అతడు చీకటి కొమ్మకు పూసిన ఒక ఆకలి పువ్వు
రాత్రిని ఆబగా హత్తుకొని
నల్లకోటుతో గబ్బిలమై తిరుగుతాడు.
తెలతెలావారుతుండగా
తన కంటి కాగడాలను వెలిగించి
నిదుర చీకటిని తరిమి కొడుతాడు.
కింద ముతక పంచ
పైన పాత చీరతో తలపాగా
ఓ చేత్తో ఢమరుకం, మరో చేత్తో జోలె సంచి,
అంబ పలుకు, జగదాంబ పలుకని
ప్రతీ వాకిట్లో ఆకలి పిట్టలా వాలిపోతాడు.
ఓ నాలుగు చివికిన పేలుకలో,
గుప్పెడు బియ్యం మెతుకులో
తన సంచిలో వేస్తే చాలు,
కళ్లల్లో ఆనంద దీపాలు వెలిగించుకొని
‘మీకు మంచి రోజులొస్తున్నాయి తల్లో,
మీకు మంచి రోజులొస్తున్నాయి’ అని వెళ్లిపోతాడు.
పాపం, తనకేం తెలుసు!
అతడు ఊదే ఆకలి శంఖం,
కందిపోయిన తన దిగులు ముఖాన్ని చూసి
అంతా తనని ఊరకుక్కలదుపు
చేసే మంత్రగాడంటారు,
చావు శంఖం మోసే బిచ్చగాడంటారు.
నిజం చెప్పాలంటే, బహుశా
ఎవరూ గమనించి ఉండరేమో..
అతను తన ఆకలి కుబుసాన్ని విడిచేందుకు
రోజూ ఎన్ని వీధులు పాకుతున్నాడని,
ఎన్ని ఊర్లు సంచారంలో దాటుతున్నాడని,
అయితే ఒక్క మాట..
నిజంగా అతనికి ఆ
మంత్రాలేవో తెలిసి ఉంటే,
ప్రతి ఇంటి ముందు వచ్చి
దిగులు మబ్బులా వాలిపోతాడా?
తన ఆకలి తీసేసుకునే మంత్రమేదో
తానే వేసుకోలేకపోతాడా?
ఒక్కసారి ఆలోచించండి..
నాలుగు కుక్క పిల్లలు
సంకలో చంటి పిల్లలతో,
తన సంచార శిలువను మోస్తూ
అతను దుఃఖపు నదిలా తరలిపోతుంటే,
ఎంతటి గులకరాయి లాంటి మనసైనా
జాలిగా తడిసిపోదా?
ప్రేమగా కరిగిపోదా?
-సందీప్ వొటారికారి
93902 80093