పల్లె తల్లి చేతిలో
పనిముట్లు ఉంటాయి
తలకు బట్ట కట్టుకొని చీర గోసిపెట్టి
వంగి నాట్లేసినప్పుడు
వరి నారు పిడికిట్లో
వంట చేసేటప్పుడు
ఎడమ చేతిలో తాసర
కుడి చేతిలో గంటె
కలుపుకొంటూ అమ్మ
కనబడుతుంటది
చేదురు బావి మీన
సేతాడు ఏసి
అమ్మ సేదినప్పుడు
చేతిలో తాడు కనబడేది
బాయిల నుంచి బకీట
అందుకొని
కడవలో నీళ్లు పోసినప్పుడు
కనబడే నీళ్ల దారేది
కడువ నింపుకొని కదిలేటప్పుడు
భుజం మీద నీళ్ల కడువ ఉండేది
రోట్లో కూరేసి రుబ్బినప్పుడు
రోకలి బండ చేతుల ఉండేది
పప్పు రుబ్బినప్పుడు
పప్పు గుత్తి పట్టుకొని ఉండాలి
అంట్లు తోమినంక
ఇంట్లో పెడుతుంటే
ఖాళీగెప్పుడు ఉన్నది కన్న తల్లి
కాదు కాదు కాదు కష్టజీవి రూపం
వరికోత కోసినప్పుడు
పనిముట్టు కొడవలి పట్టుకొని
పని చేసే తల్లులు పల్లెల్లో ఉంటారు
అభయహస్తం ఉన్న అమ్మ కానరాదు
అమ్మానాన్నల కాళ్లు మొక్కినప్పుడు
తల మీద చెయ్యి పెట్టి
ఎద మీద అంటారు
అభయ హస్తంతో అమ్మలు దీవించలేరు
కల్లాలు ఊడ్శిన కష్టజీవి అమ్మ
రాలిన గింజల రాశులను తూర్పారబట్టి
చేతిలో చాటలతో చెరిగింది గింజలు
చేసిన కష్టం చెమట చుక్కల ముఖం
అమ్మ
ఒడి కట్టుకొని ఒక్కొక్క కంకి
ఏరి ఒళ్లేసుకునేది వడ్డాణమెక్కడిది
ఒడి బరువు
కూలి తల్లి కురులకు నూనెనే లేదు
సిగ నిండా పూలు సింగారించింది లేదు
కాళ్లకు కడియాలు నడుముకొడ్డాణం
నగల సింగారంతో నా తల్లి ఎన్నడున్నది
ఆకలి ముఖముతో అమ్మ ఉన్నది కానీ
వరి మోపు మట్టి తట్ట
తల మీద మోసిన తల్లిరా మాయమ్మ
పల్లెలో కూలి తల్లి పట్నంలో పనిమనిషి
నన్ను గన్న తల్లి కష్టజీవే
ఖాళీ చేతులతోటి కనబడలేదు
అభయ హస్తం పెట్టిన అమ్మ కాదు
పసుపు పప్పు ఇసుర్రాయిలో ఇసిరినప్పుడు
ఎడమ చేతిలో ఇసుర్రాయి గుంజ
మంచేతి పిడికిట్లో గింజలు
అరచేతి హస్తము అమ్మ చూపింది కాదు
నట్టింట్లో రోలు నేల కుదురుపెట్టి రోకలితో
మాయమ్మ రోజు దంచిన ధాన్యం
పటేండ్ల ఇండ్లముందు పని మనిషి మాయమ్మ డొక్కలెండిపోయిన రెక్కలుర్సుకున్న
కష్టజీవి మాయమ్మ కనబడలేదు…
– దేవరపాగ కృష్ణయ్య 99634 49579