కుత్బుల్లాపూర్, నవంబర్ 30: మూడేండ్ల చిన్నారిని ఆయా కింద పడేసి.. కాళ్లతో తొక్కి.. విచక్షణారహితంగా దాడి చేసిన ఘ టన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధి షాపూర్‌నగర్‌లోని పూర్ణిమ విద్యానికేతన్ హైస్కూల్లో జరిగిన ఈ దారుణ ఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. ఒడిశా రాష్ర్టానికి చెందిన సంతోషి షాపూర్‌నగర్‌లోని పూర్ణిమ విద్యానికేతన్ హైస్కూల్లో ఆయా గా పని చేస్తుంది. తన భర్త, మూడేండ్ల చిన్నారితో కలిసి అదే స్కూల్లోని ఓ రూంలో ఉంటున్నది. రోజువారి మాదిరిగా విద్యార్థులను వారి ఇండ్లలో చేర్చేందుకు సంతోషి స్కూల్ బస్సులో వెళ్లింది. మరో ఆయా లక్ష్మి (50) సంతోషి కూతురును శనివారం సా యంత్రం ప్లేగ్రౌండ్‌లోకి తీసుకొచ్చింది.
ఆ చిన్నారి దుస్తులు మారుస్తున్న క్రమంలో ఆయా లక్ష్మి కర్కశంగా మారి చిన్నారిని నెట్టివేయడం.. పిడిగుద్దులతో పదే పదే కిందపడేయడం.. కిందపడ్డాక అమాంతం కాళ్లతో తొక్కి తన రాక్షసత్వాన్ని నిరూపించుకున్నది. స్థానికులు బిల్డింగ్‌పై నుంచి దాడిని సెల్లో రికార్డు చేశారు. చిన్నారికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు విచారించగా.. ఆయా కొట్టింది అని చెప్పుకొచ్చింది. తల్లిదండ్రులు ఆదివారం ఉదయం విషయాన్ని స్కూల్ కరస్పాండెంట్ జానకీరామ్ దృష్టికి తీసుకెళ్లగా.. ఇంత చిన్న విషయాన్ని అంత రాద్ధాంతం చేయడం అవసరమా..? అంటూ బాధితుల ను బెదిరింపులకు గురి చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చుట్టుపక్కల వారు వీడియోను బాధిత కుటుంబానికి చూపించడంతో విషయం బయటపడింది. బాధితులు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మొదటగా పట్టించుకోలేదు. వీడియో సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో ఆయా లక్ష్మిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.