హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): జీవన ప్రమాణాలు మారుతున్న కొద్దీ మనం తీసుకునే ఆహారంలోనూ కొత్తకొత్త రకాలు వస్తున్నా యి. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న జీవనశైలికి తగ్గట్టు ఆహారం తీసుకుంటున్నారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లోని ఎక్కువగా బయటి ఆహారంపైనే ఆధారపడుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో వండుకునే తీరిక లేకపోవడం దీనికి ప్రధాన కారణం. దీంతో హోటళ్లు, ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆధారపడాల్సిన దుస్థితి. ఈ సంస్థలు.. ఆహారం రుచి, ఆకర్షణీయంగా ఉండటానికి రంగులతోకూడిన ప్యాకింగ్‌లు, అల్యూమిని యం కవర్లు వాడుతున్నాయి. ఈ అల్యూమినియం చూడటానికి అందంగా ఉన్నప్పటికీ మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆహారం నిల్వ ఉంచితే ప్రమాదమే
అల్యూమినియం ఫాయిల్స్‌తో ప్యాక్ చేసిన ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉంచడంతో ఫాయిల్స్ కణాలు ఆహారంలోని సాల్ట్‌తో చర్యజరిపి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. పదార్థాలు వేడిగా ఉండటంతో అల్యూమినియం కణాలు కరిగి అందులో కలిసిపోతాయి. ఈ లోహాన్ని జీర్ణంచేసే శక్తి మానవ జీర్ణ వ్యవస్థకు తక్కువగా ఉండటంతో శరీభాగాల్లోకి చొచ్చుకుపోతుంది. మూత్రపిండాలు కూడా అల్యూమినియాన్ని ఫిల్టర్ చేయలేవు. తద్వారా ప్రమాదకర వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది.
అల్జీమర్స్, పార్కిన్సన్కు అవకాశం..
అల్యూమినియం లోహ కణాలు శరీరంలోకి ప్రవేశించడంతో అనేక ప్రాణాంతక సమస్యలు సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ కణాలు ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి థైరాయిడ్, నాడీమండల సంబంధ వ్యాధులను కలిగిస్తాయి. అల్యూమినియం న్యూరోటాక్సిక్గా పనిచేస్తుంది. దీంతో అల్జీమర్స్, అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లరోసిస్, పార్కిన్సన్ వంటి నాడీక్షీణత రుగ్మతలు సోకుతాయని అధ్యయనాలు చెప్తున్నాయి. శరీరంలో ప్రొటీన్లు తగ్గుతాయని, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుందని పేర్కొన్నాయి. పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి, పురుష పునరుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయని నిపుణులు తేల్చారు.