వేల ఏండ్ల నుంచే తెలుగు భాష ఉన్నదనడానికి నిలువెత్తు సాక్ష్యం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలోని బొమ్మలమ్మగుట్టపై ఉన్న కురిక్యాల శాసనం. 2008, అక్టోబర్ 31న నాటి కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడానికి ఈ ‘కురిక్యాల శాసనం’ చాలా దోహదపడింది. ఈ శాసనాన్ని జినవల్లభుడు క్రీ.శ.945లోనే వేయించినట్టు చరిత్ర చెప్తున్నది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ రాష్ట్రంలో పాలనాపరంగా మాతృభాష సంపూర్ణంగా అమలుకాకపోవడం భాషాభిమానులను ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నది. పాఠశాలలు, కళాశాలల్లో మాత్రమే తెలుగును పాఠ్యాంశంగా చూడటం కడు శోచనీయం.
ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగు భాష పూర్తిగా కనుమరుగైపోయింది. 90 శాతం ప్రైవేటు కళాశాలలు సంస్కృతాన్నే ప్రోత్సహిస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే మాతృభాష మాట్లాడుకోవడానికి మాత్రమే మిగిలిపోతుంది. పుస్తకాల్లో, మస్తకాల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాష సంపూర్ణంగా అమలుకానందుకు బాధపడాలో, సామాజిక మాధ్యమాల్లో తెలుగు భాషను ఎక్కువగా వాడుతున్నందుకు సం తోషపడాలో అర్థం కావడం లేదు.
ఇదిలా ఉంటే సినిమా పేర్లను కూడా తెలుగులో పెట్టకుండా దేశంలోని ఇతర భాషల్లో వాడుతుండటం నిజంగా తెలుగు భాషను కించపరుస్తున్నట్టే లెక్క. ప్రభుత్వ యంత్రాంగం చూసీ చూడనట్టు ఇలాగే వ్యవహరిస్తే… మాతృభాష అయిన తెలుగు భాష కొన్ని రోజుల్లో మృతభాషగా అవుతుందేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి.
– కల్వల రాజశేఖర్ రెడ్డి 9704243959