ఏండ్ల తరబడి
ఎదురుసూపుల దర్వాజకు
యాలాడిన దోర్నపాలకుల
ఆకుపచ్చని ఆశ
ఆవిరయి ఎండిపోయింది
మనసును విడిచిపోని
పేగుబంధాన్ని
దగ్గరగా చూసుకొని చూసుకొని
కనిపెంచిన కండ్ల
దూరపు చూపు మందగించింది
ఎప్పుడన్నా ఒక్కసారి
చెవ్వానించి విన్నవో లేదో గానీ
ఇప్పటికీ ఊరి పిలుపు
గుండె కింద వినిపిస్తది
ఇయ్యాల నీకు గుర్తున్నదో లేదో
ఊరంటే
నా బంగారు కొండ అని
గుండెలకత్తుకొని
ఊపిన ఉయ్యాల
నీ చినిగిపోయిన నెక్కరు వయసు ఆటల్లో
అరిగిపోయిన జారుడు బండ
ఎల్లిపాయకారం తిన్నా
కన్న కడుపు
ఎంత తీపి ప్రేమతోని పెంచిందో
మమకారం కరువైన రోజుల్లో
మాటిమాటికి యాదికొచ్చేది
నిజం కాదా?
పై చదువుల కోసం
పైసా పైసా కూడబెట్టిన
తండ్రి కాళ్ళు
భరించిన ముండ్లెన్నో
నీ సుకుమారపు
సాఫ్ట్వేర్ బుర్రకు
ఎప్పటికీ అంతుచిక్కని
లెక్క కాదా?
లగ్జరీ బస్సెక్కేదాకా
నాయిన భుజాల మీదనే లగేజీ
నీ బరువు నువ్వు
మొయ్యడానికి
పరువు అడ్డమొచ్చిందా సోమరి తండ్రీ!
చదివిన సదువు
శరీరాన్ని బలహీనం
చేసిందా సుకుమారుడా!
నగరపు రోడ్డు దాకా
నిన్ను మోసిన బాధ్యత
గతుకుల బతుకు దారిలో
నడిచీ నడిచీ
అలిసిన పాదాల పగుళ్ళకు
మెత్తని చెప్పులు కొనియ్యని
ఉన్నత ఉద్యోగం
నాన్న గొప్ప పేరును మాత్రం
ఊరిజెండాపై
ఎగరేసిందా!?
నీ వైట్ కాలర్ ఉద్యోగానికి
ఖరీదైన బట్టల కింద
దాచినా దాగని
గర్వపు మురికి!
ఇంకా ఇంకా
బండబారిపోక ముందే
గుండె లోతుల్ల ఎక్కడన్నా
కొంచెం తడి
తగులుతుందేమో
తడుముకొని చూడు
నిన్ను నువ్వు ఉతుక్కోవడానికి!
– రహీమొద్దీన్ 90108 51085