తాతల కాలం నుంచి తరాలుగా సంచార జీవనం సాగించిన గంగిరెద్దులోళ్ల కథ.. ఆత్మవిశ్వాసం నింపే అద్భుతమైన, ఆకట్టుకునే కథ.. ‘సంచారి’ నవల. రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ఈ నవల… కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా బయటపడాలో తెలియజెప్పే అద్భుతమైన వ్యక్తిత్వ వికాస గ్రంథం.
ఆదిమకాలంలో సంచార జీవిగా ఉన్న మానవుడు పరిణామక్రమంలో స్థిర నివాసం ఏర్పర్చుకున్నట్టు.. ఈ కథలో రాజలింగం అనే ఓ వ్యక్తి సంచార జీవితం వీడి గ్రామీణ జీవితాన్ని ప్రారంభిస్తాడు. అయినా… రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. తాను పడ్డ కష్టం తన పిల్లలు పడొద్దని ఆలోచించిన మంచి తండ్రి రాజలింగం. బతుకుదెరువు కోసం దుబాయ్ పోతాడు. ఏజెంటు మోసానికి గురై.. దేశంకాని దేశంలో జైలు జీవితం అనుభవిస్తాడు, అష్టకష్టాలు పడుతాడు. విదేశానికి పోయేటప్పుడు అలికిముగ్గేసిన వాకిలి లెక్కున్న సంసారం.. తిరిగి ఇంటికి వచ్చి చూస్తే పొక్కిలిపొక్కిలి అయినట్టు కనిపిస్తుంది. చేతిలో చిల్లిగవ్వలేదు, కుటుంబం గాడిలో లేదు. కంటిముందు అన్నీ సమస్యలే. మూడేండ్లు ఊళ్లో లేకపోతే పచ్చని సంసారం పుట్టెడు సమస్యల నిలయంగా మారడంతో చలించిపోతాడు.
కష్టాల బతుకును చక్కదిద్దుకుందామని దూరదేశం పోతే… అక్కడ అవస్థలు పడాల్సి వచ్చింది. బతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు మారింది. ఇంటికొచ్చి చూస్తే దారితప్పిన కొడుకు.. గాడితప్పిన బిడ్డ బతుకు. తనపై తప్ప ఎవరిపైనా కోపం చూపించలేని దయనీయమైన, నిస్సహాయురాలైన భార్య. ఎటుచూసినా సమస్యల సుడిగుండాలే.
కథ చదువుతుంటే… ‘ఇన్ని సమస్యల్లో ఇరుక్కున్న మనిషి జీవితం ముందుకెలా సాగుతుంది? అసలు ఇన్ని సమస్యలు పరిష్కారం అవుతాయా? ఒకవేళ అయితే ఎలా అవుతాయి?’ అని పాఠకుడికి అనిపిస్తుంది. కానీ, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్న రాజలింగం కథే ఈ ‘సంచారి’ నవల.
కుటుంబ కష్టాలతో, చదువులో, ఉద్యోగంలో, విదేశీ ఆశలు ఆవిరై… రకరకాల కారణాలతో బతుకు చిందరవందరగా మారి, కొందరు అధైర్యంతో విపరీత నిర్ణయాలు తీసుకున్న ఉదంతాలను మనం నిత్యం చూస్తున్నాం. సమస్యలు చుట్టుముట్టినప్పుడు చేసేదేమీ లేదని చేతులెత్తేసేవాళ్లు కొందరు. కానీ, మనిషి ఎంతటి దీనంగా ఉన్నా.. సమస్యలెన్ని ఉన్నా… ఎంత పెద్దగా ఉన్నా… శక్తిని, ధైర్యాన్ని మొత్తం కూడదీసుకుని…. సమస్యలపై సమరభేరి మోగిస్తే, ఆత్మవిశ్వాసంతో కొట్లాడితే… ఎంతటి సమస్యనైనా, ఎలాంటి స్థితిలోనైనా, ఎవ్వరైనా పరిష్కారించుకోగలరు. కష్టాలను దాటుకుని ఒడ్డున పడగలరు. అలా గట్టిగా నిలబడ్డవాళ్లు విజేతలుగా నిలుస్తారు. అలాంటి ఓ విజేతనే సంచారి నవలలోని మన కథానాయకుడు రాజలింగం.
చిందరవందరగా మారిన కుటుంబాన్ని తిరిగి చక్కదిద్దిన రాజలింగం స్ఫూర్తిగా నిలుస్తాడు. సమస్యలకు ఎవరినీ నిందించడు. సమస్యలకు పరోక్షంగా తను ఎంత వరకు కారణమో ఆలోచించుకుంటాడు. పరిష్కరించుకోవాల్సింది తనేనని నిర్ణయించుకుంటాడు. బాధ్యతను భుజాల మీద వేసుకుంటాడు. దిక్కుతోచని కుటుంబానికి దారిచూపే బాధ్యత తనదే అనుకుంటాడు. ఒక్కసారిగా మీదపడ్డ సమస్యలను పరిష్కరించాలంటే కూడా ఓ పద్ధతి ఉంటుందని మనకు బోధిస్తాడు రాజలింగం. ఒక్కో సమస్యను ఓర్పుగా, నేర్పుగా పరిష్కరిస్తాడు. సమస్యలను ఒకదాని తర్వాత ఒకటి ఎలా పరిష్కరించుకోవచ్చో నేర్పిస్తాడు. ఈ క్రమంలో అతని చాకచక్యం అబ్బురపరుస్తుంది.
రాజలింగం ధైర్యసాహసాలు పాఠకులకు ఓ వ్యక్తిత్వవికాస పాఠమనే చెప్పాలి. నమ్మించి మోసం చేసినవాళ్లకు ఎలా బుద్ధి చెప్పాడు? అనేది కూడా చాలా ఆసక్తికరం. నవలలోని ప్రతీ ఘట్టంలో రాజలింగంలో మనకు మనమే కనిపిస్తాం.
అతడు చూపిన ధైర్యం… మనతోని కూడా అయితది అనిపిస్తుంది. పుస్తకం చదువుతూ ఉండగా… మన మనసులోకి ఒక్కో అక్షరం… ఆత్మవిశ్వాసం నింపుతుంది. నీరసపడ్డ మనిషికి స్లైన్ ఎక్కుతున్న భావన కలుగుతుంది. సమస్యల సుడిగుండాన్ని ఎలా ఈదుతూ బయటపడొచ్చు? అందులో చిక్కుకున్న మనవాళ్లను ఎలా రక్షించుకోవచ్చు? అనే మార్గదర్శనం చేసే సంచారి నవల… ప్రతీఒక్కరూ చదవాలి. ఈ పుస్తకంలో రాజలింగం ఎదుర్కొనే సమస్యలే… మన జీవితంలో ఉండకపోవచ్చు. మనకు మరో రకమైన సమస్యలు ఉండొచ్చు. కానీ, ఎలా ఎదుర్కోవాలో చెప్పిన విధానం.. అందరికీ, అన్ని సమస్యలకూ వర్తిస్తుంది.