పద్యం ప్రాచీనం. ఎన్నికలు ఆధునికం. సాహితీ ప్రవీణుడైన కవి ఏనుగు నరసింహారెడ్డి ఈ రెండింటికీ తన కవితా ప్రతిభతో వారధి కట్టి ప్రజలను చైతన్య శిఖరపు అంచులదాకా నడిపిస్తాడు. ప్రజల భాషలో పద్యాలను సరికొత్తగా మెరిపిస్తాడు. తన తెలంగాణ మట్టితల్లి మాటల నుడికారపు సొంపులతో ప్రజాస్వామ్యానికి మూలాధారమైన ఓటు విలువను బోధపరుస్తాడు. ప్రస్తుత సమాజపు ఎన్నికల తీరు తెన్నులను పాఠకులకు త్రీడీ చిత్రంగా చూపిస్తాడు. ‘ఏడుకోలల బాయి’ అనే ఎన్నికల శతకంలోకి పాఠకులను దింపి వారి హృదయాల్లో చైతన్య జల్లులను కురిపిస్తాడు.
సాధారణంగా కవి కంటి ముందు కదలాడిన దృశ్యం, ఆ కవి అనుభవంలోని ఒక విషయ ప్రభావం పద్యం, కథ, కవిత లేదా ఇతర ఏదైనా సాహితీ రూపకంగా ఆవిర్భవిస్తుంది. అంతటితో ఆగిపోక ఆ సాహితీ రూపకం ప్రభావం సంఘం మీద కూడా పడుతుంది. తద్వారా అజ్ఞానావస్థలో ఉన్న ప్రజానీకంలో జ్ఞానాన్ని ప్రజ్వలిస్తుంది. కవిగా, ప్రజాసేవకుడిగా, అడిషనల్ కలెక్టర్గా ఎదిగిన క్రమంలో ఏనుగు నరసింహారెడ్డి తన అనుభవంలోకి వచ్చిన వివిధ అంశాల నుంచి వారిలో పెంపొందిన భావ సముదాయం శక్తివంతమైనది. అది కవి చుట్టూ ఉన్న సమాజానికి ఎంతో శ్రేయోదాయకమైనది. ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటూ ప్రజలకు, నాయకులకు సరైన దిశా నిర్దేశం చేస్తూ నూతన సమాజ నిర్మాణానికి మార్గం చూపిందీ ‘ఏడుకోలల బాయి’ ఎన్నికల శతకం.
పారిశ్రామిక విప్లవం, జమీందారీ వ్యవస్థను పెకిలించింది. సమాజాన్ని అనేక విధాలుగా ముందుకు తీసుకువెళ్లింది. రాజులు, జమీందారుల కాలం పోయింది. రాజకీయ అధికారం ప్రజలకు, ప్రజలచే ఎన్నుకోబడిన వారి సొంతమైంది. వ్యవసాయరంగం నుంచి పారిశ్రామికరంగం వైపు మానవ వనరుల ప్రయాణం విస్తృతమైంది. పెట్టుబడిదారీ విధానానికి దారులు తెరుచుకున్నాయి. నగరీకరణ, ఆధునీకీకరణలతో ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు వచ్చాయి. నూతన భావాలు, ఆదర్శాలు మొలకెత్తాయి. ఫలితంగా కాలక్రమంలో ప్రజాస్వామ్య భావన పురుడు పోసుకున్నది. స్వేచ్ఛ, స్వాతంత్య్రాల పరిధి పెరిగింది. ప్రజల కొరకు, ప్రజల యొక్క, ప్రజల చేత ఏర్పడే ప్రభుత్వంగా వ్యవస్థ రూపొందింది. ఈ వ్యవస్థకు ఎన్నికలు మూలస్తంభమయ్యాయి.
పౌరులకు ఓటు హక్కు కల్పించబడి తద్వారా పాలకుడు ఎన్నుకోబడుతున్నాడు. కాకపోతే ఇక్కడ ప్రజల కోసం ఎన్నుకోబడుతున్న ప్రజా ప్రతినిధులు పలురకాల పార్టీలకు చెంది ఉండటం ఫలితంగా ప్రజా ప్రభుత్వం, పార్టీ ప్రభుత్వంగా వ్యవహరించడం సర్వకాలావస్థల్లోనూ చూస్తూ ఉన్నాం. ఫలితంగా ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతున్నది.
ప్రస్తుత వ్యవస్థలో ఎన్నికలు ఒక ఆట. ప్రజాస్వామ్యం పేరుతో ప్రజల నెత్తిన కుచ్చుటోపీలు పెట్టి, వారిని లాలిస్తుందో, పాలిస్తోందో తెలియని సందిగ్ధకర రాజకీయ పరిస్థితులు నేడు నెలకొని ఉన్నాయి. ఆ ఆవేదనల నుంచి పుట్టుకొచ్చినదే ఈ ‘ఏడుకోలల బాయి’ ఎన్నికల శతకం. ఈ శతకంలో లేనిదేది ఎన్నికల్లో లేదు. ఒక్కో పద్యాన్ని చదువుకుంటూ పోవడం తప్ప ఇంకేదో కొత్తగా విశ్లేషించాలని విమర్శకుడికీ అనిపించదు. మచ్చుకు ఈ పద్యం చూస్తే…
“ఓటరా! పరికించి ఒకసారి చూడరా/ అభ్యర్థి అనువాడి లభ్యచరిత/ పౌరుడా! క్యాండేటు పల్కులన్ ఆలించు/ సత్యమ్ము ఎంతొ? అసత్యమెంతొ?/ వారు జేసెడి గొప్ప వాగ్దానముల లిస్టు/ ఓర్పుగా చూడోయి తీర్పునివ్వ/ మాటకూ చేతకూ మాలావు దూరాలు/ పెట్టువాడిని కనిపెట్టి చూడు/ మనల జేరిన యపుడన్న మాట తీరు/ మనము వెళ్లిన వేళలో మడత బడుట/ లేని వాడెవ్వడో గాంచు లెక్కలేసి/ అతనికిచ్చేయి నీ ఓటు అదిరిపోవు!/ మాయమాటల హామీల మర్మమెరిగి/ గుర్తులేకుండా ఓటెట్ల గుద్దుతావు?/ ఓరి ఎంకన్న! దోస్తుగా! ఒర్లుబోతు!/ ఒక్కమాటన్న వినవార! తిక్కలోడ!” ఓటరుకు అందించాల్సిన చైతన్యాన్ని అక్షరమక్షరంలో కవి ఒలికించాడు.
ఎన్నికలు వచ్చినయంటే నేతలు చెప్పే మాటలకు, చేసే వాగ్దానాలకు అంతూ పొంతూ ఉండదు. కానీ పౌరుడు వివేచించగలగాలని కవి భావించాడు. ఇలాంటి పద్యాలను చదువుతున్నప్పుడు, ఆ భావాన్ని నెమరువేసుకుంటున్నప్పుడు నరసింహారెడ్డిలో దార్శనికుడు, మానవవాది ఎం.ఎన్.రాయ్ కనిపిస్తారు.
ఒక విధంగా కవి ఏనుగు కూడా ప్రజాభివృద్ధిని కాంక్షిస్తూ రెండు పార్టీలు చాలదా? ప్రజలు అభివృద్ధి పథంలో నడవడానికి అని ఉద్బోధిస్తాడు. సంఘ సం స్కరణను గట్టిగా సంకల్పిస్తూ నరసింహారెడ్డి రచించిన పద్యాలు పాఠకుల్లోనే కాదు, ఏలికల్లో నూ, ప్రజలందరి హృదయాల్లోనూ నిలిచిపోతాయి. ‘కవిత్వం కవిత్వం కోసం కాదు, అది సమాజ హితం కోసం అని నమ్మినవాడు’ అని నరసింహారెడ్డిని ఉద్దేశించి గుడిపాటి ప్రస్తావించిన మాటలు, ‘ఈ శతకం కవితా మ్యానిఫెస్టో’ అన్న ఆచార్య ఎస్.రఘు మాటలు అక్షర సత్యాలు.
– డాక్టర్ ఉప్పల పద్మ 99591 26682