ్యివేసి
భోగిమంట రాజేస్తే బంధుగణమంతా చుట్టూ!
మేమంతా భోగి మంట చలి కాచుకుంటుంటే
క్రొత్త ధాన్యపు బస్తాల బండ్లతో ఇళ్లకు కొందరు
దారంతా ముత్యాల ముగ్గులు పెడుతూ ఇల్లాళ్లు
అయ్యవారికి దండంబెట్టంటు గంగిరెద్దులోళ్ళూ!
భోగిమంటన హవిస్సులు ఎంత సమర్పించాలో
ఎప్పుడు మంటనిప్పులు కదపాలో అణచాలో
చుట్టూ జేరి జాగ్రత్తలు జెప్పు పెద్దల జూస్తే
జీవన గమనంలో సుఖదుఃఖాల్లో ఎల్లప్పుడూ
మీ వెంట మేమని అగ్నిసాక్షిగా భరోసానిచ్చు
నా వారిగా తృప్తిగా
రేపటి సంక్రాంతికై ఎదురుజూస్తూ!
-రవికిషొర్ పెంట్రాల
లాంగ్లీ, లండన్!