1980వ దశకంలో ‘ప్రతిఘటన’ అనే సినిమా విడుదలైంది. విజయశాంతి అద్భుత నటనతో పాటు కోట శ్రీనివాసరావు విలనిజం, తెలంగాణ భాషలో ఆయన చెప్పే డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా సూపర్ హిట్ అయింది. కానీ, ఆ తర్వాత తెలంగాణ మాండలికానికి దుర్గతి పట్టింది.
అనేక తెలుగు సినిమాల్లో విలన్లకు మాత్రమే తెలంగాణ మాండలికాన్ని పరిమితం చేసి, అది కూడా కృత్రిమమైన యాసతో పలికించడం పరిపాటి అయ్యింది. అత్యంత పురాతన వారసత్వం కలిగిన తెలంగాణ మాండలికాన్ని తద్వారా అపహాస్యం చేశారు. ఆ కాలంలో ఆ చిత్రాలను చూసిన ఆంధ్రా సోదరులు తెలంగాణ అంతా ఇలానే మాట్లాడుకుంటారని అనుకునేవారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత తెలంగాణ సాహితీవేత్తల రచనలు తెలంగాణ మాండలికాన్ని తిరిగి నిలబెట్టాయి. ఆ ఉద్యమాల్లో తెలంగాణ పల్లె పదం జీవనది అయ్యి ప్రవహించింది. గద్దర్, గోరేటి వెంకన్న, అందెశ్రీ, దేశపతి శ్రీనివాస్ ఇంకా అనేకమంది యువసాహితీవేత్తల పల్లె పదం ఉద్యమగానమై నిలిచింది. వారిచ్చిన స్ఫూర్తి కావచ్చు, నేడు యూట్యూబ్‌లో ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన పాటలలో ‘రాను బొంబైకి రాను..’ అనే తెలంగాణ జానపద పాట ఐదో స్థానంలో నిలిచింది. రాము రాథోడ్, ప్రభ ఆలపించిన ఈ పాట యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నది. పాలమూరు వాసి అయిన రాము ఈ పాటను రాశారు.
ఒకప్పుడు వెక్కిరించిన భాషకు నేడు యావత్ ప్రపంచం పట్టం కట్టిందనడానికి ఈ పాటే ఓ నిదర్శనం. ఈ పాటలో హంగులు, ఆర్భాటాలు లేవు. పాండిత్య ప్రకర్ష లేదు. గ్రామీణ తెలంగాణ పదాలలో ఇద్దరు తెలంగాణ ప్రాంత ప్రేమికుల మధ్య సంభాషణగా సాగిపోతుంది.
ఈ పాట ఎంత ప్రాచుర్యం పొందిందంటే దీనిపై చేసిన రీల్స్‌కు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ పాటలకు డాన్స్ వేసి విశేష ప్రాచుర్యం పొందిన టాంజానియా దేశస్థుడు కిల్పాల్, జపాన్ మహిళలూ ఈ పాటపై నృత్యం చేస్తున్నారు. ఈ పాటలో ఇద్దరు ప్రేమికుల మధ్య సరస సంభాషణలు, తెలుగు గ్రామీణ పదాలు భాషాప్రాంత భేదాలు లేకుండా ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ పల్లె పదం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ పాటలో ప్రియుడు తన ప్రియురాలిని నికార్సైన తెలంగాణ పదాలతో ‘అద్దాల మేడలున్నయే.. మేడల్లో మంచి చీరలుఉన్నయే.. చీరంచు రైకలున్నయి.. కొనిపిస్తా నాతో బొంబాయి రాయే..’ అని అంటాడు. ఇక్కడ తెలంగాణ పదాల నిగారింపు ‘రైకా’, ‘చీరంచు’ లాంటి మాటలు వాడారు. ‘సాలు అయ్యా సాలు’, ‘సాలు నీ ఝూటా మాటలు’, ‘సాలు నీ కుర్ర కోతలు’ అని ప్రియురాలు చెప్పే పదాలతో తెలంగాణ జాణతనం ఒక మెరుపు మెరిసింది.
గ్రామీణ తెలంగాణలో ‘సాలు తీయ్’, ఝూటా , ‘కోతలు’ అనే పదాలు విరివిగా వాడతారు. ‘పిల్లా’ అని ప్రియుడు చిలిపిగా పిలిస్తే ‘పొలగా’ అని ఆమె గడుసుగా సమాధానం ఇస్తుంది. ఇది తెలంగాణ ఆత్మీయ, అమాయక సంభాషణకు అద్దం పడుతున్నది. ‘నేను బొంబాయికి రాను ఆగం గాను..’ అని అమ్మాయి అంటుంది. ఇక్కడ ‘ఆగం’ అనే అచ్చ తెలుగు పదాన్ని ఉపయోగించుకున్నాడు రచయిత. ఈనాటికి తెలంగాణలో ‘ఆగం’ అనే మాటకు ఔచిత్యం ఉంది. రచయిత పాలమూరు వాడు కాబట్టి తన యాస, భాషకు పట్టం కట్టాడు. ప్రియురాలిని ‘పాలమూరి పంచవన్నెవే’, ‘పైస కట్నం నేనొల్లనంటినే’ అని అంటాడు. పాలమూరు జిల్లాకు పరిమితమైన ‘వల్లను’ అనే మాటను అందంగా వాడుకున్నాడు. కొం చెం గ్రాంథికం అయిన ప్రాణం అనే పదం కాక ‘పానం’ అనే అచ్చ తెలంగాణ పదాన్ని వా డుకున్నాడు. అచ్చ తెలంగాణ పదాల శబ్దం వినసొంపుగా ఉంటుంది.
ముఖ్యంగా ‘శారద కాండ్ర’ పాటలలో తెలంగాణ శబ్ద సౌందర్యం ప్రకాశిస్తుంది. అదే కాకుండా ‘గంగిరెద్దుల’ వాళ్లు పలికే తెలంగాణ అలతి పదాలు గాఢమైన ఆధ్యాత్మిక అనుభూతితో పాటు శబ్దనుడికార ధ్వని ఆస్వాదింపజేస్తాయి. పశువులను ‘జీవాలు’ అని, చనిపోవడాన్ని ‘జరిగిపోవడం’ అనే తాత్విక పదాలు తెలంగాణ పదకోశంలో ఉన్నాయి. తెలంగాణ భాష ప్రాచీన తెలుగు సాహిత్య పదాలు నిలుపుకొన్నదని భాషా శాస్త్రవేత్తలు ఏనాడో అంగీకరించారు. ఇప్పుడు వాడుతున్న ‘అన్నం’ అనే పదం సంస్కృత పదం. ‘బువ్వ’ అనేది అచ్చ తెలుగు పదం. అలాగే పెయ్యి (శరీరం), మొగులు (మబ్బులు), గొళ్లెం, కొలువు.. ఇవి నన్నయతో పాటు అనేకమంది ప్రాచీన కవులు వాడిన పదాలు.
భౌగోళికంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాకముందు సినారె, దాశరథుల వారసత్వం ఉన్నప్పటికీ తెలంగాణ కవులు ఈ పదాలను వాడటానికి సంశయించేవారు. కానీ అనతికాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాటలకు అచ్చ తెలంగాణ పదాలు ప్రాణం పోశాయి. ఈ మాండలికంలో అలవోకగా చేరిన ఉర్దూ పదాలు కూడా అందంగా ఒదిగిపోయాయి.
ఈ పరంపరలో తెలంగాణ యాసతో బిత్తిరి సత్తి, పల్లె రాములు, సదానందం, కొమరం వంటి వారు తమ ప్రతిభతో మరింత వన్నెతెచ్చారు. పత్రికారంగంలో ‘నమస్తే తెలంగాణ’ పత్రిక తెలంగాణ భాషకు పట్టం కట్టి తన వంతు కృషి చేసింది. ఈ నేపథ్యంలోనే చాలామంది ఔత్సాహిక గాయకులు తెలంగాణ భాషా సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తూ రాసిన అనేక పాటలు సామాజిక మాధ్యమాల్లో కొత్త హుషారును తీసుకువచ్చాయి. అంతకుముందు మంగ్లీ, కనకవ్వ, మధుప్రియ పాటలు విశేషంగా ఆకర్షిస్తే.. జానపద గాయని రచించి పాడిన ‘ఓ పిల్లగా వెంకటేశా..’ పెను సంచలనం సృష్టించింది. ‘నేను రాను బొంబాయి’ పాట కంటే ముందు ఈ పాట యూట్యూబ్‌ను ఒక ఊపు ఊపింది. ఇటీవల జానపద గాయని మల్లమ్మ పాడిన ‘ఎర్ర ఎర్రని రుమాలు గట్టి..’ పాట సంచలనం సృష్టించింది. ఈ పాటను రాజేంద్ర కొండా రచించారు. ఇలా పల్లె పాటలకు పట్టగట్టడం జానపద గాయకులకు స్ఫూర్తిదాయకం. మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ‘కోక్’ స్టూడియో నుంచి వచ్చిన ‘పసూరి’ అనే పాట ప్రపంచవ్యాప్తంగా జనాదరణ పొందినప్పుడు.. భారత్ నుంచి కూడా అటువంటి పాట ఒకటి వస్తే బాగుండు అని అనుకున్న దశలో మన తెలంగాణ జానపద పాట ఆ లోటును తీర్చింది.
ఏ భాష అయినా తక్కువ, ఎక్కువ అని ఉండవు. ప్రతి భాషలో ఒక తెలియని సొగసు ఉంటుంది. కృత్రిమత్వం లేకుండా భాషలో నుడికారాన్ని ప్రదర్శిస్తే ప్రతి భాష, యాస అందంగా ఉంటాయి. మనసును దోచుకుంటాయి. ఇప్పుడు తెలంగాణ జానపదం విశ్వవ్యాప్తమైంది. వెక్కిరించిన చోట తిరిగి గౌరవంగా తలెత్తుకుంది. భాషాభిమానులందరూ తెలంగాణ నుడికార సౌందర్యానికి జేజేలు పలుకుతుంటే ఆ నుడికారం కాళోజీ ఆత్మకు నేడు ప్రణమిల్లుతున్నది.
– చంద్రశేఖర్ 7506013691