‘రైతన్నకు వెన్నుదన్ను’ రైతుల పరోక్ష సేవలో పనిచేసిన వారి జీవన రేఖల సమాహారమని చెప్పవచ్చు. మన దేశం వ్యవసాయాధారిత దేశం. రైతు దేశానికి వెన్నెముక. రైతు అభివృద్ధికి సమగ్ర ఆధునిక సమాచారం సకాలంలో అందాలి. అలాంటి విశ్వసనీయత కలిగిన సమాచారాన్ని పరిశోధనల నుంచి రైతు పొలాల వరకు తీసుకెళ్లే వారే అసలైన వెన్నుదన్నులు. అలాంటి కృషిలో వివిధ మాధ్యమాల ద్వారా భాగస్వాములైనవారు ఎందరో. వీరిలో ఓ 50 మంది జీవనసారమే ఈ పుస్తకం.
ముఖ్యంగా ఆకాశవాణి, దూరదర్శన్ వ్యవసాయ విభాగాలలో ప్రత్యేకంగా నియమించబడి, పనిచేసిన వారందరి సేవలను రచయిత రికార్డు చేశారు. రేడియోటీవీ వ్యవసాయ ప్రసారకర్తలు చేసిన సేవలను వెలుగులోకి తెచ్చిన ప్రామాణిక పుస్తకంగా ’రైతన్నకు వెన్నుదన్ను’ను చెప్పవచ్చు. ఈ పుస్తకం పంటల సాగు పద్ధతులు, దిగుబడుల లెక్కలు చెప్పే సాంకేతి పరిజ్ఞాన గ్రంథం కాదు. ఇది రైతుకు వారికి కావలిసిన రీతిలో చెప్పటానికి వివిధ మాధ్యమాల ద్వారా పనిచేసిన వారి జీవనగాథల సంకలనం. వ్యవసాయ రంగానికి నిశ్శబ్దంగా సేవ చేసిన వారి కృషిని సమాజానికి పరిచయం చేయాలనే సంకల్పంతో తెచ్చిన ఒక స్ఫూర్తిదాయక రచన ఇది.
ఇందులో రచయిత కేవలం బయోగ్రఫీ మాత్రమే చెప్పకుండా, వారు ఎదుర్కొన్న కష్టాలు, గ్రామీణ జీవితంతో వారికున్న అనుబంధం, రైతు సమస్యల పట్ల వారి స్పందనను కూడా అంచనా వేశారు. వారు సూచించిన పరిష్కార మార్గాలు, అవి సాధించిన విజయాలను కథలాగా చెప్పి ఆకట్టుకున్నారు. పుస్తకంలోని ముఖ్యమైన కోణం ఏమిటంటే ఆధునిక వ్యవసాయ, అనుబంధ రంగాల సమాచారాన్ని రేడియో, టెలివిజన్, పత్రికా మాధ్యమాల మాధ్యమాల ద్వారా రైతులకు విజ్ఞానం ఎలా అందించారో స్పష్టంగా, సూటిగా చెప్పటంలో రచయిత చూపిన సృజన అభినందనీయం.
పుస్తకం చదువుతుంటే అనేక విషయాలు మనసును హత్తుకుంటాయి. చాలామంది అధికారులు, శాస్త్రవేత్తలు వ్యక్తిగత లాభం కన్నా రైతు ప్రయోజనాన్ని ముఖ్యంగా చూశారు. దూరగ్రామాలకు వెళ్లి రైతులకు ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చిన సంఘటనలు, కొత్త సాంకేతికతలను పరిచయం చేసిన విధానం, రైతు సమస్యలపై నిరంతర శ్రద్ధ చూపిన తీరు ఇవన్నీ పాఠకుడిని కట్టిపడేస్తాయి. ఇది కేవలం సమాచార గుచ్ఛం మాత్రమే కాదు, స్ఫూర్తిని నింపే పుస్తకమని చెప్పవచ్చు.
భాష సరళంగా, సహజంగా ఉంది. గ్రామీణ పాఠకుడికీ అర్థమయ్యే భాషలో రచయిత వివరించారు. సూటిగా విషయాన్ని చెప్పడం, సరళత, స్పష్టత, భావోద్వేగం, గౌరవ భావం వంటి లక్షణాలు ఈ పుస్తకంలో దండిగా ఉన్నాయి. ఇది ఒక చారిత్రక డాక్యుమెంటేషన్లా ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసినవారి సేవలు చాలాసార్లు రికార్డుల్లో మిగలవు. ఆ బాధ్యతను ఈ పుస్తకం సమర్థంగా నిర్వర్తించింది. వ్యవసాయ విద్యార్థులు, జర్నలిజం విద్యార్థులు, విస్తరణాధికారులు, పరిశోధకులు – అందరికీ ఇది ఒక రిఫరెన్స్ పుస్తకంగా ఉపయోగపడుతుందనీ చెప్పవచ్చు.
కొన్ని చోట్ల జీవితచరిత్ర వివరాలు ఎక్కువగా ఉండటం వల్ల కథనం కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. అయితే డాక్యుమెంటరీ తరహా గ్రంథానికి ఇది సహజ లక్షణమే. రైతు అభివృద్ధి వెనుక ఉన్న మనుషుల గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ జీవితానికి సంబంధించి సుమనస్పతి రెడ్డి తీసిన ఛాయాచిత్రాలు పుస్తకం విలువను పెంచాయి. అలాగే మందలపర్తి కిశోర్ ముందుమాట, తోట భావనారాయణ పరిశోధన చేసి వెలికి తీసి రాసిన వ్యాసం అదనపు విలువను చేర్చాయి. డాక్టర్ టీఎల్ఎన్ స్వామి డిజైన్, ముఖచిత్రం చక్కగా ఉన్నాయి. రచయిత తన కృషికి పరిమితులు పెట్టుకోకుండా ఇంకా విస్తరించినట్టయితే ఇంకా బాగుండేది. ఆసక్తి కలవారు పుస్తక రచయిత గోపీచంద్‌ను (9441276770) సంప్రదించ వచ్చు.
– సుక్కన్న