సద్దుల బతుకమ్మ రోజు తెలంగాణ మొత్తం పూల సందోహమే! సద్దుల బతుకమ్మ ఎన్నో సుద్దులు నేర్పుతుంది. సుద్దులు అంటే మంచి మాటలు. సుధ అంటే అమృతం. అమృతమంటే మంచి అని అర్థం. నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె పంచామృతాలు. ఇవి ఆరోగ్యానికి మేలు చేసేవి. ఇలాంటి మంచి మాటలను చెప్పేవే సుద్దులు. ఇవి శుద్ధమైనవి. ఈ సుద్దులు ఎవరు చెప్తారని ఒక ప్రశ్న వేసుకుంటే సుద్దులు చెప్పేవారు శుద్ధాత్ములై, స్వచ్ఛమైన ఆత్మలై ఉంటారు. ఉండాలి.
మహాలయ అమావాస్య మొదలు దశమి వరకు తంగేడు వంటి రకరకాల పూలను పళ్లెంలో పేర్చి పసుపు కుంకుమలతో గౌరమ్మను చేసి పెట్టి పూజించి ఆటపాటలతో బతుకమ్మను సంప్రదాయంగా సాగనంపుతారు. గౌరీదేవికి చేసే పూల పండు గ. ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి రోజు నుంచి తొమ్మిది రోజులపాటు వరుసగా జరుపుకొని దుర్గాష్టమి రోజు, పదవ రోజు సద్దుల పండుగను చేసి బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు.
బతుకు అంటే జీవితం. బతుకు అంటే జీవన స్థితి. జీవాన్ని పొందిస్తుంది. జీవించేలా చేస్తుంది. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేస్తుంది బతుకు రుచిని చూపిస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆనంద ఉత్సాహాలతో చేసుకునే పండుగ.
పండుగలు అంటే నలుగురు కలిసి చేసుకునేవి, నా లుగు కొత్త విషయాలు తెలుసుకునేవి నాలుగు సంతోషకరమైన సందర్భాలను హృదయ పేటికలో నిలుపుకునేవి. బతుకమ్మ పండుగ జీవ వైవిధ్యం ప్రస్ఫుటించేది. ఎన్నో విశిష్టతలను తనలో దాచుకున్న బతుకమ్మ ఆడపడుచుల మనోభావాలను పూల అందాలలా, పూల కింద ముళ్ళలా ఎన్నో అంశాలను వెలికితీస్తుంది, బోధిస్తుంది. బతుకమ్మ పండుగలో 1.కళాత్మకత 2.శ్రమ సౌందర్యం 3.ఆధ్యాత్మికం అనే మూడు విషయాలు ఉంటాయి. పూలతో చేసే అలంకరణ నైపుణ్యం కళాత్మక దృష్టితో చూస్తే ఒకవిధంగా ను శ్రమ దృష్టితో చూస్తే ఒక విధంగానూ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే మరో విధంగాను కనిపిస్తుంది బతుకమ్మ.
బతుకమ్మ పండుగ సుద్దులు మూడు విధాలు 1.సంస్కృతి వార సత్వాన్ని చెప్పేవి. 2.లౌకిక జీవన విధానం నేర్పేవి. 3.భావ చైతన్యం కలిగించేవి. సాంస్కృతిక వారసత్వం అంటే ప్రాంత ఆచార వ్యవహారాలు పౌరాణిక కథలు, చారిత్రక సత్యాలు, కౌటుంబిక జీవన విధానాలు నేర్పించే పద్ధతులుండటం. ముఖ్యంగా బతుకమ్మ పాటల సాహిత్యం ఇందుకు ఉదాహరణ.
లౌకిక జీవన విధానాన్ని నేర్పే బతుకమ్మ ఆటలు పాటలు స్వయంగా బోధకులు. ఇవి అందరూ కలిసి చేస్తారు కాబట్టి సమష్టి భావన, ఆధ్యాత్మిక చింతన, శుచి శుభ్రత వంటివెన్నో నేర్పిస్తాయి.
భావ చైతన్యం కలిగించే సందర్భం బతుకమ్మ పం డుగ రోజులలో స్త్రీలు పురుషులు సమానులే. ప్రత్యక్షంగా ఆడవాళ్లు, పరోక్షంగా మగవాళ్లు! భావచైతన్య స్ఫూర్తి ప్రదాత బతుకమ్మ పండుగ. బతుకమ్మ పాటల ద్వారా కలివిడితనం, ఇతరులతో సంభాషించడం, ధైర్యంగా భావాన్ని చెప్పగలగడం తెలుస్తాయి. భారతీయ సంసారిక జీవన విధానానికి ఒక విజన్‌ను ఇచ్చే పండుగ.
బతుకమ్మ పాటలు శక్తినిస్తాయి. ఆటలలో శక్తి ఖర్చవుతుంది. లయాత్మకంగా చప్పట్లు కొడుతూ గొంతెత్తి రాగ భావయుక్తంగా పాడటంతో స్త్రీలు శక్తివంతులైనారు. లౌకిక జీవనానికి కావలసిన మనోబలాన్ని ఈ సామూహిక భాగస్వామ్యంతో సంపాదించుకుంటారు. సద్దుల బతుక మ్మ సంబురాల బతుకమ్మ, ఎన్నో సుద్దు లు నేర్పుతుంది.
(అక్షరయాన్ సౌజన్యంతో)
– డా. కొండపల్లి నీహారిణి