సిద్ధాంతం ‘వినిర్మాణం’వినిర్మాణం (deconstruction) చాలా క్లిష్టమైన సబ్జెక్టు. అది రూపకం, విరోధాభాస, అలెగరి, అన్యాపదేశం మొదలైనవాటి లాగా సాహిత్య సాధనం (Literary device) కాదు. వినిర్మాణంలో వాచకం (Text)లోని వాక్య నిర్మాణాన్ని ధ్వంసం చేయడం ఉండదు. నిజానికి, రచన చేయడం అనే పనితో వినిర్మాణానికి సంబంధం లేదు. ఇదివరకే రాసిన రచనల వాచకాలను విశ్లేషించడం కోసం, వివరించడం కోసం ప్రతిపాదించబడిన సిద్ధాంతం లేదా పద్ధతి వినిర్మాణం. కాబట్టి, ఒక కవి లేదా రచయిత మంచి వినిర్మాణం టెక్నిక్‌తో రాశాడనే వ్యాఖ్య అసంబద్ధమైనది. వినిర్మాణాన్ని సరిగ్గా, సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్నవారు తక్కువగానే ఉంటారు.
జాక్వెస్ డెరిడా (1930-2004) అనే ఫ్రెంచ్ మేధావి, విమర్శకుడు ప్రతిపాదించిన సూత్రాలను, వివరణలను ఆధారం చేసుకొని ఏర్పడిన విమర్శ సిద్ధాంతమే వినిర్మాణం. డెరిడాకన్న ముందు ఫ్రెడెరిక్ నీషే(friedrich nietzsche), మార్టిన్ హెయ్డెగ్గ ర్ (martin heidegger)లు దీనిగురించిన చిన్న చిన్న ప్రతిపాదనలు చేశారు. డెరిడా తన మూడు గ్రంథాలలో వినిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక అభిప్రాయాలను వెల్లడించాడు. ఆ గ్రంథాలు Of Grammatology, Writing and Difference, Speech and Phenomena.
వినిర్మాణంలో మంచి, చెడు; మగ, ఆడ; జ్ఞానం, అజ్ఞానం; సత్యం, అసత్యం లాంటి పరస్పరం విరుద్ధంగా కనిపించే జంట (binary oppositions) విశేష్యాలను పరిశీలించడం ఉంటుంది. వాటి మధ్య మనం చూసే భేదాలను ఆధారం చేసుకొని, అర్థాలను అలా నిర్ణయించుకుంటాం అంటాడు డెరిడా.
సోపానక్రమం (hierarchy)లో వారి స్థానం, విశేషాధికారం (privilege) ప్రకారం ఆ హెచ్చుతగ్గుల అర్థాలను నిర్ణయిస్తామే తప్ప, ఆ అర్థాలు స్థిరమైనవి కావనీ, పైగా తక్కువ విలువ ఉన్నదని మనం భావించే పదం నిజానికి ఎక్కువ విలువ ఉన్నది కావచ్చుననీ సూత్రీకరిస్తాడు. ఉదాహరణకు, జ్ఞానం అజ్ఞానం కన్న గొప్పదనే వాక్యంలో జ్ఞానం అంటే అజ్ఞానం కానిది కదా? అజ్ఞానం అన్నది లేకపోతే జ్ఞానానికి అస్తిత్వం లేదు. అంటే అది స్వతంత్రంగా మనలేదు. పైగా అజ్ఞానం కుతూహలానికి, నేర్చుకోవడానికి దారితీసి, జ్ఞానాన్ని ఉత్పన్నం చేయవచ్చు. ఇప్పుడు జ్ఞానంగా చలామణి అవుతున్నది. తర్వాతి కాలంలో అజ్ఞానంగా నిరూపింపబడవచ్చు. అదేవిధంగా సత్యం కొన్ని అపోహల మీద, ఉపమానాల మీద దృష్టాంతాల మీద, నీతిబోధల మీద ఆధారపడి ఉండవచ్చు. కొత్త రుజువులు ఏర్పడినప్పుడు అసత్యమే సత్యంగా పరిణామం చెందవచ్చు. అప్పుడు అజ్ఞానం జ్ఞానం కన్న, అసత్యం సత్యం కన్న ఎక్కువ విలువను సంతరించుకోవచ్చు.
వినిర్మాణం మీద చర్చలో భాగంగా డెరిడా differance అనే కొత్త పదాన్ని సృష్టించాడు. నిజానికి ఈ పదం ఫ్రెంచి భాషలో గాని, ఇంగ్లీషులో గాని లేదు. difference మాత్రమే ఉంది. కానీ, difference కూ differance మధ్య ఉన్న భేదాన్ని పలకడం ద్వారా చూపించలేం. రాసి లిపి రూపంలో మాత్రమే చూపించగలం. డెఫర్ (defer) అంటే వాయిదా వేయడం. గౌరవించడం అన్నది మరొక అర్థం Deference అంటే వాయిదా వేసే ప్రక్రియ. ఇక్కడ అంతిమ అర్థం ఎప్పుడూ వాయిదా వేయబడుతూనే ఉంటుందని అంతరార్థం.
‘దిగ్మండలం’ను మనం చూస్తాం కదా. అది ఎందుకు కనపడుతుంది? అక్కడ నేల ఉన్నందుకే. నేల లేకపోతే అది కనిపించదు. నిజాన్ని దర్శించాలంటే దగ్గరికి వెళ్లి చూడాలి. కానీ, మనం ఎంత నడిచినా దాన్ని చేరుకోలేం. అంటే దాన్ని defer చేయాలన్న మాట (వాయిదా వేయాలి)! అదేవిధంగా పరస్పరం విరుద్ధంగా కనిపించే పదాల నిజమైన, అంతిమ అర్థం తెలుసుకోవాలంటే నిరంతరం వాయిదా వేస్తూనే పోవాలి! ఇటువంటి పదాలకు ఇప్పుడున్న అర్థాలను స్థిరీకరించే, అంతిమంగా నిర్ధారించే ప్రయత్నాలు విఫలం కాక తప్పదు అంటాడు డెరిడా. ప్రతి పదంలో దానికి విరుద్ధమైన మాట అర్థపు అవశేషం మిగిలి ఉంటుందన్నది అతని వాదన.
స్విస్ జాతీయుడైన సస్యూర్ (Ferdinand de Saussure)ను గొప్ప భాషావేత్తగా, భాషాశాస్త్ర పరిశోధకునిగా భావిస్తారు. ఈయన కూడా భాషలో భేదాలు మాత్రమే ఉంటాయనీ, సానుకూల శబ్దాలు (positive terms) అంటూ ఉండవనీ సిద్ధాంతీకరించాడు. ఈ విధంగా, వినిర్మాణాన్ని వాచకాల వివరణల వివేచన పద్ధతిగా అభివర్ణించవచ్చు.
-ఎలనాగ